ముంబయి : ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంక్‌లు మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో పలు విత్త సంస్థలు లాభాలను పెంచుకోవడంతో పాటు మొండి బాకీలను తగ్గించుకున్నాయి. ప్రభుత్వ రంగ కీలక బ్యాంక్‌ల్లో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ గడిచిన క్యూ2లో 14 శాతం వృద్ధితో రూ.4,904 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,304 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.10,516.7 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ).. గడిచిన క్యూ2లో రూ.10,469 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ బ్యాంక్ నిరర్థక ఆస్తులను 3.78 శాతం నుంచి 3.45 శాతానికి తగ్గించుకుంది. నికర ఎన్‌పిఎలు 0.36 శాతానికి పరిమితం చేసింది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ.18,641 కోట్ల లాభాలు
దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2025 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 10.8 శాతం వృద్ధితో రూ.18,641.3 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. బ్యాంక్ ఇతర ఆదాయాల మద్దతుతో మెరుగైన ఫలితాలను ప్రకటించినట్లు తెలిపింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 4.8 శాతం వృద్ధితో రూ.31,551.5 కోట్లకు చేరిందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.30,113.9 కోట్ల ఎన్‌ఐఐ నమోదయ్యింది. క్రితం క్యూ2లో బ్యాంక్ ఇతర ఆదాయం 25 శాతం పెరిగి రూ.14,350 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 0.99 శాతానికి, నికర ఎన్‌పిఎలు 0.42 శాతానికి పరిమితమయ్యాయని ఆ బ్యాంక్ తెలిపింది.
ఐడిబిఐ బ్యాంక్ లాభాలు రెట్టింపు
ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న ఐడిబిఐ బ్యాంక్ లాభాలు రెట్టింపు అయ్యాయి. 2025-26 సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో 98 శాతం పెరిగి రూ.3,627 కోట్లుగా నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌డిఎల్‌లోని 11.11 శాతం వాటాలను విక్రయించడం ద్వారా దాదాపు రూ.1,699 కోట్ల ఆదాయం పొందడంతో లాభాలు అమాంతం పెరిగాయి. మొత్తం లాభాల్లో ఈ మొత్తం 47 శాతం వాటాక సమానం కావడం గమనార్హం.
ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.12,359 కోట్ల లాభాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభాలు 5.2 శాతం పెరిగి రూ.12,359 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ.21,529 కోట్లుగా నమోదయ్యింది. దేశీయ రుణాల జారీ 10.6 శాతం పెరిగి రూ.13,75,260 కోట్లకు చేరింది. సెప్టెంబర్ ముగింపు నాటికి స్థూల ఎన్‌పిఎలు 1.58 శాతంగా, నికర ఎన్‌పిఎలు 0.39 శాతంగా నమోదయ్యాయి.
యెస్ బ్యాంక్ ఎన్‌పిఎలు యథాతథం
ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంక్ 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 18 శాతం పెరుగుదలతో రూ.654.5 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.553 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు యథాతథంగా 1.6 శాతంగా, నికర నిరర్థక ఆస్తులు 0.3 శాతంగానే చోటు చేసుకున్నాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.2300.88 కోట్లకు చేరింది.
పెరిగిన ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభాలు 2 శాతం తగ్గి రూ.561 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.571 కోట్ల లాభాలు సాధించింది. కాగా.. ఇదే సమయంలో రూ.1,974 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ2లో 8.6 శాతం పెరిగి రూ.2,144 కోట్లకు చేరింది. మొత్తం నికర ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.2,857 కోట్లుగా నమోదయ్యింది. నిర్వహణ వ్యయాలు 11 శాతం ఎగిసి రూ.1,647 కోట్లుగా ఉన్నాయి.
రాణించిన బ్యాంక్‌లు
- Advertisement -
- Advertisement -