Sunday, April 12, 2026
E-PAPER
Homeచౌరస్తాబిచ్చగాళ్ల స్వర్గం

బిచ్చగాళ్ల స్వర్గం

- Advertisement -

పాపం అంటే పాపమనే పుణ్యం అంటే పుణ్యం అనే. పాపపుణ్యాలనేవి మనుషుల పాస్ట్‌కీ, ప్రజెంట్‌కీ, ఫ్యూచర్‌కీ అడ్జస్టు అవుతాయంటారు. అవసరమైనంత మేరకు పాపం చేసినా, పుణ్యం చేసుకుని, దాని ముఖం మాడిపోయేలా చేయవచ్చునని జ్ఞానమూ, గడ్డమూ బాగా పెరిగి వున్నవాళ్లు చెబుతుంటారు. నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తే కూడా పుణ్యం మూటకట్టుకు తెచ్చుకోవచ్చునని అంటారు కాని, ఎక్కడికో పోయి, చన్నీళ్లల్లో మునిగి, జలుబు తెచ్చుకోవడానికంటే మనం గడప దాటగానే ఎదురుపడే వాళ్లకి ఓ కాయినో, కాగితమో ఇచ్చి బదులుగా పుణ్యం పుచ్చుకోవడం తెలివైన పని కాదంటారా?

సిటీలో మన పాపాన్ని శుభ్రంగా కడిగెయ్యడానికి ఎందరో కలరు కదా! పావలా, అర్థా పుచ్చుకుని మన అకౌంట్లోకి పుణ్యం ట్రాన్స్‌ఫర్‌ చేసేవాళ్ల గుంపు ఒకటి రోడ్డు పక్క ఫ్లాట్‌ ఫాం మీద ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటున్నది. వీళ్లల్లో దేవుడి గుడి ముందు క్యూకట్టి కూచునేవాళ్లు, రైల్లో సీటు వెతుక్కుంటుంటే అడ్డంగా నిలబడే వాళ్లు, బస్‌ స్టాండ్లో బస్సెక్కుతుంటే భుజం పట్టుకులాగేవాళ్లు, సిగ్న‌ల్‌ లైటు దగ్గర బైక్‌ ఆపి నిలబడితే వీపు గోకేవాళ్లు, కళ్లు లేని కబోదులు, కళ్లుండీ కబోదులు, కాళ్లుండీ భుజం దాకా చేయిల లేనివాళ్లు, మనికట్టు దగ్గర అర చెయ్యి లేని వాళ్లు సగం అరచెయ్యికి గుడ్డ చుట్టుకున్న వాళ్లు, మొహాల మీది అడ్డదిడ్డంగా బొట్టున్నవాళ్లు, బొట్లులేని ముఖాల్లో గాట్లున్న వాళ్లు, పిల్లలూ, పెద్దలూ, ఆడాళ్లూ, మగాళ్లూ వున్నారు.

అమ్మా దరమం చెయ్యండి తల్లీ… బాబూ దానం చెయ్యండయ్యా, గుడ్డోన్ని నాయనా.. కుంటోడ్ని బాబూ.. కూడు తిని మూడురోజులయ్యిందయ్యా అని అరిచి గీ పెట్టేవాళ్లు, అరవకుండా పొట్ట చూపించేవాళ్లు సమావేశమవడాన్ని అక్కడ వున్న ఓ సీనియర్‌ బెగ్గర్‌ స్వాగతించాడు. గుళ్లల్లోనూ, రైళ్లలోనూ, రోడ్లమీదా టూరిస్ట్‌ స్పాట్‌లలోనూ అడుక్కోవడం కాసేపు మానేసి ఈ బెగ్గర్స్‌ కాన్ఫరెన్స్‌కి వచ్చేసిన కుంటీ, గుడ్డీ, గూనీ, ఆడా మగా పిల్లా జెల్లా బెగ్గర్సందరికీ స్వాగతం అన్నాడు. తమ తమ దగ్గర వున్న చిల్లర నాణాల డబ్బాలను ఊపి చప్పుడు చేశారు మీటింగ్‌కి వచ్చిన బిచ్చగాళ్లు.

యోచన చేసేవాడు యోగి, యాచన చేసేవాడు బైరాగి. ఈ లోకంలో అనేక వృత్తులున్నాయి. అన్నింట్లోనూ ప్రధానమైనవి మూడే మూడు. అవి అమ్ముకోవడం, లాక్కోవడం, అడుక్కోవడం. సత్యం శివం సుందరం అంటే ఇదే. వీటిల్లో అడుక్కోవడం అన్నది మన పవిత్ర వృత్తి. పుణ్యం పంచిపెట్టేది కనుక పవిత్రమైన వృత్తి కాదంటారా? అని గడ్డం నిమురుకున్నాడు సీనియర్‌ బెగ్గర్‌. అవును! అవునవును అంటూ చిల్లర డబ్బులు పైకి ఎగరేశారు బెగ్గాడియన్స్‌. మనం అవతలివాడికి పుణ్యం కోసం అడ్డుక్కుంటున్నాం కానీ రాజకీయంలో రాటుదేలిన వాళ్లు అడుక్కోవడం మనకంటే బాగా తెల్సినవాళ్లు, ప్రజాప్రతినిధులూ, మంత్రులూ అవుతున్నారు. మనం మన కోసం కాకుండా జనం కోసం వాళ్ల రాబోయే జన్మల కోసం ఈ పని చేస్తున్నాం. అడుక్కోవడం అనేది మామూలు విద్య కాదు, సంకేతిక విద్య. అవతలి వాడి గుండెని చెరువు చెయ్యడమూ, ఇచ్చేవాడు ఏదో ఒకటి ఇచ్చి వదిలించుకునేందుకు, వాడి ఒంట్లో తేళ్లు, జెర్లూ పాకించడం ఆషామాషీ వ్యవహారం కాదు.

అసలు మన వృత్తి మూల పురుషుడైన దేవేంద్రుడు, కర్ణుడి దగ్గర కవచ కుండలాలు అడుక్కుందుకు చూపిన వృత్తి నైపుణ్యం సామాన్యమైనదా? సూర్యుడి దగ్గర తను తీసుకుంటున్న వెలుతురు అప్పో.. బిచ్చమో తెలీకుండా మానేజ్‌ చేస్తున్న చంద్రుడి గొప్పదనం చెప్పనే అక్కర్లేదు. అయిదేళ్లకు ఒకసారి ఓట్లు అడుక్కునే సీజనల్‌ సోదరుల సంగతేమో కానీ ప్రతిరోజూ అమ్మా! అయ్యా! బాబూ! సార్‌! అని అడుక్కునే రెగ్యులర్‌ బిచ్చగాళ్లందరూ బెగ్గింగ్‌ కార్మికులే కదా, మన రాజకీయ నాయకులు సెక్యులరిజమ్‌ గురించి తెగ చొల్లు వాగుళ్లు వాగుతారు కానీ ఈ దేశంలో నిజమైన సెక్యులరిస్టులం మనమే. శనివారం ఆంజనేయస్వామి, ఆదివారం ఏసుఫాదర్‌, శుక్రవారం అల్లామియా, మరోనాడుమరో గాడ్‌, కట్టూ బొట్టూ, భాషా రాజకీయ నాయకులలాగా మనమూ మార్చగలం.
అవతల రైళ్లు వెళ్లిపోతాయి. బస్సులు మిస్సయితయి. జేబులో చిల్లర పెట్టుకుని పుణ్యం కోసం ఎదురు చూసేవాళ్లు డిజప్పాయింటవుతారు. పెద్దాయనా త్వరగా ముగించు అని సీనియర్‌ బెగ్గర్‌ చెవిలో ఊదాడు మరో సూపర్‌ సీనియర్‌ బెగ్గర్‌.

సీనియర్‌ స్పీచ్‌ కంటిన్యూ చేశాడు. యాచక వృత్తి అనగా బెగ్గింగ్‌ ప్రొఫెషన్‌కు సంబంధించి నేను రాసిన ‘యాచక సంహిత’ త్వరలో రిలీజవుతుంది. దీన్ని చింతపట్ల సుదర్శన్‌ చేత ‘బెగ్గర్‌ మాన్యవల్‌’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేయిద్దాం. బ్రదర్‌ బెగ్గర్స్‌… బెగ్గర్‌ బ్రదర్స్‌.. ఇకముందు ప్రభుత్వం బెగ్గర్స్‌ కి కూడా ‘ఎంపీ, ఎం.ఎల్‌.ఎ.’ సీట్లు రిజర్వు చేయాలి. ఎలక్షన్లప్పుడు మన వృత్తిలోకి జొరబడే వాళ్లు ఆ మాత్రం చెయ్యాలి కదా. ప్రభుత్వ విధానాల పుణ్యం పుచ్చిపోతుండడం వల్ల రోజురోజుకీ మన వృత్తిలో చేరుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఇది ఇలా బౌల్‌ పెరిగి పెరిగి మన రాష్ట్రం ‘బెగ్గర్స్‌ బౌల్‌’ అనగా బిచ్చగాళ్ల బొచ్చె’గా మారే మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. బిచ్చగాళ్ల సంఖ్యను ఇంకా ఇంకా పెంచి మన రాష్ట్రాన్ని బిచ్చగాళ్ల స్వర్గంగా మార్చుకుందాం. అంతేకాదు, ప్రపంచ బెగ్గరులందరూ ఏకం కావాలని కృషి చేద్దాం. ప్రపంచ బెగ్గరులారా ఏకం కండి’ అని నినాదాలు చెయ్యండి అంటూ సీనియర్‌ స్పీచ్‌ ముగించాడు. ప్రపంచ బెగ్గరులారా ఏకం కండి అన్న కేకలతో ఆచోటు అదిరిపోయింది.

  • చింతపట్ల సుదర్శన్‌
    9299809212
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -