– వైద్యాధికారులకు మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్న మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలతో పాటు ఇతర జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలన్నారు. స్నేక్ బైట్‌లు, సీజనల్ వ్యాధులు విస్తరించకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి అదేశించారు. డాక్టర్లు మొదలు పారామెడికల్, ఆస్పత్రి సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావానికి గురైన లోతట్టు ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలనీ, అంటువ్యాధులు ప్రబలకుండా పురపాలక, పంచాయితీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని మంత్రి వారిని ఆదేశించారు.