Sunday, December 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపింఛన్‌ పైసలతో ఢిల్లీకి మూటలు

పింఛన్‌ పైసలతో ఢిల్లీకి మూటలు

- Advertisement -

రేవంత్‌ ఒక్క భాషలో తిడితే.. నాకు నాలుగు భాషలు వచ్చు
సర్పంచుల నిధులు ఎవరూ ఆపలేరు
సెమీఫైనల్‌.. ఫైనల్‌ ఎన్నికలు ముందున్నాయి : మహబూబాబాద్‌లో సర్పంచ్‌ల సన్మానంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ-మహాబూబాబాద్‌
”రాష్ట్రంలో రైతులకు రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ సీఎం రేవంత్‌ రెడ్డి.. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పేదలకు పెంచి ఇవ్వాల్సిన పింఛన్‌ డబ్బులను ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నారు” అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శనివారం మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు మాలోతు కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు 1500 మంది గెలిచారన్నారు. బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లకు నిధులు ఇవ్వబోమని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని.. కానీ రాజ్యాంగం, ఫైనాన్స్‌ కమిషన్‌ నిబంధన ప్రకారం కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయికీ 85 పైసలు నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లో పడతాయని చెప్పారు. ఏ గొట్టంగాడూ నిధులు ఆపలేడని, సర్పంచ్‌లు మరింత స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

”సర్పంచ్‌ ఎన్నికలు క్వార్టర్‌ ఫైనల్‌ మాత్రమే.. ముందు మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సెమీఫైనల్‌.. 2028లో ఫైనల్‌ ఎన్నికలు ఉన్నాయి.. కేసీఆర్‌ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యం” అని కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డికి ఒకటే భాష వచ్చు అని తనకు నాలుగు భాషలు వచ్చు అని, తాను నాలుగు భాషల్లో తిట్టగలనని, కానీ.. తనకు సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. కేసీఆర్‌ రైతులు అడగకుండా.. దరఖాస్తు చేయకుండా 11సార్లు రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌ వచ్చాక రెండుసార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో కౌలు రైతులకు రైతుబంధు ఇస్తానని, అత్తకు రూ.4వేల పింఛన్‌, కోడలుకు రూ.2500 ఆత్మీయ భరోసా ఇస్తానని, కల్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, రేవంత్‌ తులం బంగారం ఇచ్చే టైపు కాదని, మెడలో ఉన్న పుస్తెలతాడు ఎత్తుకుపోయే టైపు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు డిఎస్‌ రెడ్యా నాయక్‌, శంకర్‌ నాయక్‌, హరిప్రియ నాయక్‌, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్‌, కెఎస్‌ఎన్‌.రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -