Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధైర్యంగా ఉండండి.. అండగా నిలుస్తాం: డీజీపీ

ధైర్యంగా ఉండండి.. అండగా నిలుస్తాం: డీజీపీ

- Advertisement -

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబీకులను పరామర్శించిన డీ.జీ.పీ
పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అందజేత
పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్, ఐ.జీ, సీ.పీ
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ప్రభుత్వం, పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీ.జీ.పీ బి.శివధర్ రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులకు భరోసా కల్పించారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల రియాజ్ అనే నేరస్థుడిని అరెస్టు చేసి తీసుకువస్తున్న క్రమంలో హత్యకు గురైన సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులను డీ.జీ.పీ శివధర్ రెడ్డి మంగళవారం మల్టీ జోన్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు.

కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపర్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీ.జీ.పీ గుర్తు చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే సిన్సియర్ పోలీసు ప్రమోద్ కుమార్ ను కోల్పోవడం బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా, తమ శాఖ తరపున అవసరమైన అన్ని సదుపాయాలు, సహాయ సౌకర్యాలు అందేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

 అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల 9 కుటుంబాలకు డీ.జీ.పీ బి.శివధర్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 1989 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతోందని డీ.జీ.పీ వెల్లడించారు. మిగతా 9 కుటుంబాలు కూడా ముందుకు వస్తే, వారికి సైతం అదే ప్రాంతంలో నివేశన స్థలాలు అందించడం జరుగుతుందని సూచించారు. ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డీ.జీ.పీ కృతజ్ఞతలు తెలిపారు.

సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమవుతూ ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉంటూ వస్తున్న పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గాజులరామారంలో 200 గజాల చొప్పున ఇళ్ళ స్థలాలను పంపిణీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. 2008లో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న దుస్సంఘటనలో 33 మంది పోలీసులు అమరులయ్యారని డీ.జీ.పీ గుర్తు చేశారు. ఆ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నివేశన స్థలాలను అందించి, పోలీసు అమరుల త్యాగాలను స్మృతి పథంలో నిలిచిపోయేలా తోడ్పాటును అందించిందని అన్నారు. 

ఆసిఫ్ కు హోంగార్డు ఉద్యోగం ఇవ్వాలి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కాగా, అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సారంగాపూర్ యువకుడు సయ్యద్ ఆసిఫ్ కు వీలైతే పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీ.జీ.పీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్ర పోలీసు శాఖలో హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనుందని, ఆ సందర్భంగా సయ్యద్ ఆసిఫ్ కు హోంగార్డు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని అన్నారు. అంతకుముందు సుభాష్ నగర్ లోని పోలీస్ విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న డీ.జీ.పీ శివధర్ రెడ్డిని ఐ.జీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీ సాయి చైతన్య తదితరులు పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలుకగా, డీ.జీ.పీ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -