Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు మొండిచేయి

సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు మొండిచేయి

- Advertisement -

సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్..
నవతెలంగాణ – టేకుమట్ల

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తాజాగా ప్రకటించిన సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీ సమాజం పట్ల తీవ్రమైన అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని 25 గ్రామపంచాయతీలలో 6 పంచాయతీ  బీసీలకు రిజర్వ్ చేయడం, ప్రభుత్వం బీసీ వర్గాల పట్ల చూపుతున్న స్పష్టమైన మొండిచేయి అని ఆయన అన్నారు. గత 2018 ఎన్నికల్లో 9 పంచాయతీలు బీసీలకు కేటాయించగా.. ఈసారి జీరో చూపించడం రోస్టర్ నియమాలకు, సామాజిక న్యాయానికి పూర్తిగా విరుద్ధమని అన్నారు.అధికారులు రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు అమలుచేశామని పేర్కొన్నారు.

బీసీలకు 6 స్థానాలు ఇవ్వడం వెనుక ఉన్న పక్షపాతపూరిత నిర్ణయం ఏమిటో ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమోరాండం బీసీ జేఏసీతో కలసి సమర్పించనున్నట్లు డాక్టర్ నేరెళ్ళ రామకృష్ణ తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం వరకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కనీసం 9–15 గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. టేకుమట్ల మండలంలో బీసీ జనాభా శాతం, గత రిజర్వేషన్ క్రమం ఆధారంగా కనీసం 9నుండి 15 గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీల హక్కులను కాలరాస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మండలంలోని బీసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాలనీ అన్నారు. ఈ జాబితాను తక్షణమే సవరించి బీసీలకు న్యాయం చేయాలనీ, లేనిపక్షంలో అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -