Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం వాటా తేల్చాలి

విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం వాటా తేల్చాలి

- Advertisement -

తెలంగాణలో దొడ్డిదారిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు
ఈడబ్ల్యూఎస్‌ లేని షరతులు బీసీ రిజర్వేషన్ల అమలుకు ఎందుకు?
సమగ్ర కుల సర్వే రిపోర్టు వివరాలు అడిగితే ఇవ్వట్లే
అందుకే మండలి చైర్మెన్‌కు ప్రివిలైజ్‌ నోటీసు ఇచ్చా : ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్‌(తీన్మార్‌ మల్లన్న)

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వాటా తేల్చాలనీ, అప్పుడే బీసీ రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి ఉన్నట్టు భావిస్తామని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్‌(తీన్మార్‌ మల్లన్న) చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో గల అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. సమగ్ర కుల సర్వే రిపోర్టు వివరాలు కావాలని ఈ ఏడాది ఏప్రిల్‌ మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ను అడిగితే ఇప్పటివరకూ ఇవ్వలేదని వాపోయారు. శాసనమండలి సభ్యులకు కూడా వివరాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర సర్కారు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ గ్రామంలో ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు? వాళ్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులేంటి? అని తెలుసుకునే హక్కు ఎమ్మెల్సీగా తనకు లేదా? అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్సీగా ప్రివిలైజ్‌ నోటీసు జారీ చేశానన్నారు. మండలి చైర్మెన్‌తో మాట్లాడాననీ, ఆయన అందుబాటులో లేకుంటే కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశానని తెలిపారు.

కాంగ్రెస్‌ వాళ్ల దగ్గర ఏ లెక్కా పత్రం లేనప్పుడే తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లోనే ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయానికి వచ్చేసరికి అసెంబ్లీలో బిల్లు, గవర్నర్‌ ఆమోదం, రాష్ట్రపతి ముద్ర, పార్లమెంట్‌లో చట్టం, తొమ్మిదో షెడ్యూల్‌లో పొందుపర్చటం అంశాలు అడ్డొస్తాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 2019 నుంచి ఏ లెక్కన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని నిలదీశారు. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయబోమని అక్కడి సర్కారు తేల్చి చెప్పిందనీ, కేరళలో శశిధరణ్‌ కమిటీ రిపోర్టు మేరకు అగ్రకులాల్లోని పేదలకు అమలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణలో ఏ కమిషన్‌, ఏ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్‌ జనాభా వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టకుండా దాచాల్సిన అవసరమేంటి? అని నిలదీశారు. బీసీల స్థితిగతులపై అధ్యయనం కోసం సుదర్శన్‌రెడ్డితో వేసిన స్వతంత్ర కమిటీ రిపోర్టు ఏమైందని ప్రశ్నించారు.

బీసీలను నయవంచనకు గురిచేయడానికి రాష్ట్ర సర్కారు యత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం దగ్గర గాడిదల లెక్కలుంటాయిగానీ బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్కలుండవా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీల్లో 71 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. 75 లక్షల మంది బీసీలకు గుంట భూమి కూడా లేదని చెప్పారు. అయితే, అధికారిక లెక్కలు తమకు కావాలని అడుగుతున్నామన్నారు. మండలి చైర్మెన్‌, ప్రివిలైజ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లాక కూడా వివరాలు ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయం ముందు తేలాలన్నారు. స్థానిక సంస్థల్లో 51.5 శాతం బీసీ సర్పంచులు, 50.5 శాతం ఎంపీటీసీలు ఉన్నారనీ, కొత్తగా వాళ్లు 42 శాతం ఇచ్చేది ఏంటని అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీగా బీసీలకు టికెట్లు ఇవ్వడమేంటి? ఆ పార్టీలోని రెడ్లు తమ జనాభా శాతం ఆధారంగా టికెట్లు తీసుకుని మిగతా వాటిని వదిలేస్తే అయిపోతుంది కదా? అని అన్నారు. తెలంగాణలో రెడ్లు, వెలమదొరలు పరిపాలించినంత కాలం బీసీలకు రాజ్యాధికార వాటా, విద్యా, ఉపాధి రంగాల్లో సరైనా వాటా దక్కదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -