రాష్ట్రాలకు కేంద్రం సలహా
న్యూఢిల్లీ : వచ్చే నెలల్లో డెంగ్యూ, మలేరియా కేసులపై అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలను ముమ్మరం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా గురువారం దేశంలోని డెంగ్యూ, మలేరియా ప్రస్తుత పరిస్థితిపై సమీక్షాసమావేశం నిర్వహించిన తరువాత ఈ సలహా జారీ అయింది. వచ్చే 20 రోజుల్లోగా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు వ్యక్తిగతంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయితీలు, ఇతర స్థానిక సంస్థలతో కలిసి యాక్షన్ ప్లాన్లు సిద్దరం చేయాలని ఈ సలహాలో కేంద్రం తెలిపింది. అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. ‘కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రులతో సహా అన్ని ఆస్పత్రుల్లోనూ తగినన్ని ఔషధాలు, డయాగ్నోస్టిక్స్, పడకలు అందుబాటులో ఉంచాలి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసుపత్రులు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమలను నియంత్రించాలి. అలాగే, ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా డెంగ్యూ పరిస్థితిపై అత్యున్నుత స్థాయిలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు’ అని ఈ సలహాలో పేర్కొన్నారు. లఢక్ మినహా ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో డెంగ్యూ, చికెన్‌గున్యా కేసులు ఉన్నాయని, రుతుపవనాలు, రుతుపవనాల తరువాత కాలంలో ఇవి విజృంభించే అవకాశం ఉందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.