Monday, October 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబడుగుల ఆశాజ్యోతి వెంకటస్వామి

బడుగుల ఆశాజ్యోతి వెంకటస్వామి

- Advertisement -

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆయన వారసత్వాన్నే కాంగ్రెస్‌ కొనసాగిస్తోంది : మంత్రులు జూపల్లి, వివేక్‌, పొన్నం, వాకిటి
ఘనంగా కాకా 96వ జయంతి వేడుకలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి బడుగుల ఆశాజ్యోతి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాకా 96వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాకా జీవితాంతం పోరాడారని కొనియాడారు. దళిత, బలహీన వర్గాల పక్షాన ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగిన సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాకా చూపిన మార్గంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందనీ, సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతే పార్టీ లక్ష్యమని నొక్కిచెప్పారు.

సింగరేణిలో 40 ఏండ్ల క్రితమే 30 వేల మందికి ఇండ్ల స్థలాలు అందించిన ఘనత అయనకే దక్కుతుందని అన్నారు. అంబేద్కర్‌ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి 2 లక్షల మందిని ప్రయోజకులను చేశారని గుర్తుచేశారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన కాకా చివరి వరకు నిరాడంబరంగా జీవించారని కొనియాడారు. పీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల గొంతుకగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత వెంకటస్వామి అని అన్నారు. ఆయన చూపిన మార్గం, విలువలు, సమానత్వం, న్యాయం, సేవా భావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం 1949లో ‘జాతీయ గుడిసెల సంఘం’ను స్థాపించి హైదరాబాద్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -