– మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు పోరాట వేదిక వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో జరగబోయే ప్రపంచ సుందరి 72వ అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని ‘మిస్‌వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక పోరాట వేదిక’ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదకు వేదిక నాయకులు పీవోడబ్య్లూ జాతీయ నేత పి. సంధ్య, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఏఐఎమ్‌ఎస్‌ఎస్ నేత ఈ.హేమలత, పీవోడబ్య్లూ నేత లక్ష్మిబాయి, రాష్ట్ర అధ్యక్షులు స్వరూప, ఎన్‌ఎస్‌ఎఫ్‌ఐడబ్య్లూ రాష్ట్ర కార్యదర్శి ఎన్. జ్యోతి, ఫైముదలతో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది. ‘అందాల పోటీలు మహిళా సాధికారతకు సంకేతం కాదు. వాటిని ప్రభుత్వం నిర్వహించరాదు. మహిళల వ్యక్తత్వాన్ని కించపరిచే మిస్‌వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు. మే 10న ప్రారంభమై…31న గ్రాండ్ ఫినాలేతో ముగిస్తామని తెలిపారు. తెలంగాణ మహిళలకు ఈ పోటీలు ఏ మాత్రం గర్వకారణం కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు ఎన్నో మార్గాలుండగా మహిళలకు అవమానకరమైన పోటీలను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మహిళలను ప్రదర్శన వస్తువుగా చూపించి, సామ్రాజ్యవాద మార్కెట్‌కు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడం సిగ్గుపడాల్సిన విషయమని వారు అభిప్రాయపడ్డారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా, వారి దృష్టిని మళ్లించేందుకు ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నదని విమర్శించారు. స్త్రీల శరీరాలకు కొలతలు విధించి, అశ్లీల ప్రదర్శనలతో తమ సౌందర్య ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ పోటీలు సాధనమని తెలిపారు. తద్వారా దేశ ప్రతిష్ట ఎలా పెరుగుతుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను వినియోగదారీ వస్తువుగా తయారు చేసే ప్రపంచ సుందరి పోటీలను, సామ్రాజ్యవాద విష సంస్కృతిని వ్యతిరేకించాలని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్‌వరల్డ్ పోటీలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
అందాల పోటీలను రద్దు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES