నవతెలంగాణ – కంఠేశ్వర్
బతుకమ్మ కుటుంబ సంబంధాలను చిరకాలం నిలిపే అరుదైన సంస్కృతి అని, అది కేవలం తెలంగాణకే సొంతమని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశం మందిరంలో జరిగిన ప్రసిద్ధ పరిశోధకురాలు, రచయిత్రి, తెలంగాణ ఉద్యమకారిణి డాక్టర్ దేవకీదేవి వెలువరించిన “బతుకమ్మ” (కుటుంబ సంబంధ గేయాలు) పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
సమాజంలోన అనేక అనుబంధాలు, మనిషి జీవితంలోని అనేక దశల రహస్యాలను బతుకమ్మ పాటలు తెలియజేస్తాయని ఆ పాటలన్నింటిని ఒక చక్కని విభజనతో “బతుకమ్మ”పుస్తకం రూపొందించిన డాక్టర్ దేవకి దేవి తెలంగాణ సమాజానికి విలువైన పుస్తకాన్ని అందించారని, ముందు తరాలకు కరదీపికగా ఉపయోగపడుతుందని అభివర్ణించారు. ప్రసిద్ధ సాహిత్య చరిత్ర పరిశోధకుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, సీనియర్ జర్నలిస్ట్ పరిశోధకుడు డాక్టర్ ఉడయవర్లు, ప్రముఖ సాహితీవేత్త పైడిమర్రి గిరిజ, డాక్టర్ కాంచనపల్లి, కందుకూరి శ్రీరాములు, సూరారం శంకర్, కళ్లెం నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.