Saturday, March 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణస్వీకారం

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణస్వీకారం

- Advertisement -

15 మందితో మంత్రివర్గం
భారత ప్రధాని మోడీ అభినందనలు

ఖాట్మాండు : నేపాల్‌ నూతన ప్రధానమంత్రిగా బాలేంద్ర షా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఖాట్మాండులోని అధ్యక్ష భవనం ‘శీతల్‌ నివాస్‌’లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు రామ్‌ చంద్ర పౌడెల్‌ బాలేంద్ర షా చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నేపాల్‌ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా బాలేంద్ర షా రికార్డు సృష్టించారు. ఈ నెల 5న జరిగిన నేపాల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 275 మందితో కూడిన ప్రతినిధుల సభలో కేవలం నాలుగేండ్ల క్రితం ఏర్పడిన ఆర్‌ఎస్‌పీ 182 స్థానాలను గెలుచుకుంది. గురువారం జరిగిన సమావేశంలో ఆర్‌ఎస్‌పీ నాయకుడిగా బాలేంద్ర షాను ఎన్నుకోవడంతో 2015 నుంచి అమల్లోకి వచ్చిన నేపాల్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(1) ప్రకారం షాను ప్రధానమంత్రిగా అధ్యక్షులు పౌడెల్‌ నియమించారు.

ఈ ఆర్టికల్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. షా ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత 15 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రి పదవితో పాటు రక్షణ, పరిశ్రమల శాఖ బాధ్యతలను కూడా షా పర్యవేక్షిస్తారు. ప్రముఖ ఆర్థిక వేత్త, జాతీయ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు స్వర్ణిమ్‌ వాగ్లే ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిగా శిశిర్‌ ఖనాల్‌, విద్యాశాఖ మంత్రిగా సష్మిత్‌ ఖరేల్‌ వ్యవహరించనున్నారు. ఇక గత సెప్టెంబర్‌లో జరిగిన జెన్‌ జెడ్‌ ఆందోళనలకు నేతృత్వం వహించిన సుధన్‌ గురుంగ్‌ హోం మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అలాగే, ప్రతిభా రావల్‌ (సాధారణ పరిపాలన), ఖడ్గ రాజ్‌ పౌడెల్‌ (పర్యాటకం), సునీల్‌ లమ్సల్‌ ( మౌలిక సదుపాయాలు), గీతా చౌదరి (వ్యవసాయం), నిషా మెహతా (ఆరోగ్యం), సీతా బాడీ (మహిళా, శిశు సంక్షేమం), సోబితా గౌతమ్‌ (చట్టం), బిక్రమ్‌ తిమిల్సినా (కమ్యూనికేషన్స్‌), బిరాజ్‌ భక్త శ్రేష్ఠ (ఇంధనం), దీపక్‌ సాహ్‌ (కార్మిక) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

నేపాల్‌ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షాకు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనం కోసం భారత్‌-నేపాల్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి షాతో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని మోడీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. గత సెప్టెంబరులో జరిగిన జెన్‌ జెడ్‌ ఆందోళనలతో అప్పటి కెపి శర్మ ఓలి ప్రభుత్వం కుప్పకూలి పోయిన సంగతి తెలిసిందే. తరువాత మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -