Monday, March 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'రహదారి భద్రత' పేరుతో బాదుడు

‘రహదారి భద్రత’ పేరుతో బాదుడు

- Advertisement -

వాహనదారులకు షాక్‌
కొత్త బండి కొనేవారిపై తప్పని అదనపు భారం
టూవీలర్‌కి 2 వేలు, కార్లకు 5 వేలు, ఆపైవాటికి 10 వేలు..
ఏటా రవాణాశాఖకు 250 కోట్లకుపైనే ఆదాయం
రాష్ట్రవ్యాప్తంగా మొదలైన కొత్త బాదుడు
అధికారుల తీరుపై వాహనదారుల మండిపాటు


నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిన రవాణా శాఖ మరో పిడుగు వేసింది. ‘రహదారి భద్రత పన్ను’ పేరుతో వాహనదారుల జేబులకు చిల్లు పెట్టేందుకు సర్కారు రెడీ అయ్యింది. ఆదాయమే పరమావధిగా అడుగులు వేస్తున్న రవాణా శాఖ.. సామాన్యుడి నడ్డి విరిచేలా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారి భద్రత పన్ను పేరుతో విధించనున్న ఈ కొత్త చార్జీలు వాహనదారులకు షాక్‌ ఇస్తున్నాయి.

ఈ కొత్త నిబంధనలు ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. కొత్తగా టూ వీలర్‌ కొనుగోలు చేసేవారు ఇకపై అదనంగా రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. కార్లు లేదా ఇతర నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. రూ.10వేలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. దాంతో షోరూమ్‌ నుంచి బండి బయటకు రావాలంటే.. రిజిస్ట్రేషన్‌, లైఫ్‌ టాక్స్‌, ఇన్సూరెన్స్‌తో పాటు ఈ కొత్త పన్ను కూడా కలిపి వాహన ధరలు భారీగా పెరగనున్నాయి. గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల్లో వాహనాలు రోడ్డెక్కుతున్న విషయం తెలిసిందే.

ఏటా రూ.250కోట్లకుపైనే ఆదాయం
రహదారి భద్రతా చర్యల కోసమే ఈ సెస్‌ వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త పన్ను విధానం ద్వారా రవాణా శాఖకు ఏటా సుమారు రూ. 250 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులను రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, భద్రతా ప్రమాణాలు పెంచడానికి వినియోగించనున్నట్టు సమాచారం. అయితే, రవాణా శాఖ తన ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో భాగంగానే వాహనదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే వాహన ధరను బట్టి ‘సర్వీస్‌ చార్జీ’లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో వసూలు చేసే రుసుములను పెంచిన రవాణా శాఖ, ఇప్పుడు ‘రోడ్‌ సేఫ్టీ సెస్‌’ పేరుతో మరోసారి వాహనదారులపై భారం మోపుతోంది.

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
రవాణా శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రహదారి భద్రతకు నిధులు సేకరించడం మంచి విషయమే అయినప్పటికీ, ఈ స్థాయిలో పన్నులు విధించడం అన్యాయమని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రోడ్ల మీద గుంతలు పూడ్చరు, సరైన సిగలింగ్‌ వ్యవస్థ ఉండదు, కానీ పన్నులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. టూ వీలర్‌పై రూ. 2వేలు అంటే సామాన్యుడికి చిన్న విషయం కాదు. ఇది అడ్డగోలు దోపిడీనే’ అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాహనాల తయారీ వ్యయం పెరిగి షోరూమ్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ సమయంలో అదనంగా వేల రూపాయలు చెల్లించాల్సి రావడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు యూనియన్‌ నాయకులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకే..
దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రోడ్డు భద్రతా చట్టాన్ని” తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రమాదాల నివారణకు, బాధితుల సహాయార్థం ప్రత్యేక నిధి అవసరమని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ సెస్‌ విధింపును తప్పనిసరి చేసినట్టు సంబంధిత అధికారులు చెబుతుండగా.. వసూలు చేసిన ఈ మొత్తాన్ని ‘రోడ్డు భద్రతా నిధి’గా జమ చేస్తారు. ఈ నిధులను రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచడం, రోడ్డుపై నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, డ్రైవింగ్‌ ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తారు. మొత్తానికి, కొత్త బండి కొనాలనుకునే వారికి ఈ ‘సెస్‌’ రూపంలో అదనపు ఖర్చు తప్పదని చెప్పక తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -