సీఎం గారు..అఖిలపక్షాన్ని పిలవండి
రాష్ట్రాల మధ్య కేంద్రం వివాదాలు సృష్టిస్తుంది
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాలయాపన
అడ్డంకులూ లేకుండా ఆర్డినెన్స్ తేవాలి
బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు
కులాంతర వివాహ చట్టం తేవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సూచన
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో బనకచర్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారని, కొన్ని నిర్ణయాలు జరిగాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో.. అసలు చర్చలు జరిగాయా? లేదా? అనే స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్లపై గందరగోళాన్ని తొలగించే విధంగా నిపుణులతో చర్చించి అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బనకచర్లపై సమావేశం జరిగి ఉంటే అక్కడ తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపగా.. మూడు నెలల్లోపు తేల్చాలని సుప్రీంకోర్టు సూచించిందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. బీసీల రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉందని అర్థమవుతోందన్నారు. కులగణన విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబించిందో చూశామన్నారు. రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్‌పై ప్రధాన మంత్రిపై ఒత్తిడి తేవాలని, ప్రయోజనకర అంశాలపై మాట్లాడాలని, బిల్లుపై వారు కూడా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకొచ్చి 18 నెలలు అవుతున్నా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ఉద్యోగాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. ఉద్యోగాల కోసం ఇందిరాపార్క్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేస్తే డీవైఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ చేపట్టకపోతే నిరుద్యోగులు చేసే ప్రతి పోరాటానికీ సీపీఐ(ఎం) అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామాలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ సిద్ధం చేశామని జాన్‌వెస్లీ తెలిపారు. గ్రామానికి 5, 10 మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు లేనివారు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి 120 గజాలు కేటాయించాలని, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఎస్సీలకు రూ.6లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు, మహిళలకు రూ.2500 ఇస్తామని ఇప్పటి వరకు అమలు జరగలేదన్నారు. రాజీవ్ యువవికాస్ పేరుతో యువతకు రూ.50వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటే 16లక్షల మందికి పైగా దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. కనీసం 5లక్షల మందినైనా గుర్తించి రుణాలిస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమ ర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 10 నుంచి 12 గంటల వరకు పెంచి శ్రమ దోపిడీకి పాల్పడు తోందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని, 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని, పనికి తగ్గ వేతనం ఉండాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
రైతుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఏ భూమిలో ఏ పంట వేయాలి.. ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనే దానిపై అవగాహన కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. వెంటనే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఉందని, ఎడమ కాలువ ద్వారా నీటిని వదిలితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు రావడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వి.వెంకటేశ్వర్లు, ఎండి.హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కులాంతర వివాహ చట్టం తేవాలి
కులాంతర వివాహాల రక్షణ చట్టం తేవాలని జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలో కులదురహంకారంతో మల్లేశ్ అనే యువకుడిని హత్య చేశారనీ, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి 42 హత్యలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యకు కారకులైన వారిని శిక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందన్నారు.
బనకచర్లపై స్పష్టతివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES