Saturday, March 28, 2026
E-PAPER
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌పై మళ్లీ బేర్‌ పంజా

దలాల్‌ స్ట్రీట్‌పై మళ్లీ బేర్‌ పంజా

- Advertisement -

– సెన్సెక్స్‌ 1690 పాయింట్ల పతనం
– రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి :
పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ తీవ్రతను పెంచడం దలాల్‌ స్ట్రీట్‌లో మళ్లీ ఆందోళనలను పెంచింది. రెండు సెషన్లలో భారీ లాభాలను నమోదు చేసిన మార్కెట్లు.. తిరిగి శుక్ర వారం కుప్పకూలాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల సూచీలను కుదిపేశాయి. అమ్మకాల ఒత్తిడిలో తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం క్షీణించి 73,583కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 1,739 పాయింట్ల కనిష్టాన్ని చవి చూసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.8 లక్షల కోట్లు పైగా ఆవిరై రూ.422.11 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. సెన్సెక్స్‌లోని దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అత్యధికంగా 4.55 శాతం నష్టపోగా, దానితో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వంటి అధిక వెయిటేజీ ఉన్న షేర్లు కూడా పతనమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ టిసిఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ వంటి కొన్ని షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని అనిశ్చితి నెలకొనడం పెట్టుబడిదారులలో ఆందోళన నింపిందని దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 109.9 డాలర్లకు చేరడం, భారత రూపాయి విలువ 95 చేరువకు పడిపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి.

మరింత అగాథంలోకి రూపాయి..
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత అగాథంలోకి జారుకుంది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే ఒక్క రోజులోనే 86 పైసలు క్షీణించి 94.82 నూతన ఆల్‌టైం కనిష్ట స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్‌ డాలర్‌ బలోపేతం కావడం, ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -