ప్రమాదాలు జరక్కుండా భద్రతా చర్యలు పాటించాలి
– అత్యవసర పరిస్థితుల్లో 1912 నెంబర్‌కు కాల్ చేయండి
– గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆనందంగా జరుపుకునే వినాయక పండుగ వేళ కాస్త అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. భారీ విగ్రహాల తరలింపులో విద్యుత్ అధికారుల సహకారం కోరాలని, సమాచారమిస్తే విగ్రహం వెంట సిబ్బందిని పంపుతామని తెలిపారు. అనుమతి పొందిన మండపాల నిర్వాహకులకు ఉచితంగానే విద్యుత్ అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు 11 రోజులపాటు తాత్కాలిక సరఫరా కేటగిరీలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. అయితే, భద్రతా చర్యలు చేపట్టకపోతే ప్రమాదాలకు ఆస్కారం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విగ్రహాల తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. విగ్రహాల ఎత్తుని బట్టి రూట్‌ని నిర్ణయించుకోవాలి. ఒక వేళ ఎక్కడైనా సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
2. విద్యుత్ లైన్ల నుంచి కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. లైన్‌లో ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం / ఇండక్షన్ ఉంటుంది.
3. క్రేన్‌లు, ట్రక్స్, ఎత్తైన మెటల్ విగ్రహాల తరలింపులో మరింత అప్రమత్తంగా ఉండాలి.
4. మెటల్ ఫ్రేమ్‌లతో కూడిన డెకొరేషన్‌లను వీలైనంత మేరకు తగ్గించాలి.
మండపాల వద్ద..
1. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందాలి.
2. ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడరాదు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.
3. మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను పరిశీలించాలి. విద్యుత్ వైర్ల/ పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి.
4. ఒక వేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
5. విద్యుత్ వైరింగ్‌లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వల్ల షాక్ కలిగే అవకాశమున్నది. కనుక మండప నిర్వాహకులు ప్రతి రోజూ తప్పనిసరిగా వైరింగ్‌ను పరిశీలించాలి.
6. విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912కు, సమీప ఫ్యుజ్ ఆఫ్ కాల్‌కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
7.మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయివేటు వ్యక్తులు ఇష్టానుసారంగా స్తంభాలు ఎక్కొద్దు. స్థానిక విద్యుత్ కార్యాలయంలో సంప్రదిస్తే సిబ్బంది కనెక్షన్లు ఇస్తారు.
8.విద్యుత్ తీగలకు ఇష్టానుసారంగా వైర్లు వేస్తుండటంతో ఈదురుగాలుల వీచినప్పుడు అవి కిందపడి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలుంటాయి.
9. నడిచే ప్రాంతాల్లో తీగలు ఉండకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లు, స్తంభాలకు అంటి పెట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేయొద్దు.
10.మెటల్ ప్రేమ్‌లతో కూడిన డెకరేషన్ వస్తువులు తీగలకు దూరంగా ఉంచాలి.
11.విద్యుత్ లైన్ల నుంచి మండపాలు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.
12.ప్రతి మండపంలో స్థానిక ఏఈ, లైన్‌మన్, సిబ్బంది ఫోన్ నెంబర్లు, టోల్ నెంబర్ 1912 ఉండేలా చర్యలు తీసుకోవాలి.
13.భారీ విగ్రహాలు తరలించే సమయంలో క్రేన్లు, ట్రక్కులపై ఏర్పాటు చేసే డెకరేషన్ పరికరాలు తీగలకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి.
14.విగ్రహాలు తరిలించే మార్గాల్లో విద్యుత్ వైర్లు ఉంటే తడి కర్రలు, ఇనుప వస్తువులతో పైకి నెట్టే ప్రయత్నాలు చేయొద్దు.
అప్రమత్తంగా ఉండండి
గణేష్ విగ్రహాల తరలింపులో, మండపాల్లో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ఎల్‌టీ /11 కేవీ నెట్‌వర్క్‌లోని ఓవర్ హెడ్ లైన్ల స్థానంలో ఏబీ కేబుల్ ఏర్పాటు చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. సామాన్య ప్రజలు, గణేష్ నిర్వాహకులు మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలి. ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే విద్యుత్ అధికారులు సమాచారం ఇవ్వాలి. అనుమతి పొందిన గణేష్ మండపాలకు ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
– ముషారఫ్ ఫరూఖి, సీఎండీ, టీజీ ఎస్పీడీసీఎల్