మహాభారతంలో ఏకలవ్యుడి కథ అందరికీ బాగా తెలిసిందే. అయితే దాన్ని పాండవుల వీరత్వగాథల్లోనూ, వారి ధర్మ పోరాటం గొప్పల మాటునా దాచేశారు. యుద్ధ విద్యా నైపుణ్యం సంపూర్ణంగా కైవశం చేసుకోవడానికి ఏక లవ్యుడు సల్పిన నిర్విరామ కృషి పట్ల ద్రోణాచార్యుడు కనబర్చిన పరమ క్రూరత్వం కాలాతీతమైన ఈ ఇతిహాసంలో ఒక అపశ్రుతిలా తారసిల్లుతుంది. గతాన్ని తిరిగి తీసుకొచ్చే వినాశకర ప్రయత్నాలలో వున్న నవీన హిందూత్వ ప్రచారకులు ఆ ఘోర కుల వివక్షతలనే ‘ప్రజాస్వామ్యానికి మాతక’ అనే కొత్త ముద్రతో తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. ఐ.సి.హెచ్.ఆర్ లో ఆరెస్సెస్ తెచ్చిపెట్టిన కీలక సంచాలకులు ఎర్రకోట బురుజుల పైనుంచి మోడీ చేసిన ప్రచార ప్రవచనాల చలామణి కోసం తప్పుడు దక్పథాలకు కుహనా చరిత్రపాఠం జోడిస్తున్నారు. అలాంటి కసరత్తులు సాగుతున్నంత వరకూ ఏకలవ్యుడు పక్కకు నెట్టివేయబడుతూనే వుంటాడు.
సిజెఐపై చెప్పుదాడి
రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయ్ పై కోర్టు గదిలో ఒక లాయర్ చెప్పు విసిరిన రోజు నుంచి బ్రాహ్మణవాద దురభిప్రాయాలు, సనాతన ధర్మ సమర్థనలు పెరిగిపోతూనే వున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర గల ఖజురాహో దేవాలయ సముదాయంలో విష్ణుమూర్తి విగ్రహానికి పూజలు చేసుకోవడాన్ని అనుమతించాలనే పిటిషన్‌ను గవాయ్ ధర్మాసనం తోసిపుచ్చింది. అలాంటి దారుణమైన ఆ కోర్కెను సంబంధిత చట్టం ఆమోదించబోదని తెలిసినప్పటికీ దాన్ని వారు మొండిగా అడుగుతూ వచ్చారు. చట్టంపైన నమ్మకం ఆధిక్యత సాధించడం అనుమతించజాలదని చెబుతూ-బహుశా విష్ణుమూర్తి మీ సమస్య పరిష్కరిస్తారేమో చూడండని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం వారికి మింగుడు పడటం లేదు.
దీనిపై దేశమంతా తీవ్ర నిరసన వ్యక్తమైంది. మామూలుగా ఇలాంటి దుష్టచర్యలపై మౌనం పాటించే ప్రధాని కూడా దానినుంచి విడగొట్టుకోవలసి వచ్చింది. ”భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ గారితో మాట్లాడాను. ఈ రోజున సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే దాడి జరగడం భారతీయులందరకీ ఆగ్రహం తెప్పించింది. మన సమాజంలో అలాంటి తుచ్ఛమైన పనులకు అనుమతి వుండదు. అది పూర్తిగా ఖండనీయం. ఇంత జరిగినా కూడా జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన నిబ్బరాన్ని నేను అభినందిస్తున్నాను. న్యాయం అనే విలువలను కాపాడ్డానికి, రాజ్యాంగ స్ఫూర్తిని దృఢతరం చేసేందుకు ఆయన ఎంత నిబద్దతతో వున్నారో దీన్ని బట్టే తెలుస్తున్నది.” అని మోడీ ట్వీట్ చేశారు. అయితే మరోవైపున వారి ట్రోల్ బ్రిగేడ్ మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే వచ్చింది.
ఐపిఎస్‌తో సహా బలి
మరో దారుణమైన ఘటనలో హర్యానాకు చెందిన ఐపిఎస్ అధికారి పూరణ్ కుమార్ అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. ఆ అధికారి ఆఖరి లేఖలో వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా వున్నాయి. దాంతోపాటు కులం గురించిన చిన్నచూపుతో వేధింపులు, అవమానాలు సాగించే తీరు ఎలా వుంటుందో కూడా స్పష్టం చేస్తున్నది. కులపరమైన అవమానాలనూ అణచివేతలనూ బయటపెట్టినందుకుగాను ఒక సీనియర్ పోలీస్ అధికారి ప్రాణాలతో మూల్యం చెల్లించాల్సి రావడం అత్యంత విచారకరమైన విషయం. ఈ వివక్షత, వేధింపుల గురించి ప్రభుత్వానికి అప్పటి హోం మంత్రితో సహా అన్ని స్థాయిలలోనూ ఫిర్యాదులు చేసినప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు.
ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే వుండటం గమనించదగింది. 2025 అక్టోబర్ ఒకటవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో హరిఓం అనే దళితుడిని అమానుషంగా చంపేశారు. అతనేదో ”డ్రోన్ల దొంగ” అని ఆరోపించారు. తనను క్రూరంగా కొట్టి రైల్వే పట్టాల పక్కన పడేసి పోతే తర్వాత గాయాలతో మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై ఊచకోత ప్రమాదకర స్థాయికి చేరింది. 2022లో షెడ్యూల్డు కులాలకు సంబంధించిన చట్టం కింద 51,656 కేసులు నమోదైతే వాటిలో 12,287 అంటే 23.78 శాతం యు.పి లోనే. 8651 కేసులు (16.75 శాతం)తో ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్, 7732 (14.97 శాతం)తో మధ్యప్రదేశ్ వున్నాయి. పార్లమెంటులో ఈ విషయమై ప్రభుత్వం ఇచ్చిన నివేదికలన్నీ పెరుగుదలనే సూచిస్తున్నాయి.
భావజాల భూమిక
ఇదేదో కేవలం వట్టి అంకెల పెరుగుదల మాత్రమే కాదు. రోజువారీగా మనం దళితులపై జరుగుతున్న లైంగికదాడులు, నేరాలు చూస్తుంటే పరిస్థితి తీవ్రత తెలుస్తుంది. ఊచకోతలు, తరగతి గదుల్లో హింస, విద్వేష దాడులు, మహిళలపై బలాత్కారాలు వంటివన్నీ ఇందుకు ఉదాహరణలే. పోలీసుల నిర్లక్ష్యం, ఉదాసీనత ఈ పోకడలను ఇంకా తీవ్రం చేస్తున్నది. 1950 భారత రాజ్యాంగం అస్పృశ్యతను నిషేధించింది. అయితే మొదటిసారిగా నిర్దిష్టంగా దళితులు, ఆదివాసులపై సాగే మౌఖిక, భౌతిక, రాజకీయ, తాంత్రిక, ప్రతీకాత్మక హింసలన్నిటినీ లైంగికదాడులని నిర్దిష్టంగా పేర్కొన్నది అత్యాచారాల నిరోధ చట్టమే. అయితే ఈ లైంగికదాడులు ఇంతగా పెరిగిపోతున్నాయంటే ఈ చట్టం కింద పెట్టిన కేసులలో శిక్షలు పడటం చాలా తక్కువగా జరుగుతున్నదనీ, ఆ నిందితులలో అత్యధికులు అసలు కోర్టుల వరకూ రావడమే లేదని అర్థమవుతుంది.
ఒక ఉద్వేగభరిత చర్చ గతంలో దేశమంతా ఆవేశం నింపింది. రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంలో రెచ్చిపోయిన అమిత్‌షా కోపతాపాలు కట్టు తప్పాయి. అలా జరగడం అంతకు ముందు కొద్ది సంవత్స రాల కిందట ఊహించగలిగేవాళ్లం కూడా కాదు. దేశంలో బాబాసాహెబ్ పేరు జపించడం ఫ్యాషన్‌గా మారిందని చాలా రెచ్చగొట్టే రీతిలో అమిత్‌షా వ్యంగ్యంగా నోరు పారేసుకున్నారు. అవహేళనగా మాట్లాడారు. పదేపదే అంబేద్కర్ పేర కేకలేస్తే స్వర్గంలో దేవుడితో లీనమవుతామని వారు భ్రమపడుతున్నారని ఆయన దబాయించారు. దేవునితో లీనం కావడమే మనిషికి అంతిమ మోక్షమని చెప్పే నిచ్చెనమెట్ల బ్రాహ్మణీయ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నమే ఆయన మాటలన్నది చాలా స్పష్టం.
బ్రాహ్మణీయ బోధనలు
అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ చేతిలో పెట్టుకుని చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నాయకత్వం వహిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని భూస్థాపితం చేయాలనీ, హిందూత్వ రాజ్యాన్ని పాదుకొల్పాలని తహతహలాడుతోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రంపై ఆధారపడి భారత జాతీయత ఆవిర్భవించింది. సమ్మిళిత సమాఖ్య బహుళ సంస్కృతుల రాజకీయ వ్యవస్థతో కలసి వుండే సూత్రమది. కానీ ఆరెస్సెస్ దాని స్థానంలో మత ప్రాతిపదికగా నడిచే జాతీయతను రుద్దాలని చూస్తున్నది. గోల్వాల్కర్ చెప్పినట్టు హిందూ యేతరులను దిగువస్థాయి ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలంటోంది. భిన్నత్వం వున్నా సమాన పౌరసత్వం అనే భావనకే విరుద్ధమైన కొత్త నిర్వచనం ఇది.
ఆరెస్సెస్ చెప్పే ఏకపక్ష ఫాసిస్టు హిందూ రాజ్య పథకాన్ని అడ్డుకోవడానికి ఇప్పటివరకూ రాజ్యాంగం శిలాసదృశంగా దృఢంగా అడ్డుకుని నిలబడింది. బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థనూ, మనుధర్మ సూత్రాలనూ న్యాయబద్దం చేసేందుకు బరితెగించి చేస్తున్న ఈ కసరత్తుపై ఎలాంటి వివరణా అవసరం లేదు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదీ కాదు. భారత రాజ్యాంగం పట్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఆరెస్సెస్‌కు గల వ్యతిరేక భావన చరిత్రలో బాగా నమోదైవున్నదే. అమిత్‌షా దాన్నే వెల్లడించారు. రాజ్యాంగం మౌలిక సూత్రాలపట్ల ఆమూలాగ్రం వ్యతిరేకతను అవి ప్రతిబింబిస్తున్నాయి. రాజ్యాంగానికి పునాదిగా నిలిచిన సామాజిక లింగ సమానత్వాన్ని వెనక్కు కొట్టాలని చూస్తున్నాయి.
తక్షణం జరగాల్సింది
సావర్కర్ వ్యాఖ్యానాలు వారి భావజాలం నిజస్వరూప లోతులు చెబుతున్నాయి. రాజ్యాంగం భారతీయేతరం అని ఆయన బండగా చెప్పేశాడు. రాజ్యాంగ ప్రక్రియకు ప్రాచీన స్మృతిశాసనమైన మనుస్మృతి మార్గదర్శకం కావాలని కీర్తించాడు. 1949 నవంబరు 30న ఇవే భావాలను వారి అధికార పత్రిక ఆర్గనైజర్‌లో ఆరెస్సెస్ సుస్పష్టంగా ప్రకటించింది. ”నూతన రాజ్యాంగానికి భారతీయత లేదనీ అది భారత ప్రజల సంస్కృతీ మత విశ్వాసాలకు విదేశీయమైందనీ” ఆర్గనైజర్ రాసింది. రాజ్యాంగం కన్నా మనుస్మృతిపై నిరంతర ధ్యాస ఆరెస్సెస్ ఆలోచనల్లో గూడు కట్టుకుని వుంటుంది. లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగానికీ… హిందూత్వ శక్తులు వాంఛించే మత రాజ్యానికీ మధ్యలో అదే సైద్ధాంతికంగా గట్టి అడ్డంకి అవుతుంది. మత రాజ్యం పట్ల హిందూత్వ శక్తులు మొగ్గు చూపుతాయి. మనుస్మృతి వర్ణవివక్షను పెంచాలంటుంది. భారత రాజ్యాంగం చెప్పే సమ్మిళిత సమానతా సూత్రాలకు ఇది పూర్తిగా, ప్రత్యక్షంగా విరుద్ధం.
సమానత్వం, సామాజిక న్యాయం ఆధారభూతాలుగా ఒక న్యాయమైన సమాజానికి పునాది వేయడం రాజ్యాంగం ఇచ్చిన దోహదం. దీన్ని ఇప్పుడు సాగుతున్న ధోరణిని ఒకటిగా చెప్పడమంటే ఈ వారసత్వానికిగల దీర్ఘకాలిక ప్రాధాన్యతను దెబ్బ తీయడమే అవుతుంది. ఆరెస్సెస్ ఇదివరకటి కాలంలో అంబేద్కర్ వారసత్వంతో నేరుగా ఘర్షణ వస్తుందనే భయంతో అస్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. దానివల్ల తన ఎన్నికల అవసరాలకు నష్టం కలగవచ్చునని జంకింది. అయితే వారు చెప్పే నిచ్చెనమెట్ల వెలి సిద్ధాంతాలకు ఇంక ఏ మాత్రం ముసుగు అవసరం లేకుండా పోయింది. రాజ్యాంగ నిర్మాతలు చాటి చెప్పిన రాజ్యాంగ సూత్రాలు చారిత్రికంగా హిందూత్వ శక్తులకు ఏనాడూ మింగుడు పడలేదు. ప్రస్తుతం మనం చూస్తున్న విషపూరితమైన దుందుడుకు దాడుల సారాంశం అదే. కనక హిందూత్వ దళిత వ్యతిరేతకను ఎదుర్కోవడం ఇప్పుడు తక్షణ అవసరంగా మారుతున్నది.
(అక్టోబర్ 22 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
దళితులపై విషపూరిత దాడుల వెనక…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



