”దునియా దేశాల మహిళామణుల్ని, అందాల బందీఖానాలేసి, ఆడదేహాలతో ఆడే జూదాలు. అందాలంటే ఆడోళ్లకే పేటెంట్స్ అంటగట్టి, గంటకొట్టింది పేట్రియార్కీ పెత్తనమే. యాపార సోపాన సామ్రాజ్యాలకు కార్పొరేట్ కాస్మటిక్స్‌ల కరిగిచ్చి, కొలతల కొలిమిల్లో కోతలు పడే ఫాన్సీ ప్లాస్టిక్ అందసందాల విందులకు మహిళా మాంసం కొట్టులు పెట్టి సరుకు సౌదలు అమ్ముకునే సంతలు” ఈ అందాల పోటీలు అని ఈ పోటీల అంతఃసారాన్ని కవిత్వీకరిస్తారు ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర. అసలు అందమంటే ఏమిటో, వాటికి పోటీలు నిర్వహించడంలోని అసలు ఉద్దేశ్యాలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. వివాదాలు, వ్యతిరేకతలు ఎన్ని ఉన్నా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనే హైద్రాబాదు నగరం అందుకు వేదికయింది. ఈ పోటీ కార్యక్రమాన్ని ఇక్కడి విద్యార్థినులు తిలకించి స్ఫూర్తి పొందాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది కూడా. సాధికారత, ఆత్మవిశ్వాసం, యువతలో కలుగచేస్తుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు ప్రకటించారు. నిజంగా అమ్మాయిలకు ప్రేరణ స్ఫూర్తి కలిగిస్తాయా ఇవి?
‘అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం’ అంటాడు ఓ సినీ గీత రచయిత. ఆనందాన్ని కలిగించేదే అందమని కవి హృదయం, ఎవరికి దేనివల్ల ఆనందం కలుగుతుందో ఎలా చెబుతాము! ‘అందమనేది చూసేవాళ్ల చూపులో ఉంటుందన్నది ఓ ఆంగ్ల సామెత. ఒకరికి అందంగా కనిపించింది మరొకరికి కనిపించకపోవచ్చు. అందం కొలతల ప్రమాణాల్లో, రంగుల్లో, ధరించే దుస్తుల్లో ఉండదు. ”నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది” అంటాడు జాన్ కీట్స్. ‘లోకో భిన్న రుచి’ అన్నట్లు వివిధ సాంస్కృతిక జీవన పరిణామాల్లో రూపుదిద్దుకునే ఒక మానసిక భావనే అందం. అది భిన్న ప్రాంతాలలో భిన్న రీతులుగా ఉంటుంది. మరిప్పుడు ప్రపంచమంతటికీ అందమయినదీ అని ఎంపిక చేయడంలో సమంజసత్వం ఏమున్నది? అసలు అందమంటే రూపానికి సంబంధించినదే కాదు. భారతీయ తాత్త్విక ఆలోచనతో చూసినా ‘సత్యం శివం సుందరం’ అంటాడు. సత్యమే శివం, శివమే సుందరం. భౌతికమైన అందం శాశ్వతమైనది కాదంటారు. అసలు వస్తువుకీ, మనిషికి సంబంధించినది కాదు. మనస్సుకి సంబంధించినది. అందుకే ‘ఆత్మ సౌందర్యం’ అనే మాట వింటాం. అదే మనిషి మూలతత్త్వానికి సంబంధించినది. ప్రేమపూరిత మనసు, దయ, కరుణ, సుహృద్భావం వంటి వాటితో మనసు నిండి ఉంటే, ఆ రకమైన సానుకూల భావతరంగాలు మనిషిని కాంతివంతం చేస్తాయి. అప్పుడు అందంగా కనిపిస్తారు. అంతేకాదు, మనం చేసే పనితో, ప్రవర్తనతో, సామర్థ్యాలతో, సాధికారతను, ఆత్మవిశ్వాసాన్ని పొందుతాము తప్ప కేవలం రూపంతోకాదు. వాస్తవంగా పంటను సృష్టించే చేతులది అందం. కాలువలు పారించే కష్టానిది అందం. భవనాల్ని, మందిరాల్ని నిర్మించే శ్రమఫలాలు అందం. అందుకే ”శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోరు” అన్నాడు శ్రీశ్రీ. ఎన్నెన్నో చేతులు నిత్యం శ్రమిస్తూ స్వేదాన్ని ధారపోయటం ద్వారానే మనం అందమైన దుస్తుల్ని, అలంకరణల్ని చేసుకోగలుగుతున్నాము. ”కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిచాన, నీ బుగ్గ మీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా! నిన్ను మించిన కన్నెలెందరొ మండుటెండలో మాడిపోగ, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో”అని వివరించాడు ఆత్రేయ. మంచి మనసు, బాధ్యతగల ప్రవర్తన, సామాజిక అవగాహన, వాస్తవిక మానవీయ సంబంధాలను కలిగి ఉండటంలోనే నిజమైన అందం ప్రస్ఫుటమవుతుంది.
కానీ నేటి అందాన్ని ప్రామాణికరించేది మీడయా, మార్కెటింగ్, వ్యాపారాలు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు. ఈ శక్తులే యువతను ప్రభావితం చేస్తున్నాయి. ప్రదర్శన, సౌందర్య సాధనాలు, దుస్తులు, ప్రవర్తన మొదలైన అంశాల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు. అందాల పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించటానికే కాదు, సమాజంపట్ల బాధ్యత, సమస్యల్లో ఉన్నవారికి చేయూత, సంతోషాలతో కూడిన అందమైన ప్రపంచాన్ని సృష్టించడానికని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ గత సుందరీమణుల ప్రచారమంతా సౌదర్య సాధనాల ప్రచారానికి, సినిమాలకి, సరుకుల మార్కెటింగ్ పెరుగుదలకు ప్రచారానికే వినియోగపడింది. ఇది ప్రపంచవ్యాపిత ఏకరూప వ్యాపార ఏర్పాటుకు చేసే తంతు మాత్రమే. ఈ దేశంలోని 35శాతం మంది అమ్మాయిలకు పోషక విలువలుగల ఆహారం అందటంలేదు. మొత్తం విద్యా శాతంలో బాలికల విద్యా శాతం తక్కువగానే ఉంది. వివక్షతకు, ఇంట్లో చాకిరికి, హింసకు గురవుతున్న మహిళల సంఖ్య తగ్గడమేలేదు. వీటి గురించిన చర్చ ఏమీ మనముందులేదు. వారి సాధికారతకు తీసుకునే చర్యలూ కానరావు. కానీ అందాల పోటీల పేరుతో వ్యాపార సరుకుల మోహాన్ని పెంచడమే కాదు, స్త్రీల వ్యక్తిత్వాన్ని అందానికి, ప్రదర్శనకు పరిమితం చేస్తున్నారు. అందమైన సరుకుగా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ఇది పూర్తి వ్యతిరేకమైనది. కొంగు నడుముకు చుట్టి కొడవళ్లు చేతబట్టిన చైతన్య సంస్కృతి ఇక్కడి మహిళలది.
అందాలూ సరుకులూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES