Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం60 రోజుల పాటు గడ్డిమందుపై నిషేధం

60 రోజుల పాటు గడ్డిమందుపై నిషేధం

- Advertisement -

నిబంధనలు ఉల్లంఘించి అమ్మితే కఠిన చర్యలు
యూరియా నిల్వలపై దృష్టి సారించండి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పారాక్వాట్‌ గడ్డి మందు అమ్మకాలను 60 రోజుల పాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందనీ, నిబంధనలు ఉల్లంఘించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడిలపై రైతులను ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనుమతి లేని హెచ్‌టీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ, ఆయిల్‌ ఫెడ్‌ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కలుపు నివారణ కోసం వాడే గడ్డిమందును క్షణికావేశంలో తాగి రాష్ట్రంలో ఇప్పటివరకు 1167 మరణించారని తెలిపారు.

అది మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోందనీ, ఈ నేపథ్యంలోనే పారాక్వాట్‌ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ, వినియోగంపై తక్షణ నిషేధం విధించామని తెలిపారు. ఆన్‌లైన్‌ అమ్మకాలపైనా గట్టి నిఘా పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల 86 మండలాల్లో 31,504 ఎకరాల్లో ప్రాథమికంగా పంట నష్టం జరిగినట్టు అధికారులు నివేదించగా… పూర్తి వివరాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. జూన్‌, జులై నెలల వరకు యూరియా బఫర్‌ స్టాక్‌ను వీలైనంత అధికంగా ఉండేలా చూస్తే రైతులకు ఇబ్బంది రాదన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణలో రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా మార్చడానికి సాధ్యసాధ్యాలు పరిశీలించి, ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి చెందిన ఇద్దరు, ముగ్గురు యువకులకు నేల ఆరోగ్యంపై శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకులు తమ గ్రామాల్లో కనీసం పది మంది రైతుల భూసార పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి సాయిల్‌ హెల్త్‌ వాలంటీర్లను ఎంపిక చేసి వారితో పాటు జిల్లా వ్యవసాయ అధికారులకు ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో ఇక్రిశాట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోకో నట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు.

ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీడీఏ ఫార్మ్‌ గరిమెళ్ళపాడులో ఆయిల్‌ పామ్‌ సెకండరీ నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయిల్‌ ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. ఇక్రిశాట్‌లోని వందెకరాల్లో సెంటర్‌ అఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. అప్పుడే కొడంగల్‌లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వీలుంటుందని తెలిపారు. గద్వాల జిల్లా బీచ్‌పల్లిలోని ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -