– జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం
– ప్రతిదీ కృత్రిమమేధపై ఆధారపడితే కష్టమే : హెచ్చరిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇది మానవుడి జీవితంలో భాగంగా మారింది. ఏఐతో ఎంత ప్రయోజనం ఉన్నదో.. నష్టం కూడా అంతే స్థాయిలో ఉన్నదని టెక్, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి సమాజంలో మానవుడు ప్రతీ విషయం కోసం ఏఐ మీదనే ఆధారపడుతున్నాడు. చిన్న చిన్న లెక్కల నుంచి క్లిష్టమైన కోడ్ లాంగ్వేజ్ వరకూ.. ఇలా కృత్రిమ మేధను నమ్ముకొని పనులు కానిస్తున్నాడు. ఈ విధంగా విపరీతంగా ఆధారపడుతుండటమే మానవుడికి చేటు తీసుకొచ్చే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా మానవుడి జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు.
నేటి సమాజంలో డిజిటల్ రిమైండర్ల నుంచి హెల్త్ యాప్స్ వరకు.. ఇలా ప్రతీదీ ఏఐతో ముడిపడి ఉంటున్నది. ఇవి మానవుడి రోజువారీ పనులను సులభతరం చేస్తున్నాయి. అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవటం, లోతుగా సెర్చ్ చేయటం వంటి అంశాలను మాత్రం మానవుడు మర్చిపోతున్నాడు. యంత్రాలు మన తరఫున ఆలోచించడం, గుర్తుంచుకోవడం వంటివి ప్రారంభించాయని యూపీలోని నోయిడాకు చెందిన కైలాశ్ ఆస్పత్రి న్యూరాలజిస్ట్ చెప్పారు. ఏఐ అనేది కోడ్‌లు, అల్గారిథమ్‌లలో సమాచారాన్ని నిల్వ చేస్తుంది. కాబట్టి ఇది కొన్ని సెకన్లలోనే మనం కోరుకున్న సమాచారాన్ని మన ముందుంచగలుగుతుంది. వేగవంతమైన, కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ సమర్థవంతంగా పని చేస్తుంది.
అయితే మానవ జ్ఞాపకశక్తి భావోద్వేగాలు, అనుభవాలతో ముడిపడి ఉంటాయి. ఇలాంటివి ఏ యంత్రం కూడా చేయలేదు. అయినప్పటికీ సాంకేతికత కారణంగా మానవుడు తన మెదడుకు పని చెప్పే విధానం మారుతోంది. ప్రజలు తమ పరికరాల్లో సమాచారం సులభంగా అందుబాటులో ఉన్నదని తెలిసినప్పుడు.. వారు దానిని స్వయంగా గుర్తుంచుకునే అవకాశం తక్కువ. దీని అర్థం ఏఐ.. మానవుడి జ్ఞాపకశక్తిని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని కాకపోయినా.. ఇది మెదడు పని తీరును తక్కువ చురుకుగా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. క్రమక్రమంగా ఇది మానవుడి శ్రద్ధ పరిధిని, సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. చిన్న చిన్న పనులకు కూడా ఏఐ మీద ఆధారపడకుండా మెదడుకు పని చెప్పాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే.. ఫోన్ నెంబర్లను గుర్తు పెట్టుకోవటం, చిన్న చిన్న లెక్కలు చేయటం వంటి సాధారణ అలవాట్లు నాడీ మార్గాలను చురుకుగా ఉంచడంలో సహాయపడతాయని అంటున్నారు. మానవ మెదడుకు ఏఐని ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఒక సహాయక యంత్రంగా ఉపయోగించుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలుపుతున్నారు.
ఏఐ మీద విపరీతంగా ఆధారపడుతున్న ప్రస్తుత తరం విద్యార్థులు, యువత.. చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారు. ప్రతీదీ ఏఐ ద్వారా పొందొచ్చన్న ఆలోచన వారిలో విపరీతంగా ఏర్పడింది. విద్యాసంవత్సరం మొదలుకొని పోటీపరీక్షలు, రచనలు, కవిత్వాలు.. ఇలా ప్రతి అంశంలోనూ ఏఐను వాడుతున్నారు. ఏఐని వాడటంలో తప్పు లేదు.. కానీ దానిని ఏ విధంగా వాడుతున్నామనేది ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు. కృత్రిమ మేధ వినియోగం మన జ్ఞాపకశక్తిని మరింత పెంపొందించేదిగా ఉండాలి తప్పితే.. దానిని ప్రతికూలంగా ప్రభావితం చేసేలా మాత్రం ఉండొద్దని సూచిస్తున్నారు.
ఏఐతో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES