నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ చైర్మెన్లు, మేయర్లుగా 60 శాతం పదవులను బీసీలకివ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో 60 శాతం మంది బీసీలున్నారని ఆయన తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ ఎక్కువ మంది బీసీలు గెలిచారని చెప్పారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం సీట్లు గెలిస్తే అగ్రకులాల అభ్యర్థులు 15 శాతం విజయం సాధించారని గుర్తుచేశారు.
ఆ లెక్కన కాంగ్రెస్ 60 మున్సిపల్ చైర్మెన్లుగా, బీఆర్‌ఎస్ 10 చైర్మెన్లుగా, అలాగే 7 మేయర్ స్థానాల్లో 4 చోట్ల బీసీలకు కేటాయించాలని కోరారు. భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో 35 వార్డుల్లో 34 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించారనీ, ఒక స్థానం మాత్రమే గెలిచిన రెడ్డి అభ్యర్థికి చైర్మెన్‌గా అవకాశం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
చైర్మెన్లు, మేయర్లుగా బీసీలకు 60 శాతం పదవులు ఇవ్వాలి : బీసీ జేఏసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



