Sunday, May 11, 2025
Homeఎడిట్ పేజిఉగ్రవాద ప్రమాదం వెనుక..

ఉగ్రవాద ప్రమాదం వెనుక..

- Advertisement -

భారత పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ప్రాంతంలో కాల్పులు, పేలుళ్లు జరుగుతున్నట్టు వార్తలొస్తు న్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ దాడులు చేస్తున్నదని, పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్‌ విమానాన్ని భారత వైమానిక రక్షణ దళాలు పఠాన్‌కోట్‌ సమీపంలో కూల్చినట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్‌ దళాలు మిస్సైల్స్‌, డ్రోన్స్‌ ప్రయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా, ఐరోపా యూనియన్లకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులు మార్కో, రుబియో, కాజా కల్లాస్‌లకు తాజా సమాచారమందించారు. ఇందుకు అమెరికా స్పందన విస్మయం కలిగిస్తున్నది. ఈ ఘర్షణలతో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వ్యాన్స్‌ ప్రకటించారు.ఉద్రిక్తతలు పెరగకుండా చూడండని ఇరుదేశాలకు విజ్ఞప్తి చేయగలమని మాత్రమే ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ పట్ల భారత దేశానికి కొన్ని ఆరోపణలున్నాయట. వాటికి పాకిస్థాన్‌ స్పందించిందట. ఈ ఉద్రిక్తతలకు, కంట్రోల్‌ చేయగలిగే తమ శక్తికి ఏమాత్రం సంబందం లేదన్నారు. దీనికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి.
పాకిస్థాన్‌, భారతదేశాల మధ్య ఉన్న సమస్యకు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నదంటున్నారు. పాకిస్థాన్‌ ఎప్పుడు పుట్టిందో కూడా ఆయనకు తెలియదా! ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యల చాటున, ఉపాధ్యక్షుడు జె.డి.వ్యాన్స్‌ కప్పదాటు మాటల మాటున అమెరికా బాధ్యతలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమిది. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది నిజమేనని పాకిస్థాన్‌ రక్షణ శాఖామంత్రి ఖ్వాజా అసీఫ్‌ బహిరంగంగానే అంగీకరించారు. అమెరికా, ఐరోపాల ఒత్తిడితోనే ఈ చెత్తపని చేశామని చెప్పుకున్నారు. స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాలపాటు అమెరికా విషకౌగిలిలో చేరిన పాకిస్థాన్‌ పాలకులు చేసిన పని అదే కదా! అఫ్ఘనిస్థాన్‌లో కూడా అభ్యుదయ పాలకులకు వ్యతిరేకంగా, సోవియట్‌కు వ్యతిరేకంగా తాలిబన్‌లను పెంచి పోషించింది అమెరికన్‌ సామ్రాజ్య వాదులే కదా! పాముకు పాలు పోస్తే ఏమౌతుందో రుచి చూశారు. తాము పెంచి పోషించిన తాలిబన్‌ ఉగ్రవా దుల దాడికి తామే గురికావల్సి వచ్చింది. పులిమీద స్వారీ అంటే ఏమిటో అమెరికాకు అనుభవంలోకి వచ్చింది. పహల్గాం ఉగ్రవాదుల చర్యల గురించి పాశ్చాత్య మీడియాలో ‘ఉగ్రవాదం’ అని కాకుండా ‘తీవ్రవాదం’ అని మాత్రమే చెప్పడం యాధృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత కొన్ని దశాబ్దాలపాటు ఇండియాకు పక్కలో బల్లెంలా పాకిస్థాన్‌లో ఎగదోసింది అమెరికా సామ్రాజ్య వాదులే కదా!
మతపరమైన విభజన సృష్టిం చటం, మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టటమే లక్ష్యంగా ఉగ్రవాద దాడి జరిగింది. కానీ, ఉగ్రవాదుల పన్నాగాలు ఫలించలేదు. కాశ్మీర్‌ ప్రజలు గానీ, యావత్తు భారతదేశం ప్రజానీకం గానీ ఉగ్రవాదానికి వ్యతి రేకంగా సమైక్యంగా స్పందించింది. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాశ్మీర్‌ లోయలో సాధారణ ముస్లింలు తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పర్యాటకుల ప్రాణాలను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు స్ఫూర్తిదాయకం. 1947లో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించిన వెంటనే పాకిస్థాన్‌ దురాక్రమణ దారులకు ఎదురొడ్డి నిల్చింది ఈ కాశ్మీరీ ప్రజానికమే. భారత్‌లో లేదా పాకిస్థాన్‌లో విలీనమయ్యేందుకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు భారత్‌లోనే విలీనం కావాలని కోరుకున్నది కూడా ఈ కాశ్మీరీ ముస్లింలే. ఇప్పుడు త్రివర్ణ పతాకం చేబూని పాకిస్థాన్‌ ముర్దాబాద్‌ అని నినదించింది కూడా ఈ కాశ్మీరీ ప్రజానీకమే. ఇవన్నీ కాశ్మీర్‌ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ నిర్వహించామని సైన్యాధికారులు ప్రకటించారు. ఈ చర్యను ఇప్పటి వరకు ఏదేశమూ తప్పు పట్టలేదు. దోషులను భారత్‌కు అప్పగించే విధంగా పాకిస్థాన్‌ మీద ఒత్తిడి కొనసాగించాలి. భారత ప్రజల ఐక్యత, దేశ సమైక్యతను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
దేశం ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమయంలో సోషల్‌ మీడియాలో గానీ, కొన్ని టీవీ చానళ్లలోగానీ జరిగిన ఉన్మాద పూరిత ప్రచారాలు ఆందోళన కలిగించాయి. ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు చేసిన బాధ్యతా రహిత ప్రయత్నాలే ఇవి. వీటి ఫలితంగా దేశంలో ఇరవైకి పైగా ప్రాంతాల్లో కాశ్మీరీల మీద, ముస్లింల మీద దాడులు జరి గాయి. ప్రజలు మతపరంగా చీలితే ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్టే. మతం అడిగి దాడిచేయడమంటేనే దేశంలో మత చిచ్చు పెట్టే లక్ష్యంతో ఈ దాడి చేశారని స్పష్టం. సమాజం పట్ల బాధ్యతగా వవ్యవహరించవలసిన వారు కూడా మతపరమైన విద్వేశాలు ప్రోత్సహిస్తే ఉగ్రవాదులు కోరుకున్నదే వీరు చేయడం కదా! సామాజికంగా చీలికలు పేలికలైన ఏదేశం కూడా ఎప్పటికీ గొప్ప దేశం కాజాలదు. మీడియా మీద కార్పొరేట్‌ పట్టు పెరుగుతున్న ఫలితమే ఇలాంటి అపసవ్య ధోరణులు. మరికొంత మంది పాకిస్థాన్‌ మీద దాడి చేయాలని, యుద్ధమే పరిష్కారమని వాదించారు. భారత్‌ ఇంకా ఎందుకు దాడి చేయటం లేదని గర్జిస్తూ కొందరు ఊగిపోయారు. యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేసిన అనుభవాలు ప్రపంచంలో ఇంతవరకు లేవు. తాలిబన్‌ ఉగ్రవాదాన్ని అణిచే పేరుతో యుద్ధం ప్రకటించి రెండు దశాబ్దాల పాటు అఫ్ఘనిస్థాన్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న అమెరికా పాలకులు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించలేక పోయారు. అంతేకాదు, అధికారాన్ని ఉగ్రవాదులకే అప్పగించి జారుకున్నారు. ఇంతకన్నా పెద్ద అనుభవం ఏమి కావాలి? సర్జికల్‌ స్ట్రైక్స్‌ గానీ, బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ గానీ, ఇప్పుడు చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ గానీ ఉగ్రవాద సంస్థలకు, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ పాల కులకు హెచ్చరికలు మాత్రమే. ఉగ్రవాద నిర్మూలనకు అనేక ఇతర చర్యలు తీసుకోవలసి ఉంటుంది. సోషల్‌ మీడియాలోను, ఇతర మీడియా సంస్థల్లోను బాధ్యతారహితమైన ప్రచారాలెన్ని జరిగినా దేశ ప్రజలు సంయమనం పాటించడం అభినంద నీయం. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కన్పిస్తున్నది.
సరిహద్దు ఉద్రిక్తతలు ఎన్ని రోజులుంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇది యుద్ధానికి దారి తీస్తుందా లేదా కూడా చెప్పలేం. మనకు సంబంధించినంత వరకు యుద్ధాన్ని కోరుకోకూడదు. యుద్ధంలో గెలుపోటములకంటే ఇరుపక్షాలు విధ్వంసానికి గురవుతాయనేది నిజం. దీని ఫలితం ఈ దేశాల అభివృద్ధి మీద దీర్ఘకాలికంగా ఉంటుంది. యుద్ధం కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో ఆగుతుందన్న గ్యారంటీ లేదు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం యేండ్లుగా కొనసాగు తూనే ఉన్నది. దీనివల్ల ఆయుధాలు అమ్ముకొని అమెరికా లాభపడుతుం డవచ్చు. కానీ, నష్టపోతున్నది ఆ రెండు దేశాలు. ఇక్కడ కూడా పాకిస్థాన్‌ పాలకుల మీద తమ పలుకుబడిని ఉపయోగించి ఉగ్రవాద నిర్మూలనకు సహకరించవలసింది పోయి, తమకేమీ సంబంధం లేదన్నట్టుగా అమెరికా తప్పించుకు నేందుకు చూడటం ఆశ్చర్య కరం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే కూడా ఆయుధాలమ్ముకొని అమెరికా బతకవచ్చు. నష్టపోయేది మాత్రం ఈ రెండు దేశాలు. పాకిస్థాన్‌ సైనికాధికా రులకు, పాలకులకు ఇప్పుడు యుద్ధ వాతావరణం కావాలి. వారు తమ దేశ ప్రజల నుండి ఎప్పుడూ లేనంత దూరమయ్యారు. ఇప్పుడు ఇండియా బూచిని చూపించి వారిని అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనకు సంబంధించినంత వరకు ఉగ్రవాదాన్ని అంతం చేయటమే మన అవసరం. ఇందుకోసం ఉగ్రవాద మూలాలకు ఆధారాలు సేకరించి ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ముందుంచాలి. పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందకుండా ఆంక్షలు విధించేటట్టు చూడాలి. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేసే ప్రయత్నాలు కొనసాగించాలి.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేయకూడదు. ఘటన అనంతరం ఉగ్రవాదులను హెచ్చరించేందుకు ప్రధాని మోడీ బీహార్‌ గడ్డను ఎంచుకోవటం ఇలాంటి అభిప్రాయాలకు తావిచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు పర్యవసానాలు కూడా ఆత్మ విమర్శనాపూర్వకంగా పరిశీలించుకోవాలి. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హౌదాను పునరుద్ధరించటం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆ రాష్ట్ర ప్రజలు భాగస్వాములను చేయాలి. ఉగ్రవాదులకు కులం, మతం, ప్రాంతం, చట్టం, న్యాయం, ధర్మం ఇవేవీ పట్టవు. నిర్ధిష్ట లక్ష్యం కోసం విధ్వంసం సృష్టించటం, హత్యాకాండకు పాల్పడటమే వారి పని. ప్రభుత్వాలు అట్లా కాదు. చట్టబద్ధమైన పాలన నెలకొల్పే బాధ్యత పాలకులది. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ చట్టబద్ధంగానే ఉండాలి. జాతీయ భద్రత పేరుతో రాజ్యాంగ ప్రమాణాలను, పరిపాలనా పద్ధతులను పాలకులు అతిక్రమించిన తీరును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పహల్గాం దాడికిి వ్యతిరేకంగా కాశ్మీరీ ప్రజల స్పందన అభినందనీయం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వారిని సమీకరించటానికి ఇది అనువైన సమయం. ప్రజాస్వామ్య హక్కులు గ్యారంటీ చేయడం ద్వారా ఉగ్రవాదులను ఒంటరిపాటు చేయాలి. మోడీని సమర్ధించడమో లేక పాకిస్థాన్‌ను దూషించటమో లేక ముస్లింలను ద్వేషించటమో దేశభక్తిగా పరిగణిస్తున్నారు. ఈ ధోరణి మారాలి. ప్రజలను ప్రేమించటమే దేశభక్తి. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయటమే దేశభక్తి. ఇప్పుడు ఉగ్రవాదం ప్రజల శత్రువు. ఉగ్రవాద నిర్మూలనకే ప్రాధాన్యతనివ్వాలి.
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం పర్యాటకులకు ఆటో, క్యాబ్‌, బస్సు డ్రైవర్లు, హార్స్‌ రైడర్లు, హమాలీలు ఉచిత సేవలందిస్తున్న సమయంలోనే విమానయాన సంస్థలు మాత్రం హేయమైన ధోరణి ప్రదర్శించాయి. తిరుగు ప్రయాణం కోసం ప్రయాణీకుల ఆందోళనను సొమ్ము చేసుకున్నాయి. రూ.6 వేలున్న విమానం టికెట్‌ ధర 60-70 వేలకు పెంచారు. ఇల్లు కాలుతుంటే బొగ్గులేరుకుంటున్నట్టున్నది కదా! పెట్టుబడిదారులు లాభం కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మార్కెట్‌ ఆర్థికవ్యవస్థ మోజులో వున్నది. ప్రజా ప్రయోజనం మీద దృష్టి పెట్టడం పరీక్షే. ఇప్పుడు దేశానికి కావాల్సింది ప్రజలు, ప్రజా ప్రయోజనం. రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు పెనవేసుకొని నడుస్తున్న కాలమిది. అందుకు భిన్నంగా ప్రజా ప్రయోజనాలతో పెనవేసుకున్న విధానాలు కావాలి.
ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -