పనులకు రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన
ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు
సంప్రదాయాలకనుగుణంగా మాస్టర్ ప్లాన్
జ్ఞానసరస్వతి దేవాలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సంప్రదాయాలను, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకుని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ.. బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. శనివారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. బాసర ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ అభివృద్ధి పనులకు ఈనెల 6న సీఎం శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు నిర్మించాలని అన్నారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సూచించారు.
సకల సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్
అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్తులో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని ఆదేశించారు. పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా నిర్మించాలని సూచించారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.



