సంయుక్తంగా లేకుంటే పదవులకు ముప్పే..
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్లకు సంయుక్తంగా చెక్ పవర్ ఉంటుంది. గ్రామ పంచాయతీ అవసరాలు,అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఇద్దరి ఆమోదం తప్పనిసరి. అయితే సంతకాల విషయం లో ఏర్పడే రాజకీయ విభేదాలు,నిర్లక్ష్యం,తప్పిదాలు కొన్నిసార్లు వారి పదవులకే ముప్పుగా మారే అవకాశాలు ఉంటాయి.
కలెక్టరు కీలక అధికారాలు..
సర్పంచ్ చేపట్టే పనులకు ఉపసర్పంచ్ సంతకం ఇవ్వకపోతే నిధుల విడుదల నిలిచిపోతుంది. సర్పంచ్ పనులు నిబంధనల ప్రకారమే ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకున్నట్టు తేలితే ఉప సర్పంచ్ చెక్ పవర్ను రద్దు చేయడమే కాకుండా పదవి నుంచి తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదంలో పదవి..
పంచాయతీ నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినా,పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసినా,అంచనాలకు మించి ఖర్చులు చూపించినా అవి నేరంగానే పరిగణిస్తారు. విచారణలో నిధుల దుర్వినియోగం నిర్ధారణైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కలెక్టర్ సర్పంచ్, ఉప సర్పంచ్లను పదవుల నుంచి తొలగించవచ్చు.
అధికారులను మభ్యపెడితే కేసులు..
సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను పరస్పరం నకిలీ చేసినా, అధికారులను మభ్యపెట్టి నిధులు పొందినా క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పదవి కోల్పోవడమే కాకుండా జైలు శిక్ష కూడా పడే పరిస్థితి ఉంటుంది. గ్రామసభ తీర్మానాలను అతిక్రమించి నిధులు వినియోగానికి చెక్కులపై సంతకాలు చేయడం అధికార దుర్వినియోగంగా భావిస్తారు. సర్పంచ్, ఉప సర్పంచ్లపై ఫిర్యాదులు అందినప్పుడు కలెక్టర్ విచారణకు ఆదేశిస్తారు. సరైన వివరణ ఇవ్వకపోయినా, లెక్కల్లో తేడాలు తేలినా చెక్ పవర్ రద్దు చేయడం, పదవుల నుంచి తొలగించే అధికారం కలెక్టర్కు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.



