Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅంతర్జాతీయ స్థాయిలో 'బతుకమ్మ'కు మరింత ఖ్యాతి

అంతర్జాతీయ స్థాయిలో ‘బతుకమ్మ’కు మరింత ఖ్యాతి

- Advertisement -

రియో కార్నివాల్‌ తరహాలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు
– వేయి స్థంభాల గుడిలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభిస్తాం
– 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం పదివేల మందితో సంబరాలు
– బతుకమ్మ సావనీర్‌, చాంప్‌-2025 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రులు
– షెడ్యూల్‌ను విడుదల చేసిన జూపల్లి, కొండా సురేఖ, సీతక్క


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయస్థాయిలో బతుకమ్మ పండుగకు మరింత ఖ్యాతి తీసుకొస్తామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. విదేశీ పర్యటకులను ఆకర్షించేలా రియోకార్నివాల్‌ తరహాలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ ఉత్సవాలను వరంగల్‌ జిల్లా వేయి స్థంభాల గుడిలో ప్రారంభిస్తామన్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్కతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఆయన విడుదల చేశారు. అనంతరం ‘చాంప్‌-2025, బతుకమ్మ సావనీర్‌’ను ఆవిష్కరించారు. అనంతరం జూపల్లి విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ ప్రజలు అమితగా ఇష్టపడేలా నూతన పర్యాటక విధానాన్ని తీసుకొస్తామని వివరించారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో రాష్ట్రాన్ని ముందువరసలో నిలబెడతామని తెలిపారు. పర్యాటకం, తెలంగాణ సంస్కృతి ఈ రెండింటి మేళవింపుగా మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పండుగల విశిష్టత, మన సంస్కృతి అంతర్జాతీయ పర్యాటకులకు తెలిసేలా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రకృతిని గొప్పగా ఆరాధించే ఉత్సవం బతుకమ్మ అనీ, రకరకాల పూలను ఒక్కచోట అలంకరించి బతుకమ్మగా కొలవడం మన ప్రత్యేకత అని గుర్తు చేశారు. పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపారు. ‘బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు…ఇది తెలంగాణ ఆత్మ గీతం’ అని చెప్పారు. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి తెలంగాణవాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవాలను చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పెంచిన బతుకమ్మ అని గుర్తు చేశారు. బ్రెజిల్‌లో ప్రతియేటా ఘనంగా నిర్వహించే ‘రియో కార్నివాల్‌’ తరహా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందని తెలిపారు. బ్రెజిల్‌ పర్యాటక రంగానికి ‘రియో కార్నివాల్‌’ గ్లోబల్‌ ఐడెంటిటీ ఎలా ఇచ్చిందో, బతుకమ్మ పండుగ కూడా తెలంగాణ టూరిజానికి అలాంటి బ్రాండ్‌ ఐడెంటిటీ ఇస్తోందని ఆయన ఆకాంక్షించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను వరంగల్‌లో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ అని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రమాదంలో పడిన ప్రతిసారీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతుందని విమర్శించారు. రెండు వందల బతుకమ్మ చీరలిచ్చి బీఆర్‌ఎస్‌ నేతలు వందలసార్లు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల
– సెప్టెంబర్‌ 21 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు బతుకమ్మ వేడుకలు
– 21న వరంగల్‌లోని వేయి స్థంభాల గుడి వద్ద ప్రారంభం
– 22 నుంచి 24 వరకు ప్రతి రోజు మూడు, నాలుగు జిల్లాల్లో పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు
– 27న ట్యాంక్‌ బండ్‌ వద్ద బతుకమ్మ కార్నివాల్‌
– 28న ఎల్బీస్టేడియంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రయత్నం, పదివేల మంది మహిళలు పాల్గొంటారు
– 29న పీపుల్స్‌ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, అదే రోజు ఐటీ ఉద్యోగులకు, రెసిడెన్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు పోటీలు
– 30న ట్యాంక్‌ బండ్‌ వద్ద గ్రాండ్‌ ఫ్లోరల్‌ పరేడ్‌, ఫ్లోరల్‌ హోలీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
– 28న బతుకమ్మ సైకిల్‌ రైడ్‌, 29న మహిళల బైకర్స్‌ రైడ్‌, 30న విన్టేజ్‌ కార్‌ ర్యాలీ
– మాదాపూర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నాలుగు రోజులపాటు బతుకమ్మ థీమ్‌ ఆర్ట్‌ క్యాంప్‌ ( 25,26,27,28 తేదీల్లో)
– పీపుల్స్‌ ప్లాజాలో స్వయంసహాయక సంఘాలతో ‘సరస్‌ బజార్‌’
– బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్‌ను హుస్సేన్‌ సాగర్‌లో విడుదల
– రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో బతుకమ్మ కార్యక్రమాలు
– హైదరాబాద్‌ తో పాటు జిల్లాల్లో బతుకమ్మ వర్క్‌షాప్‌లు
– సెప్టెంబర్‌ 21 నుంచి 30 వరకు బతుకమ్మ వెల్‌కమ్‌ డ్యాన్స్‌, ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాల్లో ప్రదర్శిస్తారు.
– ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు, హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలను, స్థానిక ప్రజలను ఉత్సవాల్లో పాల్గొనేలా చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక టూర్లు
– ఎయిర్‌ ఇండియా, ఇండిగో ఇన్‌-ఫ్లైట్‌ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం
– ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్‌ ఆపరేటర్లు పాల్గొంటారు
– స్థానిక ఎఫ్‌ఎమ్‌ చానెల్స్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, హోర్డింగ్స్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad