Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంటారిఫ్‌ తగ్గింపుల వెనుక..!

టారిఫ్‌ తగ్గింపుల వెనుక..!

- Advertisement -

– అనిశ్చితి…అస్పష్టత
– జవాబు లేని ప్రశ్నలెన్నో
– షరతులు వెల్లడించిన ట్రంప్‌
– నోరు విప్పని మోడీ

న్యూఢిల్లీ : భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం, దానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పడం తెలిసిందే. ట్రంప్‌ నిర్ణయం భారతీయ ఎగుమతిదారులకు ఎంతో ఊరట కలిగించింది. రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంగా జరుగుతున్న వాణిజ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి అతి త్వరలోనే శుభం కార్డు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్‌లో కోతను మన దేశంలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి కూడా ధృవీకరించారు.

దౌత్య క్రెడిట్‌ కోసం ట్రంప్‌ తహతహ
భారత్‌పై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ అదే సమయంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడం, సుంకాలను, సుంకేతర అవరోధాలను ‘జీరో’ స్థాయికి తేవడం, ఐదు వందల బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన ఇంధనాన్ని, ఇతర వస్తువులను అమెరికా నుంచి కొనుగోలు చేయడం సహా పలు చర్యలకు భారత్‌ అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే మోడీ తన స్పందనలో ట్రంప్‌ పెట్టిన ఈ షరతులలో దేనినీ ప్రస్తావించలేదు. వాణిజ్య ఒప్పందం వివరాలు కూడా తెలియజేయలేదు. అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని మాత్రం అన్నారు. ఒప్పందం గురించి ట్రంప్‌ చెప్పిన మాటలకు, మోడీ వెర్షన్‌కు మధ్య అనేక వైరుధ్యాలు కన్పిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్‌ ప్రకటన చేయడాన్ని చూస్తుంటే తన దౌత్యం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పుకోవాలని ఆయన ఉవ్విళ్లూరినట్లు కన్పిస్తోంది.

ప్రభుత్వ వ్యయంలో 85 శాతం కొనుగోళ్లకే
సుంకాలను తగ్గించినందుకు ప్రతిగా అమెరికా నుంచి భారీగా కొనుగోళ్లు జరిపేందుకు మోడీ అంగీకరించారని ట్రంప్‌ తెలిపారు. ఇంధనం, టెక్నాలజీ, వ్యవ సాయం, బొగ్గు సహా ఐదు వందల బిలి యన్‌ డాలర్ల విలువ కలిగిన అనేక ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తుం దన్నది ఆయన ప్రకటన సారాంశం. అమెరికాపై విధించిన సుంకాలను, సుంకేతర అడ్డం కులను భారత్‌ పూర్తిగా తొలగిస్తుందని కూడా ట్రంప్‌ చెప్పారు. ప్రస్తుత మారకపు రేట్లను బట్టి ఐదు వందల బిలియన్‌ డాలర్లు అంటే రూ.45.5 లక్షల కోట్లు. 2026-27 సంవత్సరానికి లోక్‌సభ ముందు ఉంచిన కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాన్ని రూ. 53.5 లక్షల కోట్లుగా చూపారు. అంటే కేంద్ర ప్రభుత్వ వ్యయంలో అమెరికా నుంచి కొనుగోళ్లకు వెచ్చించేది సుమారు 85 శాతం అన్న మాట. ఈ పోలిక, ఈ సంఖ్య ప్రభుత్వ వాస్తవ వ్యయాన్ని ప్రతిబింబి స్తుందా, దీర్ఘకాలిక సంచిత వాణిజ్యాన్ని సూచి స్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ఇది కేవలం రాజకీయ అంచనా మాత్ర మేనని, ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట హామీ కాదని కూడా అంటున్నారు.

టారిఫ్‌ భారం తగ్గుతుందంటున్న ఆర్థికవేత్తలు
అమెరికా నుంచి జరిపే కొనుగోళ్ల విలువపై అస్పష్టత కొనసాగుతున్నప్పటికీ సుంకాల తగ్గింపు అనేది మాత్రం సానుకూల ప్రకటనేనని ఆర్థికవేత్తలు అభి ప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత దేశంపై సుంకాల భారం తగ్గి పోతుందని ఎలారా క్యాపిటల్‌ సంస్థకు చెందిన పరిశోధనా విభాగం సహాయ అధిపతి, ఆర్థికవేత్త గరిమా కపూర్‌ చెప్పారు. భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాన్ని అమెరికా తగ్గిం చడంతో వాణిజ్య ఒప్పందం కుదురు తోందని, దీని తర్వాత దేశంపై పడే టారిఫ్‌ రేటు 14.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆమె తెలిపారు. అమెరికాకు రత్నాలు, ఆభర ణాలు, వస్త్రాలు, దుస్తులు, యంత్రాలు, పరికరాలు, ఆటోమొబైల్స్‌ ఎగుమతులు పెరుగుతాయని అన్నారు.

సమాచార గోప్యతకు భంగం కలగదా?
ఒప్పందం ప్రకారం భారతీయ టెక్నాలజీ డేటా అమెరికా కంపెనీలకు అందుబాటులోకి వస్తుంది. ఏఐని అభివృద్ధి చేసుకుంటున్న టెక్‌ కంపెనీలకు మరింత డేటా అవసరమవుతుంది. అందుకే అమెరికా టెక్‌ కంపెనీలు భారత్‌లో కొంత పెట్టుబడి పెట్టే విషయం గురించి మాట్లాడుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కారణంగా మన డేటా అమెరికా టెక్‌ కంపెనీలకు సులభంగా అందుబాటులోకి వస్తుందా? అప్పుడు భారత నిపుణుల సొంత ఆవిష్కరణల సంగతేమిటి? దేశ పౌరుల ప్రైవసీ మాటేమిటి?

మేధో హక్కుల ప్రస్తావన ఉంటుందా?
వాణిజ్య ఒప్పందంలో మేధో సంపద హక్కుల ప్రస్తావన ఉంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. భారత్‌ ఇటీవల ఈయూ, బ్రిటన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ప్రకారం నిర్బంధ లైసెన్సింగ్‌ విధానం ఉండదు. దాని స్థానంలో స్వచ్ఛంద విధానం ఉంటుంది. ఔషధ రంగం సహా అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. అమెరికాతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందంలో కూడా ఈ హక్కుల ప్రస్తావన ఉంటుందా అనేది తెలియడం లేదు. ఉంటే మాత్రం దాని ప్రభావం అనేక రంగాలపై తప్పనిసరిగా పడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. వివరాలన్నీ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ పోస్టులోనూ, అమెరికా ప్రభుత్వంలోని ఇతరుల పోస్టుల్లోనూ మాత్రమే కన్పిస్తున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు.

నాడు విమర్శించి నేడు ఎలా సమర్ధిస్తారు?
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు, అమెరికా నుంచి వెనిజులా చమురును కొనేందుకు మోడీ అంగీకరించారని ట్రంప్‌ తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదానికి ప్రధాన కారణం చమురే. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ట్రంప్‌ పాతిక శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్‌ పూర్తిగా నిలిపివేయలేదు. పైగా అమెరికా నిర్ణయాన్ని తప్పుపట్టింది. అమెరికా చర్య అన్యాయమని, సమర్ధనీయం కాదని, సహేతుకంగా లేదని మండిపడిన భారత్‌ ఇప్పుడు దానిని ఎలా సమర్ధిస్తోం దన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే అమెరికా డిమాండ్‌కు భారత్‌ తల వంచిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అన్ని రంగాలకూ ‘జీరో’ టారిఫేనా?
ట్రంప్‌ ప్రకటన ప్రకారం…భారత్‌పై విధించిన సుంకాలను 18 శాతానికి అమెరికా తగ్గించింది. అందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు ‘జీరో’ స్థాయికి చేరతాయి. ఈ హామీకి కాలపరిమితి ఏమైనా ఉన్నదా? జీరో సుంకాలు అన్ని రంగాలకూ వర్తిస్తాయా? జీరో సుంకానికి భారత్‌ అంగీకరించినప్పుడు అమెరికా ఇప్పటికీ తన 18 శాతం సుంకాన్ని ‘ప్రతీకార’ టారిఫ్‌ అని ఎందుకు పిలుస్తోంది?

అమెరికా వ్యవసాయోత్పత్తులకు తలుపులు బార్లా తెరుస్తారా?
వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కె ట్‌లో ప్రవేశిస్తాయని ఆ దేశ వాణిజ్య మంత్రి బ్రూక్‌ రాలిన్స్‌ చెప్పారు. తనకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లినా సరే కానీ భారత వ్యవసాయ దారుల ప్రయోజనాలను కాపాడి తీరతానని మోడీ గతంలో హామీ ఇచ్చారు. అమెరికా రైతాంగానికి భారతీయ వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశాన్ని కల్పిస్తే, అమెరికాకు వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను అనుమతిస్తే ఇప్పటికే కుదేలైన దేశీయ వ్యవసాయ రంగం మరింత నష్టపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇచ్చిన హామీ నుంచి మోడీ ఎందుకు వెనక్కి తగ్గారు? బారత అన్నదాతలపై పడే ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు.

బడ్జెట్‌లో ప్రస్తావనేది?
రెండు రోజుల క్రితం చట్టసభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అమెరికా నుంచి భారీ దిగుమతులకు సంబంధించిన ప్రస్తావనే లేదు. కొనుగోళ్లకు సంబంధించిన ప్రణాళికలూ లేవు. ట్రంప్‌ చెబుతున్న పరి మాణంలో ప్రభుత్వ వ్యయాన్ని సూచించే ఎలాంటి కేటాయింపులు, రుణ ప్రణాళిక కన్పించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -