అమ్మ కడుపుల పేగుబంధమై మొలకెత్తి
చివురించు మారాకు రెమ్మలకు ఊపిరై
ఇలలోన నడయాడ మొగ్గతొడిగిన పాట
నా పాటలో పల్లవుల వేణువైపోదునా
వేణు గానాన రసరమ్య నాదమైపోదునా
చంద్రవంకను వొంచి మెడల హారము జేసి
లాలిజో రాగాల మురిపాల ముద్దులిడి
అమ్మ రొమ్ముల పాల పొదుగైన పాట
లింగమంతుల గట్టు గజ్జెల్ల లాగుల్లు
సోమప్ప తిరునాళ్ల సిలకల్ల దండల్లు
తప్పటడుగుల తొవ్వ నడక నేర్పిన పాట
ఆయిటిన తొలి చినుకు కాడెడ్ల కోటేరు
యెలగటన యిత్తనం బురదమడిలో నారు
ఆరుగాలం బతుకు ఏరువాకల పాట
సుక్కపొద్దు కాడ మోటబొక్కెన దించి
జోడెడ్ల అడుగుల్ల కదము తొక్కిన నడవ
జానపద తత్వమై జాలువారిన పాట
తెల్లవారిన పొద్దు సింధూర రేఖలై
పచ్చపచ్చని గరికపోచ మోములపైన
ముత్యాల సరమైన మంచుబిందుల పాట
పచ్చగడ్డి మోపు నడుము వాల్చిన సొగసు
ఆకొన్న పరువమ్ము కొమ్ము జులిపిన రంకె
గడ్డిపూవుల పాన్పు సరసమాడిన పాట
బారెడెక్కిన పొద్దు కోండ్రలేసిన సాలు
నడినెత్తి సూరీడు సదును సేసిన దుక్కి
పైరుపంటల కలల సెమటలోడ్చిన పాట
సేను సెలకలు దిప్పి రేకల్ల కల్దాపి
కోతికొమ్మలు ఆడి సిమ్ములెక్కి దునికి
తెలగాణ తెనుగైన పూల తేనెల పాట
మునిమాపు జాముల్ల నీరెండ నీడల్ల
పులపులా సినుకుల్ల చిరుజల్లు చిత్తల్ల
లేగదూడల పరుగు చిందులేసిన పాట
తొలిపొద్దు రంగుల్ల మలిపొద్దు మెరుపుల్ల
ఇంద్రధనువును టుంగుటుయ్యాలగా గట్టి
ఊహలల్లిన మదిని ఊయలూపిన పాట
పరువంపు స్వప్నమై విడివడని కౌగిలై
విడివడిన దారుల్ల విడరాని బంధమై
కూతకొచ్చిన కైతకూతమిచ్చిన పాట
లోకమొక సంపన్న సౌందర్య సౌధమ్ము
గుండె గుప్పిటిల బంధించ బలహీనను
వగపునై విరహనై అనల దాహార్తినై
గమ్యమెటొ కనరాని కారడవి దారినై
ఏకాకి సంచార వేదనైపోతాను
మిన్ను మిణుగురులైన తారల్ల తళుకునై
పుడమి పూదోటలో విరుల సింగారమై
కడలి వెల్లువల కౌగిల్ల మోహార్తినై
నా పాట గొంతుకల తుదిలేని మౌనమై
నా నెలవు జాడల్ల మాయమైపోతాను
ఏకాకి సంచార వేదనైపోతాను
నా నెలవు జాడల్ల మాయమైపోతాను
బైరెడ్డి కృష్ణారెడ్డి, 94400 72211
రసరాగ రమ్యనై
- Advertisement -
- Advertisement -



