నీ బతుకమ్మకి వాల్ల బతుకమ్మకి ఫర్కేందక్కా అంటడు
చినిగిన మసిలాగును ఎగబీక్కుంట చిన్నోడు
నాది ఉద్యమాల వలపోతల బతుకమ్మ
వాల్లది రాజకీయ ఎత్తుగడల బతుకమ్మ అంటాను నేను.
‘నీ సెయ్యి చాటంతా నీ బతుకు సింకి సాప,
ఇల్లు ఒల్లు అమ్మినట్టు గళాన్ని కలాన్ని అమ్ముడే నీ ఉద్యమం’
గుడిసెల నుంచి దూసుకొస్తున్న మాటలతూటాలు తగిలి
చాతిబండ కింద చితికిపోయి సుత
తపతప కొట్టుకుంటది చిట్టికప్పసుంటి గుండె..
డేగ రెక్కల చప్పుల్ల మధ్య పాము పడగల కింద
ఎద్దు పుండు బతుకులకు బహుజన ఉద్యమం ఒక అందమైన అబద్ధం
ఎందరి అస్తిత్వాలనో అణిచివేసిన
ఊక పొల్లు ఉనికి ఓ సుదీర్ఘ విద్రోహం అసంఖ్యాక దుష్ప్రచారాలతో
యోజనాల నడకను భస్మించిన చిరస్మరణీయ విద్రోహ చరిత్ర
ఉద్యోగ సభా పర్వాలు ముగిసి
ఉద్యమ కురుక్షేత్రానికి కష్ణసారథ్యం చిట్టచివరి విద్రోహం
నేను ఇప్పుడు ఇక్కడ ఒక అబద్ధపు సత్యం
సీసాలను గుమ్మరించి ఖజానాలు నింపడం
మత్తులో ముంచి జీవితాలను దోచుకోడం
అందమైన వ్యూహాత్మక ద్రోహం
పనిముట్లతో పాటలు పాడించి పాములతో గ్లాసుల్ని నింపించి
గాజులతో గాజులకు గాజులు చేసే ద్రోహం స్వప్నాలకు బొమ్మలు కట్టి
చూపును పెకిలించి రంగు గోలీలను తాపడం
మహాకర నిశ్శబ్ద విద్రోహం
మబ్బులను చూపి ప్రవాహాలను పంచుకొని
ప్రణాళికలను చూపి ప్రాజెక్టులను నంజుకొని
హత్యల్ని ఆత్మహత్యల్ని ప్రవహిస్తున్న కాలం
ద్రవాలు ద్రావకాలుగా మారి
జన సమూహాలను కబళిస్తూంటే లోహపు ముళ్ళతో గుచ్చి
ప్లాస్టిక్ పూలతో సైనేడ్ నింపుతున్న సందర్భాలు
కులగణన చేసి కూడా డాటాను బయటపెట్టని
అద్భుతమైన గారడీ మనది
బొమ్మజెముడు వంటి ముఖాల్లో పచ్చటి చిరునవ్వును వెలిగించడం
నేను స్వాగతించే ఉద్యమం
శత్రుమిత్ర వైరుధ్యాలను మండించి
మా వాటా దక్కనీయని స్వార్థం
రేపు కూడా కొనసాగే భవిష్యత్తు విద్రోహం అమరుల సమాధుల పునాదులపై నిర్మించిన భువన భవనాలే సాక్ష్యం
త్యాగాలను శవాలతో తగలబెట్టి ఉద్యమాలను పుష్పదళాలుగా నిర్దేశించిన సౌందర్యాత్మక వ్యూహం
నేను ఇప్పుడు ఇక్కడ ఆగుతాను
మన అందరి వగల సెగల మనస్సాక్షిగా జరిగిన జరుగుతున్న జరగబోయే విద్రోహానికి సాక్షిగా
కూర్చుని నిలబడి ఒంగోని కాళ్లు గడ్డాలు పట్టి
అప్పుడప్పుడు భుజాలు నడుము పట్టి
ఎప్పటికీ మరెప్పటికీ వదలని బరువులకూ
వదల్లేక అతుక్కున్న కుర్చీల కానుకనిస్తూ
పైపైకెక్కిన ద్రోహగ్రహాలకు గరళ హారతులిస్తూ..
కొత్త పూల బతుకమ్మను ఉద్యమపూల బతుకమ్మను కోరుకుంటున్న
ఇప్పుడిక్కడ తీరొక్క పూలన్నీ కలసి మేమెంతో మాకంతని పాడుతున్నాం
పసుపు ముద్ద గౌరమ్మా గుమ్మడి పువ్వు గౌరమ్మా
పూలరాశుల బతుకమ్మా నువ్వే సాక్ష్యం ..
- జ్వలిత, 9989198943