సోలార్ ప్యానెల్లతో జాగ్రత్త
జీవితకాలం ముగిశాక రీసైక్లింగే అసలు సమస్య
సరైన నిర్వహణ లేకపోతే కష్టమే
నేల, నీరు కలుషితమయ్యే ప్రమాదం
భారత్‌కు ఇప్పటికీ లేని స్పష్టత
చట్టాల అమలు సైతం పేలవం
భవిష్యత్‌లో పర్యావరణానికి ముప్పు
హెచ్చరిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ : సంవత్సరమంతా సమృద్ధిగా సూర్యకాంతి లభించే భారత్.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఎదిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే వ్యూహంలో ఈ పునరుత్పాదక శక్తి కీలకంగా మారింది. అయితే దేశంలో దీని విస్తరణ వెనుక ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడని ఒక తీవ్ర సమస్య, ప్రమాదం దాగి ఉన్నది. అవే సోలార్ ప్యానెల్ వ్యర్థాలు. వాటి జీవిత కాలం ముగిశాక రీసైక్లింగ్ విషయంలో సరైన నిర్వహణ లేకపోతే భవిష్యత్తులో పర్యావరణానికి పెనుముప్పుగా మారే ప్రమాదమున్నదని ఎనర్జీ సెక్టార్, నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలలో ఇండ్ల పైకప్పులపై సౌర ప్యానెల్లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా తోడవడంతో వినియోగం పెరిగిపోయింది. ఈ విస్తరణ వల్ల బొగ్గుపై ఆధారపడే విద్యుత్ ఉత్పత్తి కొంతమేర తగ్గింది. సౌర విద్యుత్ వాటా 20 శాతానికి మించి పెరిగిపోయింది. అయితే ఈ పెరుగుదలలో మరో భయం దాగి ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
భారత్‌కు లోపించిన స్పష్టత
సౌర ప్యానెల్లు ఉపయోగంలో ఉన్నంతకాలం పర్యావరణానికి హానికరం కావు. కానీ వాటి జీవితకాలం (సాధారణంగా 25 సంవత్సరాలు) ముగిసిన తర్వాతే అసలు సమస్య. జీవితకాలం ముగిసిన తర్వాత వాటిని ఎలా నిర్వహించాలన్న విషయంలో భారత్‌కు ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రణాళిక లేదని విశ్లేషకులు అంటున్నారు. సోలార్ ప్యానెల్లు ప్రధానంగా గాజు, అల్యూమినియం, వెండి, పాలిమర్లు వంటి పదార్థాలతో తయారవుతాయి. వీటిని ఎక్కువగా రీసైకిల్ చేయొచ్చు. అయితే వీటిలో ఉన్న సీసం, కాడ్మియం వంటి విషలోహాల విషయంలో మాత్రం ప్రమాదం దాగి ఉన్నది. వాటిని సరైన విధంగా నిర్వహించకపోతే అవి నేల, నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సౌర వ్యర్థాలు విపరీతంగా పెరిగే ప్రమాదం
భారత్‌లో సోలార్ వేస్ట్(సౌర వ్యర్థాల)పై అధికారిక గణాంకాలు లేవు. కానీ ఒక అధ్యయనం ప్రకారం 2023 నాటికి సుమారు లక్ష టన్నులుగా ఉన్న సౌర వ్యర్థాలు.. 2030 నాటికి దాదాపు 6 లక్షల టన్నులకు చేరుకోవచ్చు. అది 2047 నాటికి 1.1 కోట్ల టన్నులకు పైగా పెరిగే అవ కాశం ఉన్నది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) చేసిన అధ్యయనం ప్రకారం.. ఈ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలంటే వచ్చే రెండు దశాబ్దాల్లో 300 ప్రత్యేక రీసైక్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇందుకు సుమారు 478 మిలియన్ డాలర్ల ( రూ.4000 కోట్లు) పెట్టుబడి అవసరం అవుతుంది.
ముందుంది అసలు ముప్పు
భారత్‌లో చాలా పెద్ద సౌర పార్కులు 2010ల మధ్య లో నిర్మించబడ్డాయి. కాబట్టి మరో పది, పదిహేను ఏండ్ల లోనే వాటి జీవిత కాలం ముగిసే అవకాశాలున్నాయి. దీంతో అసలు వ్యర్థాల ముప్పు అప్పుడు మొదలయ్యే ప్రమాదం ఉన్నదని ఎనర్జీ సెక్టార్ నిపుణుడు రోహిత్ పాహ్వా చెప్తు న్నారు. దేశంలో ప్రస్తుతం వ్యర్థాల పరిమాణం తక్కువగా కనిపిస్తున్నా… పెద్ద ఎత్తున ప్యానెల్ల జీవితకాలం ఒకేసారి ముగిసిపోతే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్నదని అంటున్నారు.
మంచి అవకాశంగా సంక్షోభం?
ఈ సమస్యలో మంచి అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. సౌర వ్యర్థాలు పెరిగే కొద్దీ.. వాటిని ప్రాసెస్ చేసే పరిశ్రమలకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. సరైన రీసైక్లింగ్ జరిగితే.. 2047 నాటికి 38 శాతం పదార్థాలు తిరిగి కొత్త ప్యానెల్లకు ఉపయోగించ వచ్చు. గనుల తవ్వకాల వల్ల వచ్చే 3.7 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించొచ్చు. భారత్‌లో గాజు, అల్యూమినియం మార్కెట్లు ఇప్పటికే ఉన్నాయి. సిలికాన్, వెండి, కాపర్ వంటి విలువైన లోహాలను సమర్థంగా వెలికి తీయగలిగితే.. దేశ పరిశ్రమలకు ఇది పెద్ద లాభదాయకంగా మారుతుందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
నిపుణుల హెచ్చరికలు
సౌర విద్యుత్ విషయంలో సంబంధిత రంగానికి చెందిన నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ”సౌర విద్యుత్ దశాబ్దాల పాటు క్లీన్ ఎనర్జీ(శుభ్రమైన శక్తి) అన్న భ్రమను కలిగిస్తుంది. కానీ రీసైక్లింగ్‌పై సరైన ప్రణాళిక లేకపోతే.. భవిష్యత్తులో మాడ్యూళ్ల సమాధి స్థలాలే మిగులుతాయి” అని పర్యావరణ నిపుణులు సాయి భాస్కర్‌రెడ్డి నక్క హెచ్చరిస్తున్నారు. సౌర విద్యుత్ ద్వారా లాభాలు పొందే కంపెనీలు.. ప్యానెల్ల జీవితకాలం ముగిసిన తర్వాత వాటి బాధ్యత కూడా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
‘రీసైక్లింగ్ వ్యవస్థను బలపర్చాలి’
భారత సౌర విద్యుత్ లక్ష్యాలను సుస్థిరంగా సాధించాలంటే.. రీసైక్లింగ్ వ్యవస్థను ఇప్పుడే బలపర్చాలి. గృహస్థాయిలో అవగాహన పెంచాలి. సౌర వ్యాపార నమూనాల్లోనే వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ను భాగం చేయాలి. అలా చేయకపోతే క్లీన్ ఎనర్జీగా చెప్పబడే సౌరశక్తి రేపటి ప్రమాదకర వ్యర్థాలుగా మారే ప్రమాదమున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, నిబంధనలను కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.
చట్టాల అమలు పేలవం
భారత్ 2022లో సౌర ప్యానెల్లను ఈ-వేస్ట్ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం తయారీదారులే ప్యానెల్లను తిరిగి సేకరించి, నిల్వ చేసి, విప్పి, రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల అమలు తీరు సరిగ్గా లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండ్లపై అమర్చిన చిన్న సౌర ప్యానెల్లు (మొత్తం ఇన్‌స్టాలేషన్లలో 5-10 శాతం) ట్రాక్ చేయడం, సేకరించడం చాలా కష్టం. ఫలితంగా చాలా ప్యానెల్లు చెత్త కుప్పల్లో, అనధికార రీసైక్లింగ్ కేంద్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ అనుసరించే అసురక్షిత పద్దతులు విషపదార్థాలు బయటకు విడుదలయ్యేలా చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



