బతుకమ్మ పండుగ తెలంగాణలో జరుపుకునే నవరాత్రుల పండుగ. పూలవనాల్లో తిరుగుతూ, చక్కని పూలను సేకరించి అందమైన బతుకమ్మను పేర్చి, అతివలు ఆటపాటలతో చేసుకునే పండుగ. ప్రతి గ్రామంలో వీధి వీధిన ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. బతుకును కోరే అమ్మగా బతుకమ్మను పండగగా చేసుకోవడం వెనుక కారణాన్ని పరిశీలిస్తే ‘మట్టికి మనిషికి’ మధ్యగల అనుబంధం వ్యక్తమవుతుంది. పల్లెల్లో గల సంస్కతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశాడు కవి ఉప్పరి తిరుమలేష్. తన ‘బతుకమ్మ మొగ్గల’ కవితా సంపుటిలో గల మొగ్గల్ని ఆస్వాదించవలసిందే.
‘తెలంగాణ ఉద్యమం’ ఉవ్వెత్తున ఎగిసిపడి విజయతీరాలకు చేరడంలో బతుకమ్మ పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. ఉద్యమ ప్రారంభంలో ప్రతిచోటా గ్రామీణ మహిళలు మహిళలు బతుకమ్మను తయారు చేసుకొని, ముందుగా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటలతో ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారని చెప్పవచ్చు. అలాంటి బతుకమ్మ పండుగ విశిష్టతను వందకుపైగా మొగ్గల్లో చెప్పడం ప్రశంసనీయమైన విషయం. తెలంగాణ నేల పోరుబాటకు బాసటగా నిలిచింది ఈ బతుకమ్మనే.
”తెలంగాణ జాతి నిర్మాణానికి ప్రేరణనిస్తూ/ తెలంగాణ ఆవిర్భావానికి ఊతమైయింది/ ఉద్యమాల పోరు తెలంగాణకై షురు.”
బతుకమ్మ అంటేనే తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం. బతుకమ్మకు కోవెల లేదు. తెలంగాణ ప్రజల గుడిలోనే ఈ బతుకమ్మ కొలువైంది. నవరాత్రుల్లో ఎంతో వైభవంగా జరుపుకునే వేడుక ఈ బతుకమ్మ పండుగ.
తెలంగాణ ప్రజల బతుకులు దుర్భరంగా ఉంటే/ బ్రహ్మ గీయని ముద్దులబొమ్మై వచ్చి కాపాడింది/ కోవెలలేని దేవత బతుకు నిచ్చిన బతుకమ్మ
కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగను తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండుగలో ప్రతిరోజూ ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాన్ని బతుకమ్మని నీటిలో వదిలి ముగిస్తారు. తనమొగ్గలో ఇలా చెబుతాడు కవి….
”ఎంగిలిపూల బతుకమ్మగా మొదలవుతూ/ తొమ్మిది దినాల పూలజాతర బతుకమ్మ/ సద్దుల బతుకమ్మతో సాగిపోతుంది”
తెలంగాణ సాంస్కతిక వైభవాన్ని చాటి చెప్పే పండగ. కులమతాలకు అతీతంగా సమైక్యతతో అందరూ ఆచరించే పండుగ. ఇది తెలంగాణ ఉద్యమ చైతన్యానికి అస్తిత్వానికి చిరునామా ఈ పండుగ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ప్రకతితో మమేకమై ఉన్న దేవత బతుకమ్మ.
”తెలంగాణ అస్తిత్వ పతాకే కాదని/ తెలంగాణ బతుకుచిత్రం బతుకమ్మ/ తెలంగాణ సాంస్కతిక వేదిక బతుకమ్మ1”
ప్రకతి పరవశించిన వేల, నేలంతా పచ్చని చిగురాకులతో హదయహ్లాదాన్ని కలిగిస్తున్న వేల ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం మానసిక ఆనందంతో పాటు, సామాజిక సంబంధాలను నెరుపుకోవడం చెప్పుకోదగిన విషయం.
”నేలమ్మ పూల చీర కట్టి నపుడల్లా/ బతుకమ్మ సంస్కతి కదలాడుతుంది/ అవనికి ఆకు చీరలే బతుకమ్మకు నేతచీర”
పాటకు, పండగకు ఎనలేని సంబంధం ఉందని ఈ మొగ్గలో పరిచయం చేశాడు. స్త్రీలంతా బతుకమ్మ చుట్టూ చేరి పాడుకునే పాటల్ని తనమొగ్గలో గుర్తు చేశాడి కవి.
”ఒక్కేసి పువ్వేసి చందమామంటూ/ ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబరాలు/ బతుకమ్మ పండుగ పాటలు పుట్టై పూసింది”
జీవిత రహస్యాన్ని విశదం చేసేవి పూవులని చెప్పడం వెనుక ఆంతర్యం గమనిస్తే పూవు పుట్టి పరిమాల్ని వెదజల్లి నేల రాలిపోతుంది. అదేవిధంగా పుట్టిన మనిషి కూడా ఎదిగి పదుగురికి సహాయం చేసి కీర్తి నిలుపుకోవాలని చెప్పకనే చెప్పినట్లు ఈ మొగ్గ అమరింది.
”మొగ్గలై విరగ గాస్తేనే/ పువ్వులై పరిమళాలు వెదజల్లుతాయి/ జీవిత రహస్య ప్రతీకలు పువ్వులు.”
బతుకమ్మను ప్రకతి పండుగగా తెలంగాణ అస్తిత్వ పతాక పల్లె జీవితానికి రంగులద్ది, తెలంగాణ సాంస్కతిక చిహ్నంగా, మట్టిపూల సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఉద్యమాల ఉక్కు పిడికిలిగా, ప్రకతి దేవతగా అభివర్ణించాడు. గునుగు, తంగేడు పూల జాతరగా వివిధ రూపాల్లో బతుకమ్మను వర్ణించారు.
తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా, భక్తి పూర్వకంగా, జాతి సమైక్యతను పాటిస్తూ జరుపుకునే పండుగగా వర్ణించాడు. చక్కని తెలంగాణ మాండలిక పదాలు ఈ మొగ్గల్లో మొగ్గలుగా ఒదిగిపోయినవి. ఈ రచనలో బతుకమ్మ ఉత్సవాన్ని, వైభవం చక్కగా ప్రతిబింబించేలా రచించాడు ఉప్పరి తిరుమలేష్.
- అంబటి భానుప్రకాశ్, 9948948787