Tuesday, May 20, 2025
Homeజాతీయం'జీరో' సుంకాల వెనుక…

‘జీరో’ సుంకాల వెనుక…

- Advertisement -

– అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట
– ఇప్పటికే కొన్ని వస్తువులపై టారిఫ్‌ల తగ్గింపు
– స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌ తూట్లు
న్యూఢిల్లీ:
అమెరికా వస్తువులపై సుంకాలు విధించబోనని (జీరో టారిఫ్‌) భారత్‌ ప్రతిపాదించిందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అధిక దిగుమతి, ఎగుమతి ఖర్చులను నివారించడానికి భారత్‌ ఈ ప్రతిపాదన చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్‌ మాటలను భారత్‌ తోసిపుచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలకు అమెరికా ఇచ్చిన 90రోజుల విరామ గడువు ముగిసేలోగానే వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. ఈ నెల 8న బ్రిటన్‌తో శ్వేతసౌధం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి రెండు రోజుల ముందుగానే బ్రిటన్‌తో మన ప్రభుత్వం అలాంటి ఒప్పందమే చేసుకుంది.
ఒప్పందం దిశగా వేగంగా అడుగులు
ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాత భారత ఈక్విటీ బెంచ్‌మార్కులు సుమారు ఒకటిన్నర శాతం పెరిగాయి. నిఫ్టీ-50 1.6 శాతం, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.7 శాతం పెరిగి గత ఏడు నెలల గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించిన తొలి దేశాలలో భారత్‌ కూడా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాదే ఖరారు చేసుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. గత నెలలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మన దేశంలో పర్యటించి ప్రధాని మోడీని కలిశారు. వాణిజ్య ఒప్పందాన్ని ‘మంచి పురోగతి’గా ఆయన అభివర్ణించారు.
ఒప్పందానికి ముందే టారిఫ్‌ తగ్గింపులు
ట్రంప్‌పై దేశ ప్రజలలో వ్యక్తమవుతున్న అసమ్మతిని చల్లార్చడానికి మోడీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. బోర్బన్‌ విస్కీ వంటి అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని 150 శాతం నుండి 100 శాతానికి తగ్గించింది. అలాగే హార్లే-డేవిడ్‌సన్‌ మోటారు సైకిళ్లపై విధించిన టారిఫ్‌ను కూడా 50 నుండి 40 శాతానికి తగ్గించింది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలలో భాగంగా కారు విడిభాగాలపై భారత్‌ సున్నా (జీరో) సుంకాన్ని ప్రతిపాదించింది. వాణిజ్య చర్చలను ముందుకు తీసుకొని పోవడానికి భారత అధికారుల బృందం ఈ నెలలో అమెరికాలో పర్యటించబోతోంది. ఈ బృందంతో పాటు మన వాణిజ్య మంత్రి పీయుష్‌ గోయల్‌ కూడా వెళతారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలలో భారత్‌ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోందని చెప్పడానికి ఇది ఓ సంకేతం. ఉక్కు, అల్యూమినియంపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిగా తానూ సుంకాలు విధిస్తానని భారత్‌ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్‌ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒప్పందపు నిబంధనలేమిటి?
మొదటి దశ ఒప్పందంలో భాగంగా 60 శాతం అమెరికా దిగుమతులపై సుంకాలు విధించబోనని భారత్‌ ప్రతిపాదించిందని, అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న సుమారు 90 శాతం వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చిందని రాయిటర్స్‌ తెలియజేసింది. భారత్‌ ప్రతిపాదనల కారణంగా రెండు దేశాల సుంకాల మధ్య సగటు వ్యత్యాసం తొమ్మిది శాతం పాయింట్లు తగ్గుతుంది. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌ ఎదుర్కొంటున్న వాణిజ్య అవరోధారాలు గణనీయంగా తగ్గిపోతాయి. వాణిజ్య ఒప్పందం అమెరికాకు మరింత ఆకర్షణీయంగా ఉండేలా అధిక విలువున్న అమెరికా వస్తువుల దిగుమతులపై నిబంధనలను సరళతరం చేస్తానని కూడా భారత్‌ ప్రతిపాదించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. నిబంధనలు సరళతరం చేసే ఉత్పత్తులలో విమానాలు, విద్యుత్‌ వాహనాలు, వైద్య పరికరాలు, హైడ్రోకార్బన్లు కూడా ఉన్నాయి. కృత్రిమ మేధ, బయోటెక్‌, సెమీకండక్టర్లు వంటి కీలక సాంకేతిక రంగాల విషయంలో బ్రిటన్‌, జపాన్‌ వంటి మిత్ర దేశాలతో అమెరికా ఎలా వ్యవహరిస్తోందో తమతో కూడా అలాగే ఉండాలని భారత్‌ కోరుకుంటోంది.
‘జీరో’ టారిఫ్‌కు అడ్డంకులు
సుంకాల నుండి మినహాయింపులు పొందాలన్న భారత్‌ ఆకాంక్ష రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. పరస్పర ఆసక్తి కలిగిన కొన్ని వస్తువులకు మాత్రమే సుంకాల నుండి మినహాయింపులు లభించాయి. ట్రంప్‌ ఇటీవల కొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఇవి విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధంగా కొన్ని వస్తువులకు మాత్రమే వర్తించేలా ఉన్నాయి. భారత్‌, అమెరికా అధికారుల వ్యాఖ్యలను చూస్తుంటే ద్వైపాక్షిక ఒప్పందంలో కూడా ఇలాంటి ఏర్పాట్లే ఉంటాయని భావించవచ్చు. ఇక దేశంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలు కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అడ్డ్డంకిగా ఉన్నాయి. చౌకగా వస్తున్న దిగుమతుల నుండి దేశంలోని వ్యవసాయ మార్కెట్లను కాపాడడానికి భారత్‌ చాలా కాలంగా సుంకాల అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ట్రంప్‌తో కుదుర్చుకునే ఒప్పందంలో మోడీ ఆ రక్షణ చర్యలను బలహీనపరుస్తారేమోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో సందేహాలు, సమస్యలు ఉన్నప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకే భారత్‌ ముందడుగు వేస్తోంది. అనేక వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ గత వారం బ్రిటన్‌తో ఒప్పందంపై సంతకాలు చేసిన తరహాలోనే వాషింగ్టన్‌తో కుదుర్చుకునే ఒప్పందం కూడా ఉంటుందని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.
భిన్న వాదనలు
‘భారత్‌లో అమ్మకాలు జరపడం చాలా కష్టం. అక్కడ సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడేమో జీరో టారిఫ్‌ అనిచెబుతున్నారు’ అని ఖతార్‌ రాజధాని దోహాలో ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ చెప్పారు. అయితే ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్‌ దీనిపై వివరణ ఇస్తూ ట్రంప్‌ వాదనను తిప్పికొట్టారు. అంతా పూర్తయ్యే వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేమని స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం జరిగే వరకూ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం తొందర పాటే అవుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన ఈ విస్పష్ట ప్రకటనపై ట్రంప్‌ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా మీడియా కోరినప్పుడు మన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.
ద్వైపాక్షిక వాణిజ్యం ఇలా…
భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. గత సంవత్సరం 129 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. పోయిన ఏడాది అమెరికాతో భారత్‌ 45.7 బిలియన్‌ డాలర్ల మిగులు సాధించింది. ముఖ్యంగా ఔషధ ఉత్పత్తులు, విద్యుత్‌ యంత్రాలు, ఆభరణాల ఎగుమతులు బాగా జరిగాయి. భారత్‌ విధిస్తున్న సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అవి తమ వ్యాపారాలను దెబ్బతీశాయని ఫిర్యాదు చేస్తున్న ట్రంప్‌ భారత్‌పై 27 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తానని ప్రకటించారు. అయితే వాటి అమలును జూలై ప్రారంభం వరకూ వాయిదా వేశారు. ఈ విరామ సమయంలో భారత్‌ సహా పలు దేశాలపై పది శాతం బేస్‌ టారిఫ్‌ కొనసాగుతోంది. అమెరికా 3.3 శాతం టారిఫ్‌ విధిస్తే మన దేశం సగటున 17 శాతం విధిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -