Sunday, October 19, 2025
E-PAPER
Homeసమీక్షసాహిత్య విమర్శలో బి.సి.వాదం

సాహిత్య విమర్శలో బి.సి.వాదం

- Advertisement -

ఈ ప్రపంచంలో ఒక్క భారత దేశంలో మాత్రమే పుట్టక ముందే, పుట్టబోయే వారు చేయాల్సిన వృత్తి నిర్ధేశించబడతాయి. అది మనదేశ ప్రజలపై రుద్దబడిన కుల కట్టుబాటు బానిసత్వం. మనిషి అనే ఉదాత్తమైన గుర్తింపు కంటే ఫలానా కులం వాడని వేసిన ముద్ర ఆ మనిషి చచ్చాక కూడా వెంటాడుతుంది. ఆ కుల కోరల వల్లనే ఉన్నతమైన జ్ఞానం, సారవంతమైన గుణం ఉన్న డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ని లోకమంతా ప్రపంచ మేధావి అని కీర్తిస్తున్నా, మన దేశ అగ్రకులతత్వం అతని మేధోశక్తిని గుర్తించనిరాకరిస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నలభై ఏండ్లు గడిచాకే తమ సొంత వాణిని విన్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించే స్థితికి శూద్రకులాలు నెట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో డానిష్‌ తత్త్వవేత్త సోరెన్‌ కీర్క్‌ గార్డ్‌, ఫ్రెంచ్‌ తత్త్వవేత్త జీన్‌ పాల్‌ సార్త్రే ల అస్తిత్వవాద ఉద్యమ ప్రభావంతో తెలుగు నేల మీద కూడా సబాల్ట్రన్‌ యుగం ప్రారంభమైంది. అప్పటిదాక అగ్రకులాలు ఏ దారిలో పోతే ఆ దారినే గుడ్డిగా పోవడం, వారి ప్రసన్నం చేసుకోవడం కోసం సాహిత్యాన్ని రాయడం తప్పితే వేరే దారిలో పోదామనే సోయిని బహుజన కులాలకు కలగనివ్వలేదు.

తొలి దశలో జ్యోతిభా ఫూలే, అంబేడ్కర్‌ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన స్రవంతికి భిన్నంగా అణగారిన వర్గాల వాణిని వినిపించడం సాహిత్యంలో మరో కోణం ప్రచారానికి వచ్చింది. అట్టడుగు వర్గాలపై వివక్ష, అణచివేత, అంటరానితనం పోవడమే స్వాతంత్య్రంకు ముందు జరగాల్సిన అసలైన విముక్తి అని వారు ప్రకటించారు. ఆ అస్తిత్వ మూలాల వెలుగుల్లో సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. ఆ పరంపరలో భాగంగానే జూలూరి గౌరీ శంకర్‌ సంపాదకత్వంలో 2001లో ‘స్పృహ సాహితీ సంస్థ’ ద్వారా ‘వెంటాడే కలాలు- వెనకబడిన కులాలు’ అనే టైటిల్‌తో ఇరవై ఆరు మంది కవులు రాసిన మొట్ట మొదటి బి.సి కులాల కవిత్వ సంకలనం వెలువడింది. ఆ తర్వాత ప్రారంభమైన బి.సి వాద సాహిత్యపు ధార ‘ఎలగటి వ్యవసాయం’ వలెనే సాగుతుంది. ఆ అస్థిత్వ రచనల ప్రవహ ఉదృతి పెరగాల్సిన అవసరం ఉంది. దాన్ని పెంచే కృషిని ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ పుస్తకం ద్వారా ప్రేరేపిస్తున్నాడు దత్తయ్య. అన్ని రంగాలలో దామాషా ప్రకారం వాటా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది వెనకబడిన కులాల మీద జరుగుతున్న వివక్షలు తిప్పి కొట్టాల్సిన సమయం. సమానమైన మనుగడకోసం, మానవత్వం కోసం, సమ సమాజం కోసం వాదం ప్రశ్నిస్తుంది, పనిచేస్తుంది’ (పుట.32) అంటాడు అట్టెం దత్తయ్య. సమానత్వ లోకమే బిసివాద దృక్పథమని స్పష్టపరచడమనేది మొత్తం బిసి వాదానికే ఒక దిక్సూచి లాంటిది. ఇది ఆయన భావ విస్తృతికి, వాద అవగాహనకు ఒక తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఉత్పత్తి కులాల సాహిత్యాన్ని దేశ యవనిక మీద నిలబెట్టాలంటే బలమైన బి.సి వాద సాహిత్యం – విమర్శ రావాలంటాడు కవి, రచయిత, విమర్శకుడు డా.అట్టెం దత్తయ్య. చెప్పడమే కాదు అలాంటి పనిని తనే తలకెత్తుకొని ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ అనే విమర్శనా గ్రంథ రచనతో సబ్బండ కులాల గొంతును ఎలుగెత్తి చాటుతున్నాడు.

డా. అట్టెం దత్తయ్య రాసిన ఈ ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ అనే పుస్తకం ‘బహుజనుల వీలునామా’ అంటాడు డా.ఎస్‌.రఘు. నిజమే కాలం ఆరు ఋతువులుగా నడిచినట్లు ఈ పుస్తకంలో దత్తయ్య చేసిన విమర్శ కూడా పద్య కవిత్వం, పాట కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ అనే ఆరు ప్రక్రియలుగా సాగి దారిదీపం అవుతుంది. ఈ గ్రంథం చారిత్రక దృక్పథంతో అనేక ఉదాహరణలతో పరామర్శించి మన ముందు పెట్టాడు. విడిగా ఈ ప్రక్రియలపై విస్తారమైన విమర్శ జరిగి ఉండొచ్చు. కానీ బి.సి వాదంలో ఈ సాహిత్య ప్రక్రియలన్నిటిపై ఇప్పటిదాకా ఇటువంటి పుస్తకం రాలేదని చెప్పవచ్చు.
నివురుగప్పిన నిప్పుని ఊది మంటను రాజేసినట్టు పదకొండవ శతాబ్దం పాల్కురికి సోమనాథుడి లెగసీని తట్టి లేపుతున్నాడు. ఆయన రాసిన ‘పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, వృషాధిప శతకం’ లో ఉన్న బి.సి కులాల ప్రస్తావనల్ని, సబ్బండ వర్ణాల జాడను మన ముందు తవ్వి పోస్తున్నాడు అట్టెం దత్తయ్య. పద్యం సదా పండితుల పక్కలోనే కులికింది తప్పితే పామరులను పట్టించుకున్న పాపాన పోలేదు. ”ప్రాచీన కాలం నుండి పద్యం పండితుల చేతుల్లో పరిఢవిల్లుతుంది. ఛంద్ణ సౌందర్యం, ప్రాస విన్యాసం మేళవించుకున్న ఈ పద్యం సామాన్యుడి బాధలను, వారిపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షతను, దోపిడిలను పట్టించుకోలేదు. శృంగారానికి, అంగరానికి, వర్ణన విన్యాసాలకు, సుత్తికే సరిపోయింది.”(పుట. 70) అంటూ పద్యం, పండితుల పక్షపాత వైఖరిని ఎండగట్టాడు దత్తయ్య. పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకంలో ‘గొల్ల స్త్రీలు పట్టణ వీధుల్లో చల్లను అమ్మేవారు’ (వృ.శ.68) అని రాయడం, అలాగే బసవ పురాణంలో ‘వీథిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి ‘బసవరో ‘ అని కేక పెట్టగా ఆమెను పడిపోకుండా బసవన కాపాడినాడు’ బ.పు. 2- 108) ఇలా గొల్ల, కురుమల ప్రస్తావన ఉన్న పురాణ సాహిత్యాన్ని వెలికి తీసే ఆధార పూర్వక ప్రస్తావన అట్టెం దత్తయ్య పరిశోధనా శ్రమకు నిదర్శనం. అదే విధంగా 1934లో 354 మంది తెలంగాణ కవుల కవిత్వంతో వచ్చిన గోలకొండ కవుల సంచికలో పది మందికి పైగా బి.సి లు ఆనాడే కవిత్వం రాసిన విషయాన్ని లేవనెత్తాడు.

రెండవ భాగం వచన కవితా విమర్శ. వాదం ప్రారంభంలో బి.సి కులాల సాహిత్యం వచన కవిత్వంలోనే పొంగిపొర్లిందని చెప్పాలి. వృతులపై వచ్చిన కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహించింది. బి.సి కవులు విద్యుత్‌ వేగంతో, విద్వత్‌ రాగంతో కవిత్వాన్ని అలుగుదునికించారు. అందుకు సాక్ష్యంగా తొంబై రెండు మంది కవులు పదిహేడు కులాలను ప్రస్తావిస్తూ రాసిన నూటపదమూడు కవితలను ”తెలంగాణ వచన కవిత్వం – బిసి వాదం” అనే భాగంలో చూడవచ్చు. వచన కవిత్వంలో 1996లో సునారె సంపాదకత్వంలో వెలువడిన ‘బహువచనం’ సంకలనం నుండి 2020లో వచ్చిన ‘బిసి కవితా సంకలనం’ వరకు పదమూడు కవిత్వ సంకలనాలు, అలాగే కొన్ని వ్యక్తిగత సంపుటిలు వచ్చినట్లు తెలుపుతాడు రచయిత. వాటిలోని కవితలను అట్టెం దత్తయ్య పరిచయం చేసిన తీరు పాఠకులను అబ్బురపరుస్తది. అయితే ‘వెంటాడే కలాలు – వెనకబడిన కులాల’ సంకలనం వృత్తి, ఈతిబాధలు ప్రకటించే దశను దాటి బిసి వాద నినాదాన్ని ప్రకటించింది. అదే బిసి వాద సాహిత్యంలో ఓ పెద్ద మూలమలుపు. ఇలాంటి స్థితిలో అట్టెం దత్తయ్య తెచ్చిన ఈ గ్రంథం బిసి వాద సాహిత్యాన్ని మరో మెట్టుకు తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఇందులో వడ్డెర, కుమ్మరి, ఆరెకటికలు, గాండ్ల, జంగాల కులాల పై వచ్చిన వచన కవిత్వాన్ని వెలికితీసి చర్చిస్తాడు రచయిత. ‘వాడు మరణాన్ని గానం చేస్తాడు’ అనే తైదల అంజయ్య రాసిన ‘కాటి పాపలోడు’ కవితను దత్తయ్య విమర్శకు పెట్టిన తీరు మనసును మెలిపెడుతది. వీరి బతుకుల్లో కన్నీళ్లకు కారణమెవ్వరని ప్రశ్నను లేవనెత్తుతాడు. ఇట్లా అనేక వృత్తుల బహుజనుల కవితలను దత్తయ్య విస్తృతంగా విశ్లేషించాడు. జనం వంటిపై ధగ ధగ మెరిసే నగలను అందించే కంసాలి వంటికి ఇంత కూడు కరువయిన దుస్థితిని, వడ్రంగి, మంగలి, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి లాంటి చేతి వృత్తులపై ఆధారపడ్డ కులాలు ప్రపంచీకరణ కూడలిలో కూదేలై కూలబడ్డ జీవితాలపై వచ్చిన కవిత్వాన్ని ఈ పుస్తకంలో పరిశీలించిన తీరు దత్తయ్య సూక్ష్మ దృష్టిని, సునిశిత విమర్శకు నిదర్శనం.

మూడవ భాగంలో ”తెలంగాణ పాట – బిసి వాదం” అనే ప్రక్రియలో బి.సి ల పాటలను పరిచయం చేస్తూ విశ్లేషించాడు. ఆదినుండి పాట ఏ ఆధిపత్యం లేని సొంత గొంతుకల మట్టి పరిమళంతో ఉబికి ప్రవాహం చెందుతుంది. బహుజన కులాల వారు శ్రామికులవడంతో పాట వారి చెమటబట్టును ముద్దాడి సరికొత్త గానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సరిగమపదనిసలు అగ్రకులాల ఒళ్ళో సేద తీరితే, జనపద సాహిత్యం బహుజనుల గొంతులో రాగాలు తీసింది. నిజానికి జనపదాలకు, అగ్రహార పరివారాలకు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా స్పష్టమైన వైరుధ్యం ఉంది. మూలవాసులైన దళిత, బహుజనులే వేల సంవత్సరాలుగా పాటను రక్షిస్తూ వస్తున్నారు. బి.సిలు పాటను తమ ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడం వలన, వృత్తులతో కలపడం ద్వారా పాట మరింత పదునెక్కింది. ”జానపద పాట మౌఖికంగా బి.సి ఆశ్రిత కులాల వారు పాడుతూ, కథ రూపంలో చెబుతున్నారు. కానీ లిఖిత రూపంలో రావాలని, అప్పుడే బి.సి ల గత చరిత్ర, వైభవం తెలుస్తుందనీ” చెబుతూ పాటలను రికార్డు చేయాల్సిన అవసరాన్ని విమర్శకుడిగా ఈ తరానికి నొక్కి చెబుతున్నాడు దత్తయ్య. ”బి.సి ప్రధాన కులాల వారికి ఆశ్రిత గాయక కులాలు ఉండటం, వీరు ఆయా కులాలకు చెందిన వీరుల, సాహసికుల, నాయకుల, దాతల గొప్పతనాన్ని గానం చేస్తారు.” అని దత్తయ్య చెబుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అర్ధం చేయిస్తాడు.
నాల్గవ భాగంగా కథా ప్రక్రియను పరిశీలించాడు. భారతదేశంలో బహుజనుల జీవితాల్లో పురాణేతిహాసాలకు మించి లోతైన యదార్థ గాథలుంటాయి. ఎవరి జీవితాల్ని కదిలించినా కథలు కెరటాలై పోటెత్తుతాయి. అవేవీ కాలక్షేపానికో, వ్యాపకం కోసమో చెప్పుకునే వట్టి కథలు కాదు. బహుజన బతుకుల ఎతలు, కథలన్నీటి నుండి పచ్చి కన్నీటి వాసన మనల్ని చుట్టుముడుతుంది. కనుక ఏ బి.సి ఇంటి కడపను తడిమి చూసినా కథలు కట్టలు తెగి ఉబికివస్తాయి. ముఖ్యంగా బి.సి ఆశ్రిత కుల జీవనమంతా కథా, కథన సమాహారమే. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కన్ను తెరిచిన్నుండి కన్ను మూసే వరకు ప్రతి కదలికా ఒక కథే. అదిమపట్టి ఉంచిన చేతివృత్తి, సేవా కులాల అంతరంగాలను పరిశీలిస్తే కథలు ఉసిల్ల పుట్టలా కదిలస్తాయి. అయితే వాటిని అక్షరీకరించేదెవరు? ఒకవేళ అక్షరీకరించే కృషి చేస్తే, ఆ ప్రయత్నం కూడా ఇంకో కథే అవుతుంది. ‘కథా సాహిత్యంలో బి.సి కులాల స్థితిగతులను ఎరుకజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటే ముందునుండే దర్శనమిస్తాయి” అంటూ కథా సాహిత్యంలో బి.సిల ఆనవాళ్లు వెలికితీస్తున్నాడు దత్తయ్య. తెలంగాణలో కథకు చారిత్రక నేపథ్యం ఉందని, ఉద్యమాలకు ఊపిరి అయ్యిందని, వర్తమానంలో బహుజన కులాల్లో మార్పులను కథ చూపెట్టిందనే కోణాన్ని విప్పిచెబుతూనే, ప్రపంచీకరణ కుల వృత్తులపై చేస్తున్న ధ్వంసరచనను వివరించాడు.

మానవ జీవనాన్ని, సామాజిక సంబంధాల్ని ఆసాంతం వ్యక్తం చేయగలిగిన సాహిత్య ప్రక్రియ నవల ప్రక్రియను అయిదవ అధ్యాయంగా స్వీకరించాడు. ‘తెలంగాణ నవల – బిసి వాదం’ అనే అధ్యాయంలో తెలంగాణలోని పదిహేను బి.సి కులాల వృత్తి జీవితాల ఆధారంగా నవలలు వచ్చాయని నిర్ధారించాడు అట్టెం దత్తయ్య. వారి వేదనాభరితమైన స్థితిని ఇరవై రెండు మంది రచయితలు ముప్పై నవలల్లో చిత్రీకరించారని గుర్తించాడు. అయితే సమాజంలో అధిక సంఖ్యాక జనాభాగా ఉన్న వెనకబడిన కులాలపై నవల సాహిత్యం రావాల్సినంత రాలేదనీ దత్తయ్య నిరాశ చెందుతున్నాడు. తెలుగు రచయితలకు సాహిత్యం అంటే కవిత్వం మాత్రమేననే తప్పుడు అభిప్రాయం ఉందని కుండబద్దలు కొట్టినట్టు విమర్శిస్తున్నాడు. అగ్రకుల పద్య పండితులు కింది కులాలు సాహిత్యంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే కవిత్వానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలో ఉన్న అంతరార్థమని దత్తయ్య విమర్శ ద్వారా వెల్లడవుతుంది. నేటి బహుజన యువకవులు కూడా కవిత్వ ప్రక్రియకే అధిక మొగ్గు చూపడం లాంటి భావబానిసత్వం నుండి బయటపడాలని సూచిస్తున్నాడు.

ఇక ఆరో భాగంలో విమర్శ మీద దృష్టిసారించాడు. సాహిత్య ప్రక్రియల్లో ఆధునికమైన విమర్శ ప్రక్రియ వల్ల సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అట్టెం దత్తయ్య ”తెలంగాణ బిసివాద సాహిత్యం” అనే విమర్శనా గ్రంథం ద్వారా బి.సి వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని బి.సిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బి.సి వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బి.సి వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపిస్తున్నాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుందంటాడు. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బి.సి వాదాన్ని బలంగా వినిపించాలాని పిలుపునిస్తున్నాడు. బి.సి సాహిత్య విమర్శ పుస్తకాలుగా నాలుగు వచ్చాయి. కథా సాహిత్యం మీద ‘బి.సి.కథలు ఒక విశ్లేషణ 2000- 2010’ అనే బి ఎస్‌ రాములు గారి విమర్శ గ్రంథం 2011లో, కవిత్వ ప్రక్రియ మీద కవిత్వంలో ‘బిసి సూర్యోదయం’ 2015లో జూలూరి గౌరీ శంకర్‌, ఆయన సంపాదకత్వంలోనే మరో వ్యాస సంకలనం ‘ఒక కవిత ఇరవై కోణాలు’, అలాగే బిసి వాద యువ కవిత్వంపై ‘ప్రవాహాం’ చింతం ప్రవీణ్‌ సంపాదకత్వంలో 2017లో విమర్శనా గ్రంథాలు వచ్చాయి. అలాగే ఒక్కో ప్రక్రియను సమీక్షిస్తూ వ్యాసాలు కొంత మంది కవులు రాసారు. అలా విమర్శలో కొంత కృషి జరిగింది.

ఎ. విజయ్‌ కుమార్‌, 9573715656

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -