న్యూఢిల్లీ : భారత పార్లమెంటులో 2023 డిసెంబర్‌లో చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన కేసుకు సంబంధించి నిందితులకు బెయిల్ లభించింది. ఇద్దరు నిందితులు నీలం ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అనంతరం నిందితులు నీలం ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు ఒక్కొక్కరికి రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతేమొత్తానికి ఇద్దరు పూచీకత్తుపై న్యాయస్థానం వారికి బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దనీ, సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని ధర్మాసనం వారిని ఆదేశించింది. గతంలో ట్రయల్ కోర్టు వారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, దానిని సవాలు చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ‘2001 పార్లమెంటు ఉగ్రదాడి’ రోజు 2023, డిసెంబర్‌లో లోక్‌సభలో ఒక పెద్ద భద్రతా ఉల్లంఘన చోటు చేసుకున్నది. నిందితులు సాగర్ శర్మ, డి.మనోరంజన్‌లు జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్‌లోకి దూకారు. డబ్బాల నుంచి పసుపు వాయువును విడుదల చేసి, నినాదాలు చేశారు. ఆ తర్వాత కొంత మంది ఎంపీలు వారిని నిరోధించే యత్నం చేశారు. దాదాపు అదే సమయంలో మరో ఇద్దరు నిందితులు అమోల్ షిండే, ఆజాద్‌లు పార్లమెంటు వెలుపల ‘తానాషాహి నహీ చలేగి(నియంతృత్వం పని చేయదు)’ అనే నినాదాలు చేస్తూ తమ వెంట తెచ్చుకున్న డబ్బాల నుంచి వాయువును వదిలారు.