Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహాస్టల్స్‌కు నిత్యావసరాలు బంద్‌

హాస్టల్స్‌కు నిత్యావసరాలు బంద్‌

- Advertisement -

– నేటి నుంచి కూరగాయలు, పండ్లు, చికెన్‌, మటన్‌, గుడ్లు సరఫరా నిలిపివేత
– కొత్త టెండర్‌ విధానంపై సప్లరుదారుల ఆందోళన
– సంక్షేమ హాస్టళ్ల టెండర్‌ కార్పొరేట్‌కు అప్పగించే కుట్ర
– పాత విధానం కొనసాగించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌
– ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 300హాస్టల్స్‌లో వేలాది విద్యార్థుల భోజనానికి ఎసరు
నవతెలంగాణ – కరీంనగర్‌

జిల్లా సంక్షేమ హాస్టళ్లకు సోమవారం నుంచి కూరగాయలు, పండ్లు, చికెన్‌, మటన్‌, కోడిగుడ్ల సరఫరా నిలిచిపోనుంది. కొత్త టెండర్‌ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సప్లరుదారులు, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు, జోనల్‌ ఆపీసర్‌, డీసీఓ పాయింట్‌ ఆల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్స్‌కు వినతిపత్రం అందజేశారు. 25 సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 300పైగా హాస్టళ్లకు ఆహార సరుకులు సరఫరా చేస్తున్న సప్లరుదారులు, ఈసారి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త టెండర్‌ విధానం తమకు ఆర్థికంగా ముప్పు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఈఎండీ, కఠినమైన షరతులు, తక్కువ సరఫరా సమయాలు, కోడిగుడ్ల సరఫరా విధానంలో మార్పులు తమ సామర్థ్యానికి మించి ఉన్నాయన్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా సరఫరా చేసిన బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బారిన పడ్డామని గోడు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆదివారం 70శాతం హాస్టళ్లకు చికెన్‌ సరఫరా కాలేదని సమాచారం.
కొత్త టెండర్‌ విధానంతో జీవనోపాధికి ఎసరంటున్న సప్లరుదారులు
‘కొత్త టెండర్‌ విధానం అమలయితే వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. పాత విధానాన్ని కొనసాగించకపోతే, 11ఆగస్టు నుంచి కూరగాయలు, పండ్లు, చికెన్‌, మటన్‌, కోడిగుడ్ల సరఫరా నిలిపివేస్తాం’ అని సప్లరుదారులు హెచ్చరించారు. అలాగే, మెను ప్రకారం సరుకులు కావాలంటే మార్కెట్‌ రేట్ల ప్రకారం ధరలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలలుగా సరఫరా చేసిన సరుకుల బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో ఇప్పటికే అప్పుల భారంలో ఉన్నామని, ఇప్పుడు కొత్త టెండర్‌ విధానంలో అధిక ఈఎండీ, మార్పు చేసిన నిబంధనలు, సరఫరా సమయాలపై కఠిన నియంత్రణలు తమ సామర్థ్యానికి మించి ఉన్నాయని చెప్పారు. పాత విధానంలో ఉన్న అనువైన నిబంధనలు రద్దు చేయడంతో, తక్కువ మూలధనంతో పనిచేసే సరఫరాదారులు టెండర్‌లో పాల్గొనే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు.
పౌష్టికాహరం అందేనా..
ఈ నిర్ణయంతో హాస్టల్స్‌లో చదువుతున్న వేలాది విద్యార్థులు నేటి నుంచే పప్పుచారు, పరిమిత భోజనంతో గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించకపోతే విద్యార్థుల ఆహార నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సరఫరా వ్యవస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది రైతులు, చిన్న వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారు. సరఫరా నిలిపివేతతో వీరి జీవనోపాధి కూడా ప్రమాదంలో పడనుంది.
అధికారులపై అందరి చూపు
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు వెంటనే ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలంటూ సరఫరా దారులు, తల్లిదండ్రులు, రైతులు కోరుతున్నారు. లేకపోతే హాస్టల్స్‌లో ఆహార సంక్షోభం మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా చెప్పుకుంటూనే కార్పొరేట్‌ శక్తులకు టెండర్లు అప్పజెప్పేలా నిర్ణయాలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img