Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుదుబాయ్‌లో భిక్షాటన.. 13 ఏళ్ల తర్వాత సొంతూరికి తెలంగాణ వాసి

దుబాయ్‌లో భిక్షాటన.. 13 ఏళ్ల తర్వాత సొంతూరికి తెలంగాణ వాసి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పదమూడేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి అదృశ్యమైన ఓ వ్యక్తి, ఇక తిరిగి రాడనుకున్న తరుణంలో అనూహ్యంగా సొంతూరుకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్న సమయంలో ఓ సహృదయుడి చొరవతో ఈ అద్భుతం జరిగింది. మెదక్ జిల్లా వాసి అయిన కొనింటి కృష్ణ శుక్రవారం తన స్వగ్రామమైన ఉప్పులింగాపూర్‌కు చేరడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌కు చెందిన కొనింటి కృష్ణ 13 ఏళ్ల క్రితం పని కోసం దుబాయ్‌ వెళ్లి తప్పిపోయాడు. ఉపాధి దొరక్క దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హనుమంత్‌రెడ్డి దుబాయ్‌లో యాచిస్తున్న కృష్ణను చూసి పలకరించారు. మాటల సందర్భంలో తనది మెదక్ జిల్లా ఉప్పులింగాపూర్‌ అని కృష్ణ చెప్పడంతో హనుమంత్‌రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే ఉప్పులింగాపూర్‌లోని స్థానిక నాయకులతో మాట్లాడి కృష్ణ వివరాలను ధ్రువీకరించుకున్నారు.

ఆ తర్వాత హనుమంత్‌రెడ్డి పూర్తి బాధ్యత తీసుకున్నారు. దుబాయ్‌లోని అధికారులతో మాట్లాడటమే కాకుండా, తన సొంత డబ్బు సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి కృష్ణను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన కృషి ఫలించి, శుక్రవారం నాడు కృష్ణ తన సొంత గ్రామంలో అడుగుపెట్టాడు. సుదీర్ఘ కాలం తర్వాత తమ వాడిని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు తమకు సహాయం చేసిన హనుమంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad