రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన వాణిజ్య సముదాయాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర బంద్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. బీసీ జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎక్కడికక్కడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి.
స్వచ్ఛందంగా షాపులు మూసేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా వేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.
స్వచ్ఛందంగా మూసేసిన వ్యాపారులు
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు
ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు.. ఆగిన బస్సు చక్రం
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
కేంద్రాన్ని తాకిన సెగలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపో2 వద్ద బీసీ జేఏసీ బంద్‌కు మద్దతుగా నిరసనలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని అన్ని కళాశాలలు, కార్యాలయాల్లో అధికారులు బైకాట్ చేసి ఆర్ట్స్ కళాశాల దగ్గర మానవహారంగా ఏర్పడ్డారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సుందరయ్య పార్కు దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించింది.
గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బర్కత్ పుర బస్సు డిపో ఎదుట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్, బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మెన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. అంబర్‌పేట్‌లో మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ముందు భాగాన మాజీ ఎంపీ హనుమంతరావు కాళ్లకు బ్యానర్ తగలడంతో కింద పడిపోయారు.
ఉమ్మడి ఆదిలాబాద్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ, బీసీ సంఘాల నాయకులు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుట మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వం లో బైటాయించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆస ిఫాబాద్, నిర్మల్‌లో నిరసనలు, సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బంద్ నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. సంగారెడ్డిలో సీపీఐ(ఎం) నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకు న్నారు. ఈ క్రమంలో పోలీసు లకు, సీపీఐ(ఎం) నాయకులకు మద్య తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రాహం వద్ద నిరసన తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
నిజామాబాద్/కామారెడ్డి
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము 5 గంటల సమయంలో ఆర్టీసీ-1 డిపో ఎదుట నాయకులు ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం 4 గంటలకే బీసీ సంఘం నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బస్సులు బయటకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాలు బైటాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ ను అడ్డుకుంటోందని విమర్శిం చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, పార్వడ్ బ్లాక్ పార్టీల నాయకులు, బీసీ సంఘాలు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బైటాయించారు. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా, రాస్తారోకోలు చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీల బంద్‌కు సీపీఐ(ఎం), సీపీిఐ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మద్దతు పలికారు. తెల్లవారుజామునే డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నాలు నిర్వహించారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నల్లగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య భవనం నుంచి క్లాక్‌టవర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా సీపీఐ(ఎం), సీపీఐ, ఎంసీపీఐయూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, వడ్డెర సంఘం మద్దతు తెలిపాయి.
ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల్లోనూ బంద్ నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి జిల్లాకేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాలు, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేర్వేరుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి దుకాణాలు, విద్యాసంస్థలు మూసి వేయించారు. రోడ్లపై రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆమనగల్ పట్టణంలో నిర్వహించిన బంద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా..
42% బీసీ రిజర్వేషన్ లను ఆమోదించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. బంద్‌లో భాగంగా ఖమ్మం నగరం పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పోతినేని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డు తగులుతున్న మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి తుమ్మల పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిం చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వా నిదేనని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలంలో తెల్లవారుజామున మూడు గంటలకే సీపీఐ(ఎం) నాయకులతోపాటు బీసీ ఐక్యవేదిక నాయకులు బస్టాండ్ వద్దకు చేరుకొని బస్సులను అడ్డుకున్నారు. అనంతరం అఖిలపక్ష రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ కోడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్, టీఎఫ్‌టియు, ప్రజా సంఘాల నాయకులు ప్రదర్శన నిర్వహిం చారు. ప్రధాన కూడళ్లలో నిరసన తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. గద్వాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిం చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వ కుర్తిలో తెలంగాణ చౌరస్తా వద్ద మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి, కాంగ్రెస్, సీపీఐ(ఎం) నాయకులు నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు సీపీఐ(ఎం), సీపీఐ, మాస్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వేర్వేరుగా ప్రదర్శనలు తీశాయి. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఎదురెదురు పడటంతో కొద్దిపాటి తోపులాట జరిగింది.