పోటాపోటీగా అభ్యర్థులు హామీలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. పోటాపోటీగా హామీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. బాండ్ పేపర్లు, మేనిఫెస్టోతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశచూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.
గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఉదయం వేళల్లో ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు, సాయంత్రం కాగానే ఓటర్లను ఆకట్టుకు నేందుకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. కాగా కాటారం డివిజన్ పరిధిలో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.



