Tuesday, September 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబతుకమ్మకు రెండు గిన్నిస్‌ రికార్డులు

బతుకమ్మకు రెండు గిన్నిస్‌ రికార్డులు

- Advertisement -

63.11 అడుగుల ఎత్తులో 7వేల టన్నుల పూలతో ఏర్పాటు
ఒకే సారి 1,354 మంది మహిళలు లయబద్దంగా ఆడిపాడిన వైనం
సరూర్‌నగర్‌ స్టేడియంలో ఘనంగా వేడుకలు : పాల్గొన్న మంత్రులు జూపల్లి, సీతక్క, మిస్‌ వరల్డ్‌ ఓపెల్‌ సుచాత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియం అందుకు వేదికగా నిలిచింది. సోమవారం నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ వేడుకలో రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు నమోదయ్యాయి. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. 11 ఫీట్ల వెడల్పు, 63.11 ఫీట్ల ఎత్తు, 7 వేల టన్నుల పూల అలంకరణతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మకు మొదటి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది. అలాగే ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆడినందుకు రెండో గిన్నిస్‌ బుక్‌ రికార్డు దక్కింది.

బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటాం : జూపల్లి, సీతక్క
బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఆడబిడ్డలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. గల్లీ నుంచి గ్లోబల్‌ వరకు ఏదైనా సాధిస్తామని తెలంగాణ మహిళలు చాటారని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందడుగు వేస్తారని ఆకాశాన్ని సైతం చీల్చుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిస్‌ వరల్డ్‌ ఒపెల్‌ సుచాత మాట్లాడుతూ ప్రపంచంలోనే అరుదైన ఈ పూల పండుగ మహిళల సాధికారతకు తోడ్పడనుందని పేర్కొన్నారు. ఈ వేడుక గిన్నిస్‌ బుక్‌లో నమోదు కావడం పట్ల ఆమె తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా గాయని విమలక్క మాట్లాడుతూ సమ్మక్కసారక్క, వీరనారి ఐలమ్మ మాదిరిగా ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రదర్శన నిర్వహించారని కొనియాడారు. చప్పట్లు వేసిన చేతులే పిడికిలై ముందుకు సాగి రేపటి భవిష్యత్‌కు మార్గదర్శకం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గిన్నిస్‌ బుక్‌ రికార్డు సభ్యులు వరల్డ్‌ రికార్డు ఆఫ్‌ గిన్నిస్‌ బతుకమ్మ సర్టిఫికేట్‌ ను మంత్రులకు అందజేశారు. ప్రముఖ గాయని గీతామాధురి బతుకమ్మ గీతాలను ఆలపించి మహిళలను ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంటినెంటల్‌ మిస్‌ వరల్డ్‌ ప్రతినిధి బృందం, పెత్త సంఖ్యలో డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -