Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈ ఏడాదే బీసీ ఆత్మగౌరవ భవనాలు పూర్తి

ఈ ఏడాదే బీసీ ఆత్మగౌరవ భవనాలు పూర్తి

- Advertisement -

– ఈవీ హబ్‌గా తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్‌
– సభ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీసీ ఆత్మగౌరవ భవనాలను ఈ ఏడాదే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వెనకబడిన తరగతుల సంక్షేమం, రవాణా, హోంపాలన పద్దులపై సభలో జరిగిన చర్చకు శనివారం ఆయన సమాధానమిచ్చారు. సామాజిక న్యాయం, అభివృద్ధి, సమాన అవకాశాలు విద్యతోనే సాధ్యమన్నారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. గురుకులాల్లో విద్యార్ధుల మెస్‌, డైట్‌ చార్జీలు పెంచామనీ, విదేశీ విద్య సీట్లను మూడొందల నుంచి ఏడొందలకు పెంచామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.3 వేల కోట్లు ఉండగా రూ.1200 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుచేసి విద్యార్ధులకు ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నామన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల మేరకు ప్రభుత్వం పనిచేస్తోందనీ, ఆదిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని వివరించారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : పొన్నం
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పునరుద్ఘాటించారు. పాత బకాయిలు చెల్లిస్తామని నొక్కి చెప్పారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటపట్టిందనీ, గత నెల చివరి నాటికి రూ.954కోట్ల ఆపరేటింగ్‌ లాభాన్ని ఆర్జించిందని వివరించారు. హైదరాబాద్‌లో కొత్తగా 340 రూట్లలో ఆర్టీసీ సర్వీసులందిస్తున్నామనీ, వచ్చే రెండేండ్లలో నగరంలో 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల లైఫ్‌లైన్‌గా ఉన్న ఆర్టీసీ వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రవాణాశాఖలో జవాబువారీతనం పెంపొందించేందుకు అన్ని సర్వీసులను ఆన్‌లైన్‌ చేశామని తెలిపారు. చెక్‌పోస్టులను ఎత్తివేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ వాహనసారధిలో తెలంగాణ రాష్ట్రాన్ని అనుసంధానం చేశామని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను మినహాయింపు ద్వారా రూ.925కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నా.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవి హబ్‌గా మారబోతోందని మంత్రి పొన్నం ప్రబాకర్‌ తెలియజేశారు.

ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి : సీపీఐ పక్ష నేత కూనంనేని
సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలనీ, బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సభ్యులు దానం నాగేందర్‌ మాట్లాడుతూ, బీసీ బంధు పథకం ప్రకటించాలని కోరారు. పాతబస్తీలో మినీ బస్సులు నడపాలని ఎంఐఎం సభ్యులు జాఫర్‌హుస్సేన్‌ విజ్ఞప్తిచేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు తన్నీరు హరీశ్‌ రావు మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కారం, బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. సభ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేయడాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తప్పుబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -