Sunday, October 5, 2025
E-PAPER
Homeహెల్త్మీకు మీరే టీచర్‌ కండి..!

మీకు మీరే టీచర్‌ కండి..!

- Advertisement -

వినడానికి, అనుకోవడానికీ చాలా చిత్రంగా వుంది కదూ?! ఎవరికి వారు టీచర్‌ ఎలా అవుతారు? ఎవరయినా వ్యక్తి తనకి తాను బోధించుకోగలరా? బోధించుకోగలరు. అలా చేయవచ్చు. మామూలుగానే మనలో కొందరు తమలో తాము మాట్లాడుకుంటూ వుంటారు. ఇది వారిలో సహజంగా వున్న లక్షణం. ఆంగ్లంలో ఇంట్రోస్పెక్ట్‌ అంటారు. ఆనందాన్ని, బాధనీ ఏదైనా వూహించనది ఎదుర్కొనప్పుడు వారు తమను తాము ధైర్యపరచుకొనే పద్ధతి. వీటికి తమకు తాము బోధించుకోవడం సులభం. మిగతావారు కొంత అలవర్చుకోవాలి.

ఇందుకు ముందుగా మీరు మీ బలం, లోపాల్ని గుర్తించండి. మీ లక్ష్యాలను కాయితంమీద రాయండి. లక్ష్యసాధనకు రోజూ మీరేం చేస్తున్నదీ రాయండి. ఇందుకు మిమ్మల్ని మీరు ఎంతో విమర్శనాత్మకంగా పరిశీలించుకోవాలి. తప్పులేదు. ఇలా ఒకచోట మీ లక్ష్యాలు, సాధించేందుకు అనుసరిస్తున్న విధానాలు, మీ భావోద్వేగాలు రాయండి. తద్వారా మీ సమస్యల్ని మీరే అధిగ మించగలరు. లక్ష్యసాధనలో మీరు మరింత చురుగ్గా వ్యవహరించగలరు. ఇది మీరు స్కూలు జీవితంలో విజయం సాధించడానికీ ఉపకరిస్తుంది.

అంతెందుకు నటులు, గాయకులు కూడా తమ శక్తిసామర్ధ్యాలు వ్యక్తం చేసుకోవడంలో భాగంగా ఈ పద్ధతిని చేపడుతుంటారు. చాలామంది నటులు తమ పాత్రను ఎంతో బాగా చేయడానికి రాసుకున్న డైలాగ్స్‌ను పదే పదే నటిస్తూ ఒక్కరే ప్రాక్టీస్‌ చేస్తుంటారు. అలాగే గాయకులు కూడా. మరింత బాగా పాడేందుకు ముందుగా తమలో తాము ఆ పాటను కూనిరాగాల స్థాయి నుంచి గొంతెత్తి పాడటం ఒంటరిగా, స్నేహితుల సమక్షంలో ఎంతో ప్రాక్టీస్‌ చేస్తుంటారు. అది వారి వారి రంగాల్లో ఉన్నత స్థాయికి ప్రయాణించడంలో భాగంగా అనుసరించే ఒక ప్రక్రియ. అది ఎంతో ఉపయోగపడుతోంది.
చదువు విషయంలో మీరుకూడా అలా చేయండి. ఎంతో ఉత్సాహం, చరుగ్గానూ పాఠాల్ని నేర్చుకోగలరు.

కిరణ్‌ టెన్త్‌లో ఉండగా నా వద్దకు వచ్చాడు. చదవడం, రాయడంలో ఏకాగ్రతతో ఉండలేకపోతున్నానని అన్నాడు. అతనికి చెప్పిన మంత్రం ఇదే.. ‘బీ యువర్‌ ఓన్‌ టీచర్‌’ అన్నాను. అది ఎలా చేయాలో చెప్పాను. చక్కగా అనుసరించాడు. అన్నింటా మంచి మార్కులతో పాసయ్యాడు. తరగతి గదిలో మీ టీచర్‌ చెబుతున్నట్టే మీకు మీరు పాఠాల్ని వల్లించండి. అంటే మీరు టీచర్‌, మీరే విద్యార్ధిగా భావించుకోండి. పాఠంలోని కీలక పాయింట్లు అప్పజెప్పడం గాకుండా, ఒక్కొక్కటీ నిదానంగా అర్ధం చేసుకుంటూ చదివి, వాటిని టీచర్‌ మీకు మళ్లీ బోధిస్తున్నట్టుగా భావించుకుంటూ మీకు మీరు చెప్పుకోవాలి. ఇందుకు మీకు మీరు అద్దం ముందు నుంచుని ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడానికి ఎవరి సహాయం తీసుకోవద్దు. మీకు మీరే ఒంటరిగా గదిలో అద్దం ముందు నుంచుని లేదా కూచుని ప్రాక్టీస్‌ చేయండి. వేరెవరైనా వుంటే ఇబ్బంది పడతారు. ఇలా చేయడంవల్ల మీ లోపం మీకు తెలుస్తుంది. టీచర్‌ మిమ్మల్ని దండించినట్టే మీరూ మిమ్మల్ని విమర్శించుకోవాలి. ఈ ప్రక్రియంతా మీకు మీరే చేసుకోవాలి సుమా! ఇలా చేయండి…

  1. పాఠం పేరు, సారాంశం నాలుగైదుసార్లు చదవండి.
  2. కీలకపాయింట్లు ఒక్కోటి మెల్లగా చదువుతూ మీకు మీరే టీచర్‌లా ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చుకోండి.
  3. అన్నింటినీ మళ్లీ చదవండి. అద్దం ఎదుట నిలబడి మీ బొమ్మని విద్యార్ధిగా భావించండి.
  4. గదిలో ఒక్కరే ఉండాలి. అప్పుడే ధైర్యంగా మీ లోపాల్ని అధిగమిస్తారు.
  5. అప్పజెప్పడం కంటే ఇది ఎంతో మంచి పద్ధతి. బాగా గుర్తుంటుంది.
    ఇది అన్ని సబ్జెక్టులకూ వర్తిస్తుంది. ముందు ఒంటరిగా ఈ పద్ధతి ప్రాక్టీస్‌ చేసి తర్వాత మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ తోనూ ప్రాక్టీస్‌ చేయండి. ఫ్రెండ్‌ను టీచర్‌గా భావించి ఈ ప్రక్రియ కొనసాగించండి. ఎంతో మార్పు గమనిస్తారు. ఎంతో నేర్చుకుంటారు. అదీ ఊహించనంత తక్కువ సమయంలోనే! ఈ పద్ధతితో మీరు మంచి విద్యార్ధి కాగలరని నా నమ్మకం. ఇవాళ్టి నుంచే ప్రయత్నించండి. మీకే తెలుస్తుంది.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -