తమ జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ముభావంగా ఉంటారు. ఇంకొందరు చిరాకు పడడం, కోపంతో ఊగిపోవడమూ చూస్తుంటాం. అయితే ఇంత ఒత్తిడిలోనూ కొందరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ తమ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి వాళ్లను చూస్తే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వీళ్లు మానసికంగా ఇలా దృఢంగా ఎలా ఉండగలుగుతున్నారు? అనిపిస్తుంటుంది. ఇందుకు వారి జీవనశైలిలో చేసుకున్న మార్పులు, వారు పాటించే రోజువారి అలవాట్లే కారణమనే విషయం గుర్తించాలి.
గత జ్ఞాపకాలు, సంఘటనలనే తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు చాలామంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవిస్తుంటారు. ఈ క్షణం ఎంత సంతోషంగా, ఎంత విలువైనదిగా గడపాలనే వారి ఆరాటమే వారిలో ఎల్లప్పుడూ హ్యాపిగా, పాజిటివ్‌గా ఉంచుతుందని అర్థం చేసుకోవాలి.
అలాగే ప్రశంసలకు పొంగిపోవడం, సవాళ్లు ఎదురైతే కుంగిపోవడం మానసికంగా బలహీనంగా ఉండే వారి స్వభావం. అదే మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమానంగా స్వీకరిస్తారు. సవాళ్లు ఎదురైనా వాటిని ఓర్పుతో, నేర్పుతో అధిగమిస్తూ తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. మనం గుర్తు పెట్టుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక మార్పు చోటుచేసుకుంటూనే ఉంటుంది. ఆ మార్పుల్ని స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా మనమూ మారినప్పుడే ఆస్వాదించగలం. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇలా ఉండటానికి ఇష్టపడతారు. అది సానుకూల మార్పైనా, ప్రతికూల మార్పైనా… అక్కడే ఆగిపోకుండా పాజిటివిటీతో ముందుకు సాగడం వారు ముందు నుండే అలవాటు చేసుకుంటారు. అందుకే వారికి ఇద సాధ్యం.
ఉన్న దాంట్లో తృప్తిపడరు చాలామంది. ఇంకా కావాలన్న ఆరాటమే వారి అసంతృప్తికి కారణం అవుతుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమకు ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈ సంతృప్తే వారిని సంతోషంగా ఉంచుతుంది. ఇలాంటి వారి ఆలోచనలన్నీ తాము వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలా ఎదగాలీ? అన్న దానిపైనే కేంద్రీకరిస్తారు. దీనివల్ల వారు ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించి మనసు పాడుచేసుకోరు. ఇలా ఎదిగే సమయంలో మోహమాట పడకుండా, నామోషీగా ఫీలవ్వకుండా నిపుణుల సలహాలు కూడా తీసుకుంటారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవడంతో పాటు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సవాళ్లను స్వీకరించడం… ఇలాంటి నిబద్ధతతో కూడిన జీవనశైలే వారిని సానుకూలంగా ముందుకు నడిపిస్తుంది.
ఏ విషయంలోనైనా సరే చుట్టూ ఉన్న వారి మెప్పు పొందాలన్న ఆరాటం కొంతమందిలో ఉంటుంది. ఈ కుతూహలమే మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇతరుల గురించి పట్టించుకోరు. ఇతరుల జడ్జ్‌మెంట్‌తో పనిలేకుండా తమకు నచ్చినట్టుగా తాము ఉండడానికే ఆసక్తి చూపుతారు. ఇదే వారిని సంతోషంగా, సంతృప్తికరంగా జీవించేలా చేస్తుంది.
దృఢంగా వుందాం
- Advertisement -
- Advertisement -