Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంబాలల సృజనాత్మకతకు బాల పురస్కార్‌

బాలల సృజనాత్మకతకు బాల పురస్కార్‌

- Advertisement -

రాష్ట్రపతి చేతుల మీదుగా 20 మంది బాలలకు అందజేత…తెలంగాణలో విశ్వనాథ్‌, ఏపీలో శివానికి అవార్డు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బాలల సృజనాత్మకతకు పురస్కారాలు లభించాయి. విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’ ప్రదానోత్సం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులకు అవార్డులను ప్రదానం చేశారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన 20 మంది బాలలకు ఈ పురస్కారాలను అందజేశారు. తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ కార్తికే పడకంటి స్పోర్ట్స్‌ విభాగంలో బాల పురస్కార్‌ అందుకున్నారు. విశ్వనాథ్‌ ఎలాంటి పర్వతాలనైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఆయన సాహసానికి ఈ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ని అన్నమయ్య జిల్లాకు చెందిన శివాని హౌసురు ఉప్పర స్పోర్ట్స్‌ విభాగంలో బాల పురస్కార్‌ అందుకున్నారు.

వికలాంగురాలైన ఆమె పారా అథ్లెట్లు. షాట్‌ పుట్‌, జావెలిన్‌ త్రోలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడల్లో ఎనిమిదికిపైగా మోడల్స్‌ సాధించారు. కరెంట్‌ షాక్‌ నుంచి ఓ బాలుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల చిన్నారి వ్యోమ ప్రియ (కోయంబత్తూరు, తమిళనాడు) తరపున ఆమె తల్లి అర్చనా శివరామకృష్ణన్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తెను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నదిలో ఈత కొడుతున్న సమయంలో తోటి స్నేహితుడిని కాపాడే సమయంలో తన ప్రాణాలను విడిచిన బీహార్‌లోని కైమూర్‌ జిల్లాకు చెందిన కమలేశ్‌కుమార్‌, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సైనికులకు మంచినీరు, పాలు, టీ, లస్సీ వంటివి అందిస్తూ బాసటగా నిలిచిన పదేండ్ల బాలుడు శ్వాన్‌ సింగ్‌ (ఫిరోజ్‌పూర్‌, పంజాబ్‌) అవార్డును అందుకున్నారు.

బీహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ, ఆగ్రాకు చెందిన అజయ్ రాజ్‌, మహారాష్ట్రకు చెందిన అరవ్‌ అనుప్రియ మహర్షి సహా మరికొంతమంది చిన్నారులు ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందుకున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణమని ఆమె ప్రశంసించారు. ఈ అవార్డులు దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. బాలలు దేశభక్తి, ఉన్నత ఆదర్శాలతో నిండి ఉన్నప్పుడే ఒక దేశం గొప్పతనం కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏడేండ్ల చిన్నారి వాకా లక్ష్మీ ప్రాగ్నిక వంటి ప్రతిభావంతులైన బాలలలతోనే దేశం ప్రపంచ వేదికపై చెస్‌ పవర్‌హౌస్‌గా పరిగణించబడుతుందని అన్నారు. తమ ధైర్యం, తెలివితేటలతో ఇతరుల ప్రాణాలను కాపాడిన అజయ్ రాజ్‌, మహమ్మద్‌ సిదాన్‌ వారు ప్రశంసలకు అర్హులన్నారు.

తొమ్మిదేండ్ల చిన్నారి వ్యోమ ప్రియ, పదకొండేండ్ల ధైర్యవంతుడైన బాలుడు కమలేశ్‌ కుమార్‌ తమ ధైర్యంతో ఇతరుల ప్రాణాలను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పదేండ్ల శ్రవణ్‌ సింగ్‌ తన ఇంటికి సమీపంలోని సరిహద్దులో ఉన్న సైనికులకు క్రమం తప్పకుండా నీరు, పాలు, లస్సీని అందించాడని తెలిపారు. కాగా, వికలాంగురాలైన శివాని హౌసురు ఉప్పర ఆర్థిక, శారీరక పరిమితులను అధిగమించి క్రీడా ప్రపంచంలో అసాధారణ విజయాలు సాధించిందన్నారు. అత్యంత పోటీతత్వం, ప్రతిభతో నిండిన క్రికెట్‌ ప్రపంచంలో వైభవ్‌ సూర్యవంశీ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడని, అనేక రికార్డులు సృష్టించాడని తెలిపారు. అలాంటి ధైర్యవంతులు, ప్రతిభావంతులైన చిన్నారులు మంచి పనులు చేస్తూనే ఉంటారని, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తారని ఆమె కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -