మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్
రిజర్వేషన్లకు ఆమోదం…116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు
బాసర టు భద్రాద్రి టెంపుల్ సర్య్కూట్‌పై క్యాబినెట్ సబ్‌కమిటీ
మెట్రోరైల్ రెండోదశ భూసేకరణ కోసం రూ.2,787 కోట్లు
14 ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు భూములు కేటాయింపు
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లా, ఫార్మసీ కళాశాలల ఏర్పాటు
మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు…వివరాలు వెల్లడించిన మంత్రులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం ఖరారైన రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 15న శివరాత్రి, 16న రంజాన్, ఆ తర్వాత విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున, వెంటనే ఎన్నికలు పూర్తిచేయాలని భావించింది. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్‌కు వెలుపలు మేడారంలోని సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దనసరి అనసూయ సీతక్క విలేకరులకు వెల్లడించారు. రాష్ట్ర 27వ మంత్రివర్గ సమావేశం సమ్మక్క, సారలమ్మ నివాసమైన పుణ్యక్షేత్రంగా భావించే మేడారంలో జరగడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు చెప్పారు.
రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు ఉన్నాయనీ, ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని పురాతన దేవాలయాలన్నింటినీ కలిపి బాసర టు భద్రాద్రి వరకు టెంపుల్ సర్య్కూట్‌గా ఏర్పాటు చేసి, ఎకో టూరిజం, పురాతన ఆలయాల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవాదాయ, రెవెన్యూ, అటవీ,పర్యాటక, పురాతత్వశాఖల సంయుక్తాధ్వర్యంలో ఈ కమిటీ ఇచ్చే నివేదిక, ప్రణాళికలపై మార్చి 31 లోపు నిర్ణయాలు తీసుకుంటారు. హైదరాబాద్ మెట్రోరైల్ ఫేజ్-1లో ఎల్ అండ్ టీ నుంచి సంస్థను టేకోవర్ చేసే అంశంపై చర్చించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
మెట్రోరైల్ ఫేజ్-2(ఏ) లోని నాలుగు కారిడార్లు, ఫేజ్-2(బీ)లోని మూడు కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ ప్రతిపాదనల అమలుకు రూ.2,787 కోట్ల నిధుల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పనుల్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లా, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లా కళాశాలలో 24 పోస్టులు, ఫార్మసీ కళాశాలలో 28 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని మంత్రులు తెలిపారు. హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం లభించింది. అలాగే హైదరాబాద్‌లోని ఐ త్రిబుల్ సీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కి.మీ., రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు.
ములుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.143 కోట్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి, ములుగు జిల్లాలోని ఐదు గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపుతారు. దీనివల్ల 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమ్మక్క, సారలమ్మ పునరుద్ధరణ దేవాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు. ఇక్కడి రాతినిర్మాణాలు మరో వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా కట్టారని ప్రశంసించారు. అలాగే దేవాలయ ప్రాంతాన్ని మంరింత అభివృద్ధి చేసేందుకు మరో 21 ఎకరాల భూ సేకరణ కూడా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రామప్ప నుంచి లక్నవరం మీదుగా జంపన్న వాగులో నిరంతరం గోదావరి నీటిని పారించేలా అవసరమైన చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఆమోదం లభించింది. దీనివల్ల జంపన్న వాగులో 365 రోజులు నీళ్లు ఉంటాయని మంత్రులు తెలిపారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో హ్యామ్ రోడ్స్‌కు సంబంధించి రూ.11,334 కోట్ల అంచనాతో 6వేల కి.మీ., పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ.6 వేల కోట్లతో 9వేల కి.మీ., రోడ్ల నిర్మాణం చేపడుతున్నామనీ, వచ్చే రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో మట్టిరోడ్లు కనిపించవని తెలిపారు. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఎకో టౌన్ డెవలప్‌మెంట్‌కు టీజీఐఐసీకి 494 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.



