Thursday, October 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసుంకాల బెదిరింపుల వల్లే..

సుంకాల బెదిరింపుల వల్లే..

- Advertisement -

బ్రిక్స్‌ నుంచి వైదొలిగిన దేశాలు : అర్జెంటీనా అధ్యక్షుడితో భేటీలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు


బ్రిక్స్‌ కూటమి ఆశయాలను తారుమారు చేసిన ఘనత తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. సుంకాల బెదిరింపుల వల్లే దేశాలు బ్రిక్స్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిందని అన్నారు. అలాగే బ్రిక్స్‌ను డాలర్‌పై దాడిగా అభివర్ణించారు. వైట్‌హౌస్‌లో అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్‌ మిలేతో భేటీ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ”నేను డాలర్‌ విషయంలో చాలా బలంగా ఉన్నా. డాలర్లతో వ్యవహరించాలనుకునే ఎవరైనా, వారికి బ్రిక్స్‌లో లేని వ్యక్తుల కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా బ్రిక్స్‌లో ఉండాలనుకుంటే పర్లేదు. కానీ మేం ఆ దేశంపై సుంకాలు విధిస్తాం. బ్రిక్స్‌ అంటే డాలర్‌పై దాడి.

ఆ ఆట ఆడాలనుకుంటే అమెరికాకు వస్తున్న మీ ఉత్పత్తులన్నింటిపైనా సుంకాలు విధిస్తా అని స్పష్టంగా చెప్పా. ఆ తర్వాత బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా నేతత్వంలోని ఆర్థిక కూటమిలో పాల్గొనే ఆలోచనను అనేక దేశాలు పునరాలోచించాయి. నేను చెప్పినట్టుగానే బ్రిక్స్‌ నుంచి తప్పుకుంటున్నామని చెప్పాయి” అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య వ్యవస్థలపై జరుగుతున్న చర్చల మధ్య ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధాన పరపతి సాధనంగా సుంకాలను చాలా కాలంగా ట్రంప్‌ ఉపయోగిస్తున్నారు. తన చర్యను డాలర్‌, అమెరికన్‌ ఆర్థిక శక్తికి విజయంగా అభివర్ణించారు.

బ్రిక్స్‌ దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై సుంకాలను డొనాల్డ్‌ ట్రంప్‌ రెట్టింపు చేశారు. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక సమూహంగా పేర్కొంటూ, కూటమి విధానాలను అనుసరిస్తున్న ఏ దేశంపైనైనా అదనంగా 10 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. బ్రిక్స్‌ చిన్న సమూహమని, అది వేగంగా పతనమవుతోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ను, దాని ఆధిపత్యాన్ని, ప్రమాణాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలను సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కరెన్సీ పతనాన్ని తాను అనుమతించబోనని అన్నారు. తన సుంకాల హెచ్చరిక తర్వాత జరిగిన బ్రిక్స్‌ సమావేశానికి హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ట్రంప్‌ పేర్కొన్నారు.

అమెరికా డాలర్‌ ప్రపంచ ముడి చెల్లింపులు కరెన్సీగా ప్రాముఖ్యం కలిగి ఉంది. ఆయిల్‌ కొనుగోలు నుంచి అంతర్జాతీయ రుణాల వరకు డాలర్‌ రూపంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్‌ దేశాలు దేశాలు ”డీ-డాలరైజేషన్‌” పేరుతో స్థానిక కరెన్సీలు వాడటంపై చర్చలు జరుపుతున్నాయి. ఇది అమెరికాకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా హాని చేయవచ్చని ట్రంప్‌ భావిస్తున్నారు. ఆ కారణంగానే బ్రిక్స్‌ దేశాలను ఒత్తిడి చేయడం కోసం టారిఫ్‌ల పేరుతో హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్‌ అనేది మొదట బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఆర్థిక కూటమి.

2024లో ఈ కూటమిలో ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవడం ద్వారా విస్తరించింది. ఆ తర్వాత 2025లో ఇండోనేషియా చేరింది. బ్రిక్స్‌ కూటమి అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం గురించి చర్చించింది. అయితే, సభ్య దేశాలు ఈ లక్ష్యంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ డాలర్‌ ఆధిపత్యంపై చర్చ జరిగిన తర్వాత బ్రిక్స్‌ కూటమిపై అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -