Sunday, September 21, 2025
E-PAPER
Homeమానవిఆడ‌బిడ్డ‌ల ఐక్య‌త బ‌తుక‌మ్మ పండుగ‌

ఆడ‌బిడ్డ‌ల ఐక్య‌త బ‌తుక‌మ్మ పండుగ‌

- Advertisement -

బతుకమ్మ అంటే మహిళల బతుకు కోరే పండుగ. కానీ మహిళలకు బతుకే లేని సమాజంలో బతుకుతున్నారు. రక్షణ కరువై అనేక రకాలుగా హింసకు గురవుతు న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నా స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం అనే పదాలకు అర్థమే లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు. రక్షణ కోసం, ఆదుకునే వారి కోసం ఆమె ఆశగా చూస్తోంది. ఈ బతుకమ్మ సందర్భంగానైనా ఆమె బతుకును కోరుకుం దాం. స్వేచ్ఛగా బతికే అవకాశాలు కల్పిద్దాం.

ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురుచూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. పల్లె పల్లెనా పట్టణాలలోనే కాదు ఇతర దేశాలలో సైతం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటనున్నాయి. కుల, మతాలకతీతంగా సబ్బండ వర్గాలు సంబరాలు చేసుకోనున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడబిడ్డలంతా ఐక్యంకానున్నారు. ప్రకృతి పూలు పరవశించి అడబిడ్డల పండుగ వస్తుందంటూ పువ్వులు మురిసిపోతున్నాయి. రంగు రూపులెన్నయినా తన ఒడిలో చేరదీసింది బతుకమ్మ… అమ్మ ఆశగా ఎదురుచూస్తోంది బతుకమ్మకు బిడ్డలొస్తారని.

ప్రకృతిని పూజించే పండుగ
సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ నిలయమైతే అందుకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ.. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. ఇదొక పూల పండుగ. ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించే పండుగ. ఈ పండుగ అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టం. పేద ధనిక తేడాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ బతుకమ్మని కీర్తిస్తూ జరుపుకునే పండుగ. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాల వల్ల వాగులు చెరువులు నిండివుంటాయి. రంగు రంగుల పూలు వీరబూసి నవ్వుతుంటాయి. ప్రకృతి అంతా పచ్చగా ఎన్నో రంగుల్లో అహ్లదకరంగా ఉంటుంది.

పూల పండుగ
ఈ కాలంలో గునుగు, తంగేడు, బంతి, చామంతి, నూకలి పువ్వులు, జిల్లేడు, పట్టుకుచ్చుపూలు, మందార, టేకుపువ్వు, బటాని పువ్వు మొదలైనపూలు విరభూస్తాయి. అదేవిధంగా సీతాఫలాలు కూడా చేతికి అందివస్తాయి. మగవాళ్ళు చుట్టుపక్కల తోటలను, పుట్టలను, గుట్టలను తిరిగి పూలను కోసుకొస్తారు. గునుగు నూకలి పువ్వులకు రకరకాల రంగులను అద్ది ఆరబెడతారు. వాటికి అందమైన రూపం ఇస్తారు. ఒక ఇత్తడి లేక స్టీల్‌ ప్లేటు తీసుకొని దానిమీద వెడల్పాటి ఆకును పరుస్తారు. వివిధ రకాల పూలతో వరుసగా పెట్టి బతుకమ్మను పేరుస్తారు. అవి విడిపోకుండా మధ్య మధ్య అదిమి పెడుతూ పేర్చిన పూల మధ్యలో ఆకు పొత్తులను పోస్తారు.

అందమైన బతుకమ్మ
రంగురంగుల అందమైన బతుకమ్మను పేర్చిన తర్వాత పైన తమలపాకు పెట్టి దాని మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు. ఇలా ఎంగిలిపువ్వు, సద్దుల బతుకమ్మ రోజున చేస్తారు. ప్రసాదాలు తయారు చేసుకుంటారు. అడపడుచులు కొత్త బట్టలు ధరించి, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని బతుకమ్మను ఇంటి నుండి తీసుకు వెళ్లేటప్పుడు నీళ్లు ఆర పోసి సాగనంపుతారు. వీధుల్లో గాని గుడి వద్ద గాని కాళీ స్థలంలో కానీ ఊరు మహిళలంతా ఒకే చోట చేరి బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.

తొమ్మిది రోజులు- తొమ్మిది తీరులు
అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. తొమ్మిది రోజుల పాటు 1.ఎంగిలి పూల బతుకమ్మ, 2. అటుకుల బతుకమ్మ, 3. ముద్దపప్పు బతుకమ్మ, 4.నానేబియ్యం బతుకమ్మ, 5.అట్ల బతుకమ్మ, 6. అలిగిన బతుకమ్మ, 7.వేపకాయల బతుకమ్మ, 8. వెన్నముద్దల బతుకమ్మ 9.సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.

ఎల్లలు దాటిన బతుకమ్మ
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ దేశ సరిహద్దులు దాటింది. విదేశాలకు పాకింది. తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగను చేసుకోవటం మాత్రం మానరు. ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయింది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ..అందుకే ప్రతీ ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారు. తమ బిడ్డల్ని కాపాడమంటూ వేడుకుంటారు. బతుకమ్మ పాటల్లో ఎన్నో అర్థాలుంటాయి. బతుకమ్మకు పూజ చేయటమే కాదు ఆడబిడ్డలకు తమ బాధల్నీ, సంతోషాలను పాట రూపంలో బతుకమ్మకు చెప్పుకుంటారు.

ప్రకృతికి కృతజ్ఞతగా
వర్షాలతో చెరువులన్నీ నిండిపోయి కళకళలాడుతున్నాయి. ఆడబిడ్డలు ఆనందంగా ఆడి పాడిన బతుకమ్మను, గౌరమ్మను గంగమ్మ తన ఒడిలోకి చేర్చుకోనున్నది. మన పూర్వీకులు బతుకమ్మ పండుగలో భాగంగా ఉపయోగించిన పూలూ, గౌరమ్మ పేరిట చేసిన పసుపు ముద్దను చెరువు నీటిలో కలిపే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ నీటిని శుభ్రపరుస్తాయి. పరోక్షంగా ప్రకృతి సంపదకు నీరాజనం అర్పించినట్లు అవుతుంది.

ప్రకృతి నుంచి మార్కెట్‌ వరకు
వెనకటి రోజుల్లో బతుకమ్మ పండుగ కోసం ముందుగానే పువ్వుల సేకరణ చేసేవారు. పట్టణాలన్నీ పల్లెలవైపు ప్రకృతి బాట పట్టేవారు. చేనుల వెంట, గుట్టల వెంట, వెళ్లి పూలు సేకరించే వారు. కానీ నేడు మార్కెట్లలోనే బతుకమ్మకు కావలసినవన్నీ ఇట్టే దొరికేస్తున్నాయి. కాలం మారితే మంచిదే కానీ ఇలా కాదు. స్వయంగా పూలను సేకరించి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలి. పువ్వులను సేకరించించే ఆ సంస్కృతి నేడు కనుమరుగైపోతుంది

అనుబంధాలు పెరిగేలా
ఒక పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలనూ, కుటుంబ అనుబంధాలనూ బలోపేతం చేయడం. దీనికి బతుకమ్మను మించిన గొప్ప వేడుక మరొకటి లేదు. చదువు, ఉపాధి, వివాహం, ఉద్యోగం, వలసలు… వంటి కారణాలతో చాలామంది తమ సొంత ఊళ్లు వదిలేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయినా బతుకమ్మ పండుగ సమయానికి మళ్లీ స్వస్థలానికి తిరిగొస్తారు. బంధువులంతా ఒక చోటికి చేరతారు. వీటన్నింటి ద్వారా మానవ అనుబంధాలు మరింత పెరుగుతాయి..

మహిళలను గౌరవించాలి
మహిళలు లేకుంటే మానవ పుట్టకే లేదు. ‘బతుకమ్మా’ అంటూనే మహిళలను హతమారు స్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే మహిళలు స్వేచ్ఛగా మనగలిగే సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండా లి. లింగ వివక్ష లేని సమాజాన్ని సాధిం చాలి. దీనికి బతుకమ్మ ఓ వేదిక కావాలి. బతుక మ్మ సాక్షిగా మహిళలపై జరుగుతున్న దాడులకు, దౌర్జన్యాలకు, లైంగిక దాడులకు, వేధింపులకు వ్యతిరేకంగా ఆడబిడ్డలకు అండగా నిలబడాలి. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం చదువుకోని ద్దాం, ఈ సమాజంలో సగభాగమని గుర్తిద్దాం…

గడగోజు రవీంద్రాచారి, 9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -