Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ(సీతక్క)తో కలిసి బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్‌పేట లోని బతుకమ్మకుంటలో శుక్రవారం జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్‌, బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. అలాగే 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో 63 అడుగుల ఎత్తులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నెస్‌ బుక్‌ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు స్టేజి, విద్యుదీకరణ, శానిటేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. వీటితో పాటు, 27న ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం బతుకమ్మ కార్నివల్‌, 29న పీపుల్స్‌ ప్లాజా, 30న ట్యాంక్‌బండ్‌ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమాలన్ని ంటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ట్యాంక్‌బండ్‌తో పాటు పీవీ మార్గ్‌, సచివాలయం, సరూర్‌ నగర్‌ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.

బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పండగ ప్రాశస్త్యానికి అద్దం పట్టేలా హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులు, విద్యుత్‌ దీపాలతో అలంకరించా లన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించే బాధ్యతను సెర్ప్‌ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ బండ్లు శోభ రాణి, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -