Friday, February 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆ..చరణాల వెనుక!

ఆ..చరణాల వెనుక!

- Advertisement -

భారతదేశం అంటే కేవలం ఒక భూభాగం కాదు, అది కొన్ని వేల ఏళ్ల వైవిధ్యభరిత సంస్కృతుల సమ్మేళనం. ఈ దేశపు పునాదులు ‘బహుళత్వ’ (Pluralism) అనే సిద్ధాంతంపై నిర్మించబడ్డాయి. మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ గీతాన్ని దార్శనీకంగా భిన్నత్వాన్ని కనుమరుగు కానివ్వకుండా ఏకత్వాన్ని చాటడానికి ”జన గణ మన” జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం జనవరి 28న జారిచేసిన ఉత్తర్వు ఇంతకాలం కాపాడుకుంటున్న ప్రాధాన్యతా క్రమాన్ని మార్చేసింది. జాతీయ గీతానికి ముందు జాతీయ గేయమైన వందే మాతరాన్ని తప్పనిసరి ఆలపించాలని ఆదేశించింది. దీనివల్ల జాతీయగీతానికి అగ్ర ప్రాధాన్యం కట్టబెట్టిన రాజ్యాంగ ఆధికరణం 51(ఎం)ని అగౌరవపరచడమే. ఇటీవల కాలంలో జాతీయ చిహ్నాలను, గేయాలను మార్చడం ద్వారా ఒకే రకమైన భావజాలాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగానే ‘వందేమాతరం’ పూర్తి చరణాలను తెరపైకి తెస్తూ, దానిని ఒక దేశభక్తి పరీక్షగా మారుస్తున్నారు. అసలు ఈ చరణాల పొడిగింపు వెనుక ఉన్న మర్మమేమిటి? ఇది దేశపు బహుళత్వానికి ఎలా గొడ్డలిపెట్టుగా మారుతోంది?

బంకిం చంద్ర ఛటర్జీ 1882లో తన ‘ఆనందమఠం’ నవలలో వందేమాతరాన్ని చేర్చినప్పుడు, అది బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తుతించే శక్తివంతమైన గేయం. ఒక ఉత్తేజిత నినాదంగా పనిచేసిన మాట నిజమే. కానీ, మన రాజ్యాంగ నిర్మాతలు భారతీయులందరినీ ఒకే తాటిపైకి తెచ్చే క్రమంలో ఎంతో విజ్ఞతతో వ్యవహరించారు. 1950లో రాజ్యాంగ పరిషత్‌ చర్చల అనంతరం, కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా స్వీకరించారు. ఆ నిర్ణయం వెనుక లోతైన లౌకికవాద ఆలోచన ఉంది. బహుళత్వాన్ని నింపుకుని అందరిచేత గౌరవించబడింది. 1950 జనవరి 24న ”జనగణమన”ను జాతీయగీతంగా అధికారికంగా స్వీకరించింది. 52 సెకన్ల ఆలాపనగా నిర్దేశించింది. ఒక్క చరణంలోనే భారత దేశాన్ని పంజాబ్‌, సింధు, గుజరాత్‌, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ ప్రాంతాల సమ్మిశ్రితంగా పేర్కొంది. బహుళ అస్తిత్వాలున్న ఏకత్వం, ఐక్యతను చాటిన గీతం. కనుకనే జాతీయ గీతమైంది. జాతీ గౌరవాన్ని ఏకీభవిస్తూ నిటారుగా నిలబడి నేటికి ఆలపిస్తున్నా గీతం ఇదీ.

వందేమాతరంలోని తొలి రెండు చరణాలు ప్రకృతిని ఆరాధిస్తాయి. సుజలాం (మంచి నీరు), సుఫలాం (మంచి పంటలు), మలయజ శీతలాం (చల్లని గాలి), సస్య శ్యామలాం (పచ్చని పొలాలు) అంటూ సాగే ఈ సాహిత్యం భౌగోళిక మాతృభూమిని గౌరవిస్తుంది. ఇది హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, సిక్కులకైనా లేదా ఏ మతమూ లేని లౌకికవాదికైనా సమానంగా ఆమోద యోగ్యం. ప్రకృతిని ప్రేమించడం అందరి ఉమ్మడి ధర్మం. కానీ, వివాదం ఎక్కడ మొదలవుతుందంటే.. గేయంలోని 4, 5 చరణాల్లోకి వెళ్లినప్పుడు. అక్కడ దేశం ఒక భౌగోళిక ప్రాంతం నుండి ‘మతపరమైన దేవత’గా రూపాంతరం చెందుతుంది. ”తోమారయి ప్రతిమా గడి మందిరే మందిరే” (ప్రతి గుడిలో నీ విగ్రహాన్నే ప్రతిష్టిస్తాం), ”త్వమ్‌ హి దుర్గా” (నీవే దుర్గాదేవివి), ”కమలా కమలదళ విహారిణీ” (నీవే లక్ష్మీదేవివి) అంటూ సాగే సాహిత్యం పూర్తిగా హిందూ పురాణ గాథలతో ముడిపడి ఉంది. భారత దేశం కేవలం ఒకే మతానికి చెందిన దేశం కాదు. ఇక్కడ విగ్రహారాధనను వ్యతిరేకించే మతాలు ఉన్నాయి, నిరీశ్వర వాదులు ఉన్నారు. ఒక నిర్దిష్ట మత సంప్రదాయాలను ప్రతిబింబించే చరణాలను ‘జాతీయ గేయం’ పేరుతో అందరిపై రుద్దడం అంటే, ఇతర వర్గాల అస్తిత్వాన్ని విస్మరించడమే.

ప్రస్తుతం సాగుతున్న ఈ పరిణామం ‘సాంస్కృతిక ఆధిపత్యానికి’ (Cultural Hegemony) ఒక నిదర్శనం. ప్రాచీన కాలం నుండి ఉన్న వివక్షాపూరిత ఆలోచనలు, అంటే ఒకే రకమైన సంస్కృతి శ్రేష్టమైనదని భావించే ధోరణిని మళ్ళీ చట్టబద్ధం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. పూర్తి గేయాన్ని పాడటాన్ని ‘దేశభక్తి’కి కొలమానంగా పెట్టినప్పుడు, అది ప్రజాస్వామ్య వాదులను, మైనారిటీలను వేధించే సాధనంగా మారుతుంది. ఇది ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సింది పోయి, విభజన రేఖలను పెంచుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో జాతీయత అనేది ప్రజల మధ్య సహజంగా ఉండాలి కానీ, అది ఒక ‘ఆర్డర్‌’ ద్వారా రాకూడదు. ఈ చరణాల పొడిగింపు వల్ల కలిగే ప్రమాదాలు ఇవే: రాజ్యాంగం కల్పించిన లౌకికవాద పునాదులు కదిలిపోతాయి. వైవిధ్యాన్ని సమాధి చేసి, దేశాన్ని ఒకే రంగులోకి (Monoculture) మార్చే ప్రమాదం ఉంది.

దీనివల్ల నిరుద్యోగం, పేదరికం, దోపిడీ వంటి వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. దేశభక్తి అంటే కేవలం గేయాలు పాడటం కాదు, ఈ దేశంలోని ప్రతి మనిషిని, ప్రతి సంస్కృతిని గౌరవించడం. మన పౌర హక్కులను, బహుళత్వ భావనను కాపాడుకోవడమే నేటి తక్షణ కర్తవ్యం. అణచివేత ఏ రూపంలో వచ్చినా, అది ‘వందేమాతరం’ వంటి పవిత్ర నినాదాల చాటున దాక్కున్నా.. దాని వెనుక ఉన్న ఆధిపత్య ఉద్దేశాలను గుర్తించి ఎండగట్టాలి.మనుస్మృతి చీకట్లను ఎదిరించి, సమసమాజం కోసం పోరాడటమే నిజమైన జాతీయత. ప్రజా సంస్కృతి వర్ధిల్లాలంటే.. రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలనే మన ఊపిరిగా మలుచుకోవాలి. భారతదేశ ”ఆత్మ” మరెక్కడో లేదు అది బహుళత్వంలోనే ఉంది. దానిని కాపాడుకోవడమే మనందరి బాధ్యత. అప్పుడే జయ జయ జయ జయహే!

భూపతి వెంకటేశ్వర్లు 9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -