నవతెలంగాణ- రాయపోల్
తెలంగాణ ఆచార సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ.బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైన వేడుక. ప్రపంచంలోనే ఎక్కడ లేని సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఏ దేవుడిని కలవాలన్న పువ్వులను ఉపయోగించి పూజలు చేస్తారు.కానీ పూలనే పూజిస్తూ తొమ్మిది రోజులు మహిళలు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.బుధవారం బతుకమ్మ పండగ సంబరాలలో నాలుగవరోజు నానేబియ్యం బతుకమ్మ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడబిడ్డడలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు గ్రామాలలో కొనసాగుతున్నాయి.
ప్రతిరోజు ప్రత్యేక పేరుతో బతుకమ్మను మహిళలు ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మ వరకు బతుకమ్మ సంబరాలను కుటుంబ సభ్యులు, ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి పూలతోపాటు తీరొక్క పూవులతో బతుకమ్మ తయారుచేసి కోలాటాలతో బతుకమ్మ ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూవోలే తీసుకువచ్చి రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి తయారు చేశారు. బతుకమ్మలను గౌరీ మాతగా పూజిస్తూ బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రామాలలోని చెరువులో నిమజ్జనం చేస్తారు.