న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసు 2020 కేసులో నిందితుల్లో మరొక వ్యక్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల్లో ఒకరు, కాల్ సెంటర్ మాజీ ఉద్యోగి అథర్ ఖాన్ అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పారు ముందు ఈ బెయిల్ పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటీషన్‌ను ఈ నెల 19కి కోర్టు విచారణకు జాబితా చేసింది. అథర్‌ఖాన్ రహస్య సమావేశాల్లో పాల్గొన్నాడని, విద్వేష పూర్వక ప్రసంగాలు చేశాడని, సీసీటీవీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక సమావేశాల నిర్వహకులు, వక్తలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిలో అథర్‌ఖాన్ ఒకరు. అలాగే, అల్లర్ల సమయంలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌ను మూక హత్య చేసిన గుంపులో అథర్‌ఖాన్ కూడా ఒకరిని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, సలీమ్ ఖాన్, షాబాద్ అహ్మద్‌లకు సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేసింది. ఈ నేపథ్యంలో అథర్‌ఖాన్ కూడా బెయిల్ దాఖలు చేశారు. ఈ నెల 6న ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న జైల్లో ఉన్న మరొక నిందితుడు సలీం మాలిక్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉన్నారు.



