వ్యక్తిగత డేటా గోప్యతపై నెటిజన్ల ఆందోళన
న్యూఢిల్లీ : రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్ ప్లేట్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు ఉండటం కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో వ్యక్తిగత డేటా గోప్యతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘భారతదేశంలో మీ డేటా గోప్యత మీ చేతుల్లో కూడా లేదు’ అంటూ మోరోన్‌హ్యూమర్ ఓ పోస్టు పెట్టాడు. దీనికి బ్యాంక్ ఖాతా వివరాలు ఉన్న పత్రంతో తయారుచేసిన పేపర్ ప్లేట్ ఫొటోను పంచుకున్నారు. ఇందులో పేరు, లొకేషన్, చెల్లింపు వంటి వివరాలు రాసి ఉన్నాయి. ఈ ఫొటో అత్యంత రద్దీగా ఉండే రైల్వే లేదా మెట్రోస్టేషన్‌లో తీసినట్టుగా కన్పిస్తోంది. ఇదికాస్తా నెట్టింట వైరల్ అవుతుండగా.. డేటా ప్రైవసీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘కస్టమర్ వివరాలు ఉన్న కాగితాలను రోడ్డు పక్కన ఆహార పదార్ధాల విక్రేతలకు ఎందుకు అమ్ముతున్నారో బ్యాంకులు సమాధానం చెప్పాలి’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఎవరైనా ఈ పేపర్ ప్లేట్‌లోని వివరాలు ఉపయోగించి.. వారి డబ్బు కాజేస్తే ఏంటి పరిస్థితి’ అని మరొకరు ఆందోళన వ్యక్తంచేశారు.
పేపర్ ప్లేట్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు
- Advertisement -
- Advertisement -



